US Visa: అమెరికా వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే మూడేళ్లు ఆగాల్సిందే!
ABN, First Publish Date - 2022-11-24T07:18:45+05:30
త్వరలో అమెరికా వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే సుదీర్ఘ నిరీక్షణకు సిద్ధంగా ఉండండి.
బిజినెస్, పర్యాటక వీసాలకు సుదీర్ఘ నిరీక్షణ
న్యూఢిల్లీ, నవంబరు 23: త్వరలో అమెరికా వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే సుదీర్ఘ నిరీక్షణకు సిద్ధంగా ఉండండి. దేశంలో బీ-1 (బిజినెస్), బీ-2 (పర్యాటక) వీసాల కోసం మొదటిసారి దరఖాస్తు చేసుకొనే వారికి నిరీక్షణ సమయం దాదాపు మూడేళ్లకు చేరుకుంది. కొవిడ్ అనంతరం అమెరికా వీసాల కోసం ఎదురుచూసే భారతీయుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అమెరికా విదేశాంగ శాఖ వెబ్‌సైట్ ప్రకారం మంగళవారంనాటికి ఇంటర్వ్యూ అవసరమయ్యే బీ1/బీ2 వీసా దరఖాస్తుదారుల నిరీక్షణ సమయం ముంబై ఎంబసీలో 999 రోజులుగా ఉండగా, హైదరాబాద్‌లో 994, ఢిల్లీ 961, చెన్నై 948, కోల్‌కతా ఎంబసీలో 904 రోజులుగా ఉంది. అంటే తొలిసారి బీ1/ బీ2 దరఖాస్తుదారులు కేవలం ఇంటర్వ్యూ కోసమే 2025 చివరి వరకూ ఎదురుచూడాల్సిన పరిస్థితి. ‘‘టూరిస్టు వీసా ఇంటర్వ్యూ కోసం అంతర్జాతీయంగా నిరీక్షణ సమయం 2 నెలల లోపే ఉంది. నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న దరఖాస్తుదారులకు రోజుల వ్యవధిలోనే అపాయింట్‌మెంట్లు అందుబాటులో ఉంటాయి. నిరీక్షణ వ్యవధిని వీలైనంత త్వరగా తగ్గించేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని అమెరికా విదేశాంగ శాఖ మంగళవారం చేసిన ఓ ట్వీట్‌లో పేర్కొంది. వీసా ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయడంలో భాగంగా మరింతమంది దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ మినహాయింపును వర్తింపజేయడంతో పాటు తాత్కాలిక సిబ్బందిని నియమించుకుంటున్నట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీకి చెందిన సీనియర్ అధికారి తెలిపారు.
Updated Date - 2022-11-24T07:19:52+05:30 IST