ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రదర్స్‌ కలకలం

ABN, First Publish Date - 2022-10-22T19:44:01+05:30

మునుగోడు ఉప ఎన్నిక వేళ.. కాంగ్రెస్‌లో మరో కలకలం రేగింది. టీపీసీసీ నాయకత్వంపై అసంతృప్తితో ఉంటూ, ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. అదే పార్టీకి చెందిన ఓ నాయకుడితో సంభాషించినట్లుగా ఆడియో ఒకటి వైరల్‌ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ నాయకుడికి ఫోన్‌ చేసిన ఆడియో వైరల్‌

పార్టీని చూడకుండా రాజగోపాల్‌కు ఓటేయండి

ఈ దెబ్బతో నేనే పీసీసీ అధ్యక్షుడిని అవుతా

పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకొస్తా

వెంకట్‌రెడ్డి మాట్లాడినట్లుగా ఆడియోలో రికార్డు

కార్యకర్తల ఆగ్రహం.. వెంకట్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం

అధిష్ఠానానికి ఎస్సీ సెల్‌ చైర్మన్‌ ప్రీతమ్‌ ఫిర్యాదు

వివరాలు పంపిన ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌

ఆస్ట్రేలియాకు వెంకట్‌రెడ్డి.. వచ్చేనెల 2న రాక

వెంకట్‌రెడ్డి వ్యాఖ్యల్లో తప్పులేదన్న రాజగోపాల్‌

తానూ ఈటలను గెలిపించాలని కోరినట్లు వెల్లడి

2018 ఎన్నికల నాటి ఆడియోతో దుష్ప్రచారం: జబ్బార్‌

హైదరాబాద్‌/నల్లగొండ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నిక వేళ.. కాంగ్రెస్‌లో మరో కలకలం రేగింది. టీపీసీసీ నాయకత్వంపై అసంతృప్తితో ఉంటూ, ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. అదే పార్టీకి చెందిన ఓ నాయకుడితో సంభాషించినట్లుగా ఆడియో ఒకటి వైరల్‌ అయింది. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలంటూ మునుగోడు మండలం దుబ్బకాల్వ గ్రామానికి చెందిన జబ్బార్‌ అనే కాంగ్రెస్‌ నాయకుడికి వెంకట్‌రెడ్డి సూచించినట్లు ఆ ఆడియోలో ఉండడం వివాదాస్పదమైంది. ఆడియోలో రికార్డయిన సంభాషణ ప్రకారం, ‘‘జబ్బార్‌ బాయ్‌ ఏం లేదు.. రాజగోపాల్‌రెడ్డి ఎవరైనా చచ్చినా, బతికినా, పెళ్లిళ్లయినా సహాయం చేస్తుంటడు. ఈ దెబ్బతోని నేనే పీసీసీ అధ్యక్షుడిని అవుతా.. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి అధికారంలోకి తీసుకొస్తా.

పార్టీలను చూడొద్దు.. రాజగోపాల్‌రెడ్డికే ఓటేయాలి. ఏదైనా ఉంటే నేనే చూసుకుంటా. కానీ, పార్టీలకతీతంగా రాజగోపాల్‌రెడ్డికి మద్దతివ్వాలి. నేను కూడా వచ్చి కలుస్తా.. రాజగోపాల్‌రెడ్డిని గెలిపించండి’’ అని వెంకట్‌రెడ్డి అన్నట్లుగా ఉంది. ఈ ఆడియో వైరల్‌ అవడం కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై కొందరు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఈ మేరకు గాంధీభవన్‌లో వెంకట్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలంటూ పలువురికి ఎంపీ వెంకట్‌రెడ్డి ఫోన్‌ చేశారని మునుగోడుకు చెందిన కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ టీపీసీసీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతమ్‌ శుక్రవారమే ఏఐసీసీ పెద్దలు సోనియాగాంధీకి, మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారికి లేఖలు రాశారు. మరోవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌.. ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో టేపు, ఇతర వివరాలతో కూడిన నివేదికను ఏఐసీసీకి పంపించారు. ఈ వివాదంపై వెంకట్‌రెడ్డి నుంచి మాత్రం ఎటువంటి స్పందన రాలేదు. ఆయన గురువారం రాత్రే కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. తిరిగి నవంబరు 2న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు ముందురోజు వెంకట్‌రెడ్డి స్వదేశానికి వస్తారని, రాహుల్‌గాంధీ పాదయాత్రలో పాల్గొంటారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, ఆడియోను తాను వినలేదని, ఈ విషయంలో ప్రస్తుతానికి తాను స్పందించదలుచుకోలేదని మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. ఆడియో క్లిప్పింగ్‌పై క్లారిటీ వచ్చాక, అది నిజమని తేలితే మాట్లాడతానన్నారు.

రేవంత్‌ ప్రకటన మరుసటి రోజే..తనను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారంటూ రేవంత్‌రెడ్డి గురువారం భావోద్వేగ పూరితంగా మాట్లాడిన మరుసటి రోజే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆడియో టేప్‌ లీక్‌ కావడం కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరపున ప్రచారానికి దూరంగా ఉన్న వెంకట్‌రెడ్డి ఇటీవల.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానన్నవారే ప్రచారం చేస్తారంటూ పరోక్షంగా రేవంత్‌రెడ్డినుద్దేశించి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే ప్రచారంలో పాల్గొనకుండా ఆస్ట్రేలియాకూ వెళ్లి పోయారు. తద్వారా మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతను పూర్తిగా రేవంత్‌పైకే నెట్టివేశారు. ఈ క్రమంలోనే చోటుచేసుకున్న తాజా పరిణామాలు తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ఈ నెల 23 నుంచి తెలంగాణలో రాహుల్‌గాంధీ పాదయాత్ర ఉన్న నేపథ్యంలో.. ఆయన యాత్ర పూర్తయిన తర్వాత ఈ అంశాలపై చర్చించాలన్న భావనలో టీపీసీసీ నేతలు ఉన్నట్లు చెబుతున్నారు.

టీఆర్‌ఎస్‌ కుట్ర: కోమటిరెడ్డి అనుచరులుకోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆడియో టేప్‌లు బయటికి రావడం, రాజగోపాల్‌రెడ్డికి చెందిన నగదు రూ. 12 కోట్లు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సీజ్‌ కావడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ కుట్ర ఉందని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. వెంకట్‌రెడ్డితో మాట్లాడించిన జబ్బార్‌ మామ, మాట్లాడిన జబ్బార్‌ సెల్‌ఫోన్ల నుంచి ఆడియో బయటికి లీక్‌ కాలేదని, రాష్ట్ర పోలీసులు ఫోన్‌ ట్యాప్‌ చేసి రాజగోపాల్‌రెడ్డిని దెబ్బతీసేందుకు ఉప ఎన్నిక ముందు వదిలారని ఆరోపిస్తున్నారు. 2018 ఎన్నికల సమయంలో రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి పోటీ చేయగా ఆయనకు అన్ని గ్రామాలపై అవగాహన లేదని, ఆ క్రమంలో వెంకట్‌రెడ్డి మునుగోడు మండల ఓటర్లతో ఫోన్‌లో మాట్లాడి తమ్ముడిని గెలిపించాలని కోరారని తెలిపారు.

అప్పుడు సోదరులిద్దనూ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారని గుర్తు చేశారు. ఈ అంశంపై జబ్బార్‌ శనివారం నల్లగొండలో మీడియా ముందుకు వస్తారని పేర్కొన్నారు. మరోవైపు జబ్బార్‌ కూడా ఈ ఆడియో 2018 ఎన్నికల సమయంలో చేసిన ఫోన్‌ కాల్‌కు సంబంధించినదేనని అంటున్నారు. ఆ ఎన్నికల్లో వెంకట్‌రెడ్డి తనకు ఫోన్‌ చేసి రాజగోపాల్‌రెడ్డికి మద్దతివ్వాల్సిందిగా కోరారంటూ జబ్బార్‌ చెబుతున్న ఆడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై సోషల్‌ మీడియాలో వచ్చిన ఆడియో ఫేక్‌ అని ఇందులో జబ్బార్‌ అన్నారు. ప్రత్యర్థులు రాజకీయ లబ్ధి కోసం పాత ఆడియోను వైరల్‌ చేశారని, దీనిని ఎవరూ నమ్మవద్దని కోరారు.

వెంకట్‌రెడ్డి ప్రకటనలో తప్పు లేదు: రాజగోపాల్‌రెడ్డికోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఆయన సోదరుడు, మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘‘హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా నాడు నేను పిలుపునిచ్చాను. నేడు మా సోదరుడు కూడా పార్టీలకతీతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పారు. అందులో తప్పేమీ లేదు’’ అని అన్నారు. బీజేపీని ఓడించేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌కు ఆర్థికసాయం చేస్తోందని ఆరోపించారు. మునుగోడు ప్రచారానికి వచ్చిన సగం మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తానే గెలవాలని కోరుకుంటున్నారని, కొందరు తనకు నేరుగా కాల్‌ చేసి చెబుతున్నారని తెలిపారు. ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో తన సోదరుడితో పాటు చాలా మంది కమ్యూనిస్టు నాయకులు, ఇతర పెద్ద నాయకులు కూడా రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని చెబుతున్నారని పేర్కొన్నారు. ‘‘మా సోదరుడు వెంకట్‌రెడ్డి తెలంగాణ కోసం పదవి త్యాగం చేశాడు. కావాలని పదే పదే డీగ్రేడ్‌ చేయవద్దు. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి టీఆర్‌ఎస్‌ మద్దతిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేస్తే టీఆర్‌ఎ్‌సకు వేసినట్లే. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ఏకమయ్యాయి’’ అని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి, కవితకు వ్యాపార లావాదేవీలు నడుస్తున్నాయని, లిక్కర్‌ స్కామ్‌లో రేవంత్‌కు వాటా ఉందని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడే కొద్ది కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పనైపోయిందని ఆయనకు అర్థమైందని వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-10-23T13:01:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising