Pinjore Priest: పగలు పూజారి...రాత్రి వేళ దొంగ...సీసీటీవీ ఫుటేజీలో పట్టుబడిన వైనం
ABN , First Publish Date - 2022-12-06T06:17:29+05:30 IST
పగలు దేవాలయంలో పూజారిగా పనిచేస్తూ...రాత్రి కాగానే దొంగగా అవతారం ఎత్తి ఇళ్లలో చోరీలు చేసిన....

చండీగఢ్ (పంజాబ్): పగలు దేవాలయంలో పూజారిగా పనిచేస్తూ...రాత్రి కాగానే దొంగగా అవతారం ఎత్తి ఇళ్లలో చోరీలు చేసిన ఓ పూజారికి పోలీసులు అరదండాలు(Pinjore Priest Arrest) వేసిన ఘటన పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీ నగరంలో వెలుగుచూసింది. పింజోర్ పట్టణ వాసి అయిన రవికుమార్ అలియాస్ రవి పూజారి (40) సూరజ్‌పూర్ ప్రాంతంలోని ఒక ఆలయంలో పగటిపూట పూజారిగా పనిచేస్తున్నాడు. రాత్రి కాగానే దొంగగా మారి 60 చోరీలకు(Burglaries) పాల్పడ్డాడని మొహాలీ పోలీసులు చెప్పారు.(Holy Man by Day Criminal by Night)
ఫేజ్ 2 లోని ఓ వ్యాపారి ఇంట్లో కోటిరూపాయల విలువైన నగలు, రూ.10 లక్షల నగదును దోచుకున్న రవి పూజారిని పోలీసులు పట్టుకున్నారు. ఈ దొంగ జిరాక్పూర్ లో స్కూటరును దొంగిలించాడు. తెల్లవారుజామున తాము నిద్రిస్తుండగా దొంగ వచ్చి అల్మారాతాళం పగులగొట్టి నగదు, నగలతో ఉడాయించాడని గార్గ్ అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో అంబాలా జైలు నుంచి విడుదలైన రవిని సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పంచకుల జడ్జి ఇంట్లో రవి చోరీ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. హర్యానా, పంజాబ్,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రవి పూజారి 60 చోరీలకు పాల్పడ్డాడని తమ దర్యాప్తులో తేలిందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సందీప్ గార్గ్ తెలిపారు.
రవికి పింజోర్‌లోని సూరజ్‌పూర్‌లో విలాసవంతమైన ఇల్లు ఉందని పోలీసులు చెప్పారు. అతని ఇల్లు, దేవాలయం రెండింటిలోనూ అనేక ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయని, అతన్ని ఎప్పుడైనా గుర్తించినట్లయితే వారి నుంచి తప్పించుకోవడానికి వీలుగా ఇల్లు నిర్మించాడని పోలీసులు చెప్పారు. దొంగ పూజారి నుంచి రూ.1.5 కోట్ల విలువైన బంగారు, వెండి పాత్రలతో పాటు ఖరీదైన గడియారాలు,బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు.