Telugu Bhasha Dinotsavam: ఆగస్టు 29 గిడుగు రామ్మూర్తి జయంతి - తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా..

ABN , First Publish Date - 2022-08-29T21:07:12+05:30 IST

“హరీన్ ఛటో, గిరాం మూర్తీ ఇటీవలి మా ఇన్‌స్పిరేషన్...” అని రాసుకున్నాడు శ్రీ శ్రీ ఒకప్పుడు. నాకు గిరాం మూర్తి ఎప్పటికీ, ఎల్లప్పటికీ ఇన్ స్పిరేషనే. అసలు గిరాం మూర్తి అనే పదప్రయోగం చేయడంలోనే..

Telugu Bhasha Dinotsavam: ఆగస్టు 29 గిడుగు రామ్మూర్తి జయంతి - తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా..

“హరీన్ ఛటో, గిరాం మూర్తీ ఇటీవలి మా ఇన్‌స్పిరేషన్...” అని రాసుకున్నాడు శ్రీ శ్రీ ఒకప్పుడు. నాకు గిరాం మూర్తి ఎప్పటికీ, ఎల్లప్పటికీ ఇన్ స్పిరేషనే. అసలు గిరాం మూర్తి అనే పదప్రయోగం చేయడంలోనే శ్రీ శ్రీ గొప్ప ప్రజ్ఞ చూపించాడు. అది ‘గిడుగు రామ్మూర్తి’ అనే పదానికి సంక్షిప్త రూపం మాత్రమేకాక, ‘గిరాం’ అంటే మాటలు, వాక్కు, భాష కూడా కాబట్టి, రూపెత్తిన భాష అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. అంటే వాగ్దేవి స్వరూపమన్నమాట.


గిడుగు రూపెత్తిన ఒక భాష కాదు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లిషు, ఒరియాలతో పాటు శాసనభాషలు కూడా క్షుణ్ణంగా చదువుకున్నవాడు. తెలుగు కూడా ఒక తెలుగు కాదు, అనేక తెలుగులు అధ్యయనం చేసినవాడు. కాబట్టే నన్నయకు పూర్వం తెలుగు ఎలా ఉంటుందో ఊహించి అందులో ముప్పై పేజీల 'ప్రాదెనుగు కమ్మ' రాసినవాడు. ఇక సవరభాషలో ఆయన మహాపండితుడు. ఆ భాషకి ఒక వ్యాకరణాన్నీ, నిఘంటువునీ కూడా తయారుచేసినవాడు. ఆ మాధ్యమంలో పాఠ్యపుస్తకాలు రూపొందించి, సవర పిల్లలకి సవరమాధ్యమంలో పాఠాలు చెప్పినవాడు. నిఘంటువులు రూపొందించడానికి ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ వాడతారని తెలిసి, ఆ మాధ్యమంలోనే సోర-ఇంగ్లిషు నిఘంటువుని రూపొందించినవాడు. తులనాత్మక భాషాశాస్త్రానికి పితామహుడని నేడు అంతర్జాతీయ భాషావేత్తల ప్రశంసలు అందుకుంటున్నవాడు.


కాని ఒక పండితుడుగానూ, వాజ్మయోద్ధారకుడిగానూ మాత్రమేకాక, ఒక మనిషిగా గిడుగు ఎంతో సమున్నతుడని ఆయన గురించి మనకి లభ్యమవుతున్న కొద్దిపాటి జ్ఞాపకాలు చదివినా తెలుస్తుంది. గిడుగు జీవిత కాలంలో ఆయన జీవితచరిత్ర ఎవ్వరూ రాయలేదు. ఆయన ఆత్మకథ కూడా రాసుకోలేదు. కాని ఎప్పటికప్పుడు డైరీలు రాసుకునేవారు. అటువంటి డైరీల్లో 1932 నాటి డైరీ ఒకటి ఎట్లాగో దాచిపెట్టుకుని గిడుగు రాజేశ్వరరావుగారు పుస్తకరూపంలో వెలువరించారు. ఆ డైరీతో పాటు, గిడుగు జీవితం గురించిన ఒక సంగ్రహ పరిచయం కూడా జోడించి 'ఉదాత్త చరితుడు గిడుగు' (2006) అని ఆయన వెలువరించిన పుస్తకం గిడుగు ప్రేమికులకి ఒక అమూల్య కానుక. ఆ పుస్తకంలో ఆయన గిడుగు వ్యక్తిత్వానికి అద్దం పట్టే విశేషాలు కొన్ని పేర్కొన్నారు. వాటిల్లో మూడు నాలుగు మీకు చెప్పాలని ఉంది.


ఒకప్పుడు గిడుగు పర్లాకిమిడిలో ఉండగా, వెల్ష్ మన్ అనే ఒక ఫారెస్టు అధికారి సవర భాష నేర్చుకోవాలని అనుకుని గిడుగును తన ఇంటికి వచ్చి నేర్పమని అడిగాడు. గిడుగు అందుకు సమ్మతించక, తన పాఠశాలకు మధ్యాహ్న భోజన విరామంలో వస్తే నేర్పుతానని చెప్పాడు. వెల్ష్ మన్ అయిష్టంగానే ఆ సూచనని ఒప్పుకుని ఆయన దగ్గరకు వెళ్ళి నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కొద్దిరోజుల్లోనే గిడుగు పాండిత్యం, వ్యక్తిత్వం అతణ్ణి గాఢంగా ఆకర్షించేయి. తర్వాత రోజుల్లో గిడుగుకి ప్రభుత్వం నుంచి లభించిన గుర్తింపు వెనక వెల్ష్ మన్ ప్రోద్బలం చాలా ఉందని చెప్పాలి. అయితే, 1929లో పర్లాకిమిడి దగ్గర సెరంగోలో సవరభాషలో బోధించే ఒక విద్యాసంస్థని ఏర్పాటు చేసినప్పుడు ఆ నిర్వాహకులు దానికి గిడుగురామూర్తి పేరుపెట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించేరు. కాని గిడుగు వాళ్ళని వారిస్తూ, ఆ సంస్థకి వెల్ష్ మన్ పేరుపెట్టమని పట్టుబట్టేడు!



ఆయన పర్లాకిమిడిలో దాదాపు అరవయ్యేళ్ళు జీవించేడు. ఆ జమీందారీ ఆయనకూ, ఆయన కుమారుడికీ ఉద్యోగం ఇచ్చింది. ఆదరించింది. గౌరవించింది. ఒకవిధంగా ఆయన్ను మనిషిని చేసింది. కాని పర్లాకిమిడి జమీందారు తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉన్న జమీందారీ ప్రాంతాన్ని ఒరిస్సా రాష్ట్రంలో కలపాలని ప్రయత్నాలు మొదలుపెట్టగానే గిడుగు ఆయనతో విభేదించాడు. ఆ ప్రయత్నాల్ని అడ్డుకున్నాడు. పోరాడేడు. రాజు పట్ల విధేయత, భాష పట్ల విధేయత, ఈ రెండింటిలోనూ ఒకటి ఎంచుకోవలసి వచ్చినప్పుడు గిడుగు అత్యధిక సంఖ్యాకుల భాషనే ఎంచుకున్నాడు. దాంతో ఆ రాజు ఆగ్రహించి గిడుగుని చాలా ఇబ్బందులు పెట్టాడు. ఆయన కొడుకుని ఉద్యోగంలోంచి తీసేసాడు. గిడుగు పర్లాకిమిడిని బహిష్కరించి రాజమండ్రి వచ్చేశాడు. కానీ.. ఆ రోజుల్లో రాసుకున్న డైరీలో, తన కోసం తాను రాసుకున్న వాక్యాల్లో కూడా, ఎక్కడా జమీందారు కృష్ణచంద్ర గజపతి గురించి ఒక్క నిందాపూర్వక వాక్యం కూడా రాయకపోగా చివరికి ఏకవచన ప్రయోగం కూడా చెయ్యలేదు!


గిడుగు రెండవకుమారుడు వీర్రాజుని మెట్రిక్యులేషన్ కోసం ప్రవేశ పరీక్ష రాయించినప్పుడు ఆ పరీక్షలో ఒక పేపర్ లో ఆ పిల్లవాడికి రెండు మార్కులు తక్కువ వచ్చాయి. అది కూడా గిడుగు బోధించే సబ్జెక్టులోనూ, గిడుగు దిద్దిన పేపర్లోనే. దాంతో ఆ ప్రిన్సిపాలుకి ఏమి చెయ్యాలో తెలియక గిడుగును ఆ పేపరు మరోసారి చూడమని అడిగాడు. తన మాట వినలేదని తెలిసాక, ఆ పిల్లవాడి తల్లి ద్వారా, అంటే గిడుగు శ్రీమతి ద్వారా చెప్పించే ప్రయత్నం చేసాడు. కాని గిడుగు వినకుండా, ఆ ఏడాదికి తన పిల్లవాణ్ణి ఫెయిల్ చేసి మెట్రిక్యులేషన్ పరీక్షకు పంపకుండా ఆపేసారు.


ఆయన పదిహేనేళ్ళుగా శ్రమపడి సంగ్రహించిన అరుదైన వ్యాకరణాంశాలు మరో పండితుడు ఉపయోగించుకుని, గిడుగు పేరు కూడా స్మరించలేదని ఒక శిష్యుడు గిడుగుకు ఫిర్యాదు చేసాడు. అప్పుడు గిడుగు అతడితో ' నా వాదాన్ని ఆ శాస్త్రులవారు లోకములో పారవేసినారు. నాకదే తృప్తి. నా పేరెందుకు? నా పేరక్కరలేదు. అక్షరాలు కనిపెట్టినవాడి పేరెవరికైనా తెలుసునా? ' అనడిగారు.


ఇటువంటి వ్యక్తిత్వాన్ని దగ్గరనుండి చూసిన మనుషులు గిడుగును ఎంతగా ప్రేమించి ఉంటారో మనం ఊహించవచ్చును. ఆయన పర్లాకిమిడిలో ఉన్న చివరిరోజుల్లో ఆయన దగ్గర శిష్యురాలిగా చేరిన మిస్ మన్రో ఆయనకి రాసిన ఒక ఉత్తరంలో (9-5-1928) , Please don’t think I am just thinking of the Sora work- I am thinking of just you. So me, my dear friend, you represent India's Beauty and nobility అని రాసిందంటే ఆశ్చర్యమేముంది?


భారతదేశపు సంస్కృతికీ, ఉదాత్తతకీ నిజమైన ప్రతినిధి అని చెప్పదగ్గ గిడుగుకు మనమేమి ఇవ్వగలం? కనీసం ఒక విశ్వవిద్యాలయానికైనా ఆయన పేరు పెట్టుకోలేకపోయాం.


- వాడ్రేవు చిన వీరభద్రుడు 

( ప్రముఖ కవి, చిత్రకారులు, సాహితీవేత్త )

 +91 94909 57129

Updated Date - 2022-08-29T21:07:12+05:30 IST