Congress Vs Modi : నన్ను అవమానించడానికి కాంగ్రెస్‌లో పోటాపోటీ : మోదీ
ABN, First Publish Date - 2022-12-01T15:06:41+05:30
శ్రీరాముని భక్తులు ఉన్న గడ్డలో ఓ వ్యక్తిని రావణుడని అభివర్ణించడం సరికాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
గాంధీ నగర్ : శ్రీరాముని భక్తులు ఉన్న గడ్డలో ఓ వ్యక్తిని రావణుడని అభివర్ణించడం సరికాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. తనను అవమానించేందుకు కాంగ్రెస్‌లో పోటాపోటీ ఉందని చెప్పారు. తీవ్రంగా, పదునైన మాటలతో అవమానించడంలో పోటీ ఉందన్నారు. గుజరాత్ (Gujarat) శాసన సభ ఎన్నికల్లో బీజేపీ (BJP) తరపున ప్రచారం చేస్తున్న మోదీ గురువారం కలోల్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge) ఇటీవల మోదీని ఉద్దేశించి ‘రావణుడు’ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
కొద్ది రోజుల క్రితం ఓ కాంగ్రెస్ (Congress) నేత మాట్లాడుతూ, మోదీ కుక్క చావు చస్తారని అన్నారని గుర్తు చేశారు. నియంత హిట్లర్ మాదిరిగా మోదీ చచ్చిపోతారని మరొక కాంగ్రెస్ నేత అన్నారని తెలిపారు. నేనే మోదీని చంపేస్తానని మరొక నేత అన్నారన్నారు. రావణుడని ఓ నేత, రాక్షసుడని మరొక నేత, బొద్దింక అని మరో నేత తనను అవమానిస్తున్నారని తెలిపారు. తనను కాంగ్రెస్ నేతలు దూషించడం తనకేమీ ఆశ్చర్యంగా లేదన్నారు. కానీ అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పటికీ కాంగ్రెస్ పశ్చాత్తాపం చెందడం లేదని తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ విషయంలో ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుందన్నారు.
తనకు గుజరాత్ ఇచ్చిన బలం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా ఉందన్నారు. ‘మోదీకి ఆయన స్థాయి ఏమిటో ఈ ఎన్నికల్లో చూపిస్తామ’ని మరో కాంగ్రెస్ నేత అన్నారని తెలిపారు. అది సరిపోదని, ఇంకా ఏదో మాట్లాడవలసి ఉందని కాంగ్రెస్ భావించిందని, అందుకే ఖర్గేను పంపించిందని చెప్పారు. తాను ఖర్గేను గౌరవిస్తానన్నారు. ఆయన అడిగినదానికి సమాధానం చెప్పవలసి ఉందన్నారు. గుజరాత్ రామ భక్తుల (Devotees of Sree Ram) రాష్ట్రమని కాంగ్రెస్‌కు తెలియదన్నారు. ఖర్గే ఇక్కడికి వచ్చి మోదీ 100 తలలుగల రావణాసురుడని అన్నారని చెప్పారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge) ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, మోదీ మన దేశానికి ప్రధాన మంత్రి అని, ఆయన తన పదవికి సంబంధించిన కార్యకలాపాలను మర్చిపోయారని, కార్పొరేషన్ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు... ఇలా ఏ ఎన్నికలు వచ్చినా ఆయనే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడు చూసినా ఆయన తన గురించే మాట్లాడతారన్నారు. ‘‘మీరు మరొకరిని చూడనక్కర్లేదు, కేవలం మోదీని చూడండి, ఓటు వేయండి’’ అని చెబుతారన్నారు. మీ ముఖాన్ని ఎన్నిసార్లు చూడాలని ప్రశ్నించారు. మీకు ఎన్ని రూపాలు ఉంటాయని ప్రశ్నించారు. మీకు రావణాసురుడి మాదిరిగా 100 తలలు ఉన్నాయా? అని నిలదీశారు.
కాంగ్రెస్ నేత మధుసూదన్ మిస్త్రీ ఇటీవల మాట్లాడుతూ, ఓ స్టేడియంకు నరేంద్ర మోదీ పేరు పెట్టడంపై మాట్లాడుతూ, మోదీకి తన స్థాయి ఏమిటో ఈ ఎన్నికల్లో చూపిస్తామని అన్నారు.
Updated Date - 2022-12-01T15:06:45+05:30 IST