మునుగోడు భవితవ్యం..హైదరాబాద్‌లో!
ABN, First Publish Date - 2022-10-22T19:57:53+05:30
మునుగోడు నియోజకవర్గంలోని మొత్తం ఓట్లు 2,27,265 కాగా.. ఓటర్లలో 10 నుంచి 15 శాతం మంది ఇతర ప్రాంతాల్లోనే ఉంటున్నారు. వీరిలో హైదరాబాద్‌లోనే 25 వేల మందికి పైగా ఉన్నట్లు సమాచారం.
25 వేలకు పైగా ఓటర్ల నివాసం నగరంలోనే
ఉపాధి, పిల్లల చదువుల కోసం ఇక్కడే
ఒక్కో గ్రామం నుంచి 200కు పైగా ఓటర్లు
ఒక్క ఎల్బీనగర్‌లోనే 8500 మంది..
16 కంపెనీల్లో పనిచేస్తున్న అత్యధికులు
గెలుపు, ఓటముల్లో కీలకం కానున్న వారి ఓట్లు
ప్రత్యేకంగా దృష్టి సారించిన రాజకీయ పార్టీలు
భేటీలు, విందులతో వారిని ఆకట్టుకునే ప్రణాళిక
నెల క్రితమే అధికార టీఆర్‌ఎస్ బ్లూప్రింట్ సిద్ధం
నగర ఎమ్మెల్యేల్లో పలువురికి ప్రత్యేక బాధ్యతలు
స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి కేటీఆర్!
మునుగోడు ఉప ఎన్నికలో అభ్యర్థుల భవితవ్యం గ్రేటర్ హైదరాబాద్ చేతిలో ఉంది! ఆశ్చర్యం కలిగించినా.. ఇది నిజం. మునుగోడు నియోజవర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో గ్రేటర్ హైదరాబాద్‌లో నివసిస్తుండడమే ఇందుకు కారణం. నియోజకవర్గానికి చెందిన 25 వేల మందికిపైగా ఓటర్లు నగరంలో నివాసముంటున్నారు. దీన్ని గుర్తించిన అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఆ ఓటర్లపై దృష్టి సారించింది. వారిలో అధికులు ఎక్కడ పనిచేస్తున్నారో గుర్తించి.. ఆకట్టుకునేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం దూసుకెళ్తోంది! ఈ బాధ్యతను నగరంలోని ఎమ్మెల్యేల్లో పలువురికి ప్రత్యేకంగా అప్పగించి.. మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు!!
మునుగోడు నియోజకవర్గం రాజధాని హైదరాబాద్‌కు చేరువలోనే ఉన్నా పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో ఉపాధి కోసం మునుగోడు నుంచి వేలాది మంది నగరానికి వలస బాట పట్టారు. విద్యార్థులు చదువుకునేందుకు సరైన విద్యాసంస్థలు కూడా లేకపోవడంతో.. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కూడా హైదరాబాద్‌కు చేరుకుని నివాసం ఏర్పరచుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని మొత్తం ఓట్లు 2,27,265 కాగా.. ఓటర్లలో 10 నుంచి 15 శాతం మంది ఇతర ప్రాంతాల్లోనే ఉంటున్నారు. వీరిలో హైదరాబాద్‌లోనే 25 వేల మందికి పైగా ఉన్నట్లు సమాచారం. ఉదాహరణకు మునుగోడు నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటైన గట్టుప్పల్ మండలంలోని తేరట్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 2211 ఓట్లు ఉండగా, ఇందులో 520 మంది ఓటర్లు హైదరాబాద్‌లోనే ఉన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాకలో 3751 ఓట్లు ఉండగా, ఇందులో 600 మంది దాకా నగరంలో ఉన్నారు. చౌటుప్పల్ మండలంలోని నేటపట్ల గ్రామంలో 1298 ఓట్లు ఉండగా, 190 మంది హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇలా నియోజకవర్గంలోని ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్లలో 200 నుంచి 600 మంది గ్రేటర్‌హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన ఒక రాజకీయ పార్టీ వారి వివరాలను సేకరిస్తే.. ఒక్క ఎల్బీనగర్ పరిధిలోనే 8500 మంది దాకా ఉన్నట్లు తెలిసింది. మొత్తం పాతికవేల మందిలో అత్యధికులు ఎల్బీనగర్‌తోపాటు సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట, బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం, కర్మన్‌ఘాట్, రామంతాపూర్, అంబర్‌పేట, బోడుప్పల్ తదితర ప్రాంతాల్లో నివాసముంటున్నారు.
గెలుపు, ఓటములపై ప్రభావం..హైదరాబాద్‌లో నివాసం ఉండే మునుగోడు నియోజకవర్గ ఓటర్లు అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఉప ఎన్నికలోనూ వీరు కీలకంగా మారారు. దీంతో మూడు ప్రధాన పార్టీలు ఈ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే గ్రామాల వారీగా హైదరాబాద్‌లో నివసించే ఓటర్ల వివరాల జాబితా సిద్ధం చేశాయి. ఓటర్ల ఫోన్ నంబర్లు, అడ్ర్‌సలు సేకరిస్తున్నాయి. వారితో తమ పార్టీకే ఓటు వేయించేలా చూసే బాధ్యతను ఆయా గ్రామాలకు చెందిన రాజకీయ పార్టీల నేతలకు అప్పగించాయి. వారు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో హోటళ్లలో దిగి.. నిత్యం ఓటర్లను కలుస్తూ ఇతర ఓటర్ల అడ్రస్, వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఓటర్ల అడ్ర్‌సలు ఏ గ్రామానికి ఆ గ్రామం పూర్తిగా సేకరించిన తర్వాతే విడతల వారీగా ఎక్కడికక్కడ పెద్ద పెద్ద హోటళ్లలో సమావేశాలు, విందులు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంలో అధికార టీఆర్‌ఎస్ ఇతర పార్టీల కన్నా ముందున్నట్లు తెలుస్తోంది.
గులాబీ ప్రణాళిక ఇలా..కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి ముందే ఈ ఓటర్ల ప్రాధాన్యాన్ని గుర్తించిన టీఆర్‌ఎస్.. నగరంలో ఉన్న మునుగోడు ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీ వ్యూహాన్ని అమలు చేస్తోంది. మొుత్తం 25 వేల ఓట్లనూ దక్కించుకోవడమే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పదిహేనురోజుల క్రితం బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. అందులో భాగంగా మునుగోడు నియోజకవర్గం నుంచి అందుకున్న సమాచారాన్ని క్రోడికరించి.. అత్యధిక ఓటర్లు నగరంలోని 16 కంపెనీల్లో పని చేస్తున్నట్లు గుర్తించింది. అందునా నగర శివారులో ఉండే ఒక ఫార్మా కంపెనీలో ఏకంగా 5వేల మంది మునుగోడు ఓటర్లు పని చేస్తున్నారని తెలుసుకుంది. వారిని సమన్వయం చేసేందుకు ఆ కంపెనీలో విభాగాల వారీగా ఓటర్ల పేర్లను వేరు చేసి.. వంద మందికి ఒక బ్యాచ్ చొప్పున విభజించినట్లు తెలుస్తోంది. ఆ వంద మంది ఓటర్ల బాధ్యతను ఒక నేతకు అప్పగించి.. వారి బాగోగులు చూసుకోవడం, రోజువారీ అవసరాలు తీర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఆ ఒక్క కంపెనీయే కాదు.. మొత్తం 16 కంపెనీల్లోని ఉద్యోగుల జాబితాలనూ తయారు చేసి, ఎవరెవరిని ఎవరు సంప్రదించాలో కూడా అధినాయకత్వం ఆదేశించినట్లు చెబుతున్నారు.
సామాజికవర్గాల వారీగా గుర్తింపు..కంపెనీల వారీగా మునుగోడు ఓటర్లను గుర్తించిన అనంతరం సామాజిక వర్గాల వారీగా ఎంత మంది ఉన్నారన్న సమాచారాన్ని కూడా టీఆర్‌ఎస్ సేకరించింది. ఏ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు సంప్రదించేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. వారి బంధువుల్ని గుర్తించి.. వారితో కూడా ఓటర్లపై ఒత్తిడి తెచ్చే యోచనలో అధికారపార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం ప్రకారం నగరంలోని మునుగోడు ఓటర్లలో అత్యధికం బీసీ, ఎస్సీ, ఎస్టీలే. ఈ మొత్తం ప్రణాళిక అమలు బాధ్యతను మంత్రి కేటీఆర్ తన భుజాన వేసుకున్నారని, ఈ వ్యవహారాన్ని ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిసింది. ఇందులో భాగంగా.. నగరానికి చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో పలువురిని హైదరాబాద్‌లోనే ఉండిపోవాలని, మునుగోడుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు కొందరు నగరంలోనే ఉంటుండగా, మరికొందరు మాత్రం ఉదయం మునుగోడుకు వెళ్లి సాయంత్రం నగరానికి తిరిగి వస్తున్నారు.- మునుగోడు నుంచి
‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ప్రతినిధి,
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రతినిధి
Updated Date - 2022-10-23T14:53:32+05:30 IST