Rishabh Pant: రిషభ్ పంత్ ప్రమాదానికి కారణం తెలిసింది!
ABN, First Publish Date - 2022-12-31T17:47:30+05:30
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) ప్రమాదానికి కారణం తెలిసింది. శుక్రవారం ఉదయం పంత్ తన
డెహ్రాడూన్: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) ప్రమాదానికి కారణం తెలిసింది. శుక్రవారం ఉదయం పంత్ తన బెంజ్‌కారులో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ (Dehradun) వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. డివైడర్‌ను ఢీకొన్న కారు ఆ వెంటనే మంటలకు ఆహుతైంది. ఈ ప్రమాదం నుంచి పంత్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ వెన్నెముక, నుదురు, మోకాలికి గాయాలయ్యాయి. తాజాగా, శనివారం అతడి నుదుటికి వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ చేశారు.
పంత్ కోలుకోవడానికి రెండు నుంచి ఆరు నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పంత్ కుడికాలి స్నాయువు స్థానభ్రంశం చెందడంతో సర్జరీ చేయాల్సి రావొచ్చని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే ఢిల్లీ కేపిటల్స్ కొత్త కెప్టెన్‌ను వెదుక్కోక తప్పదు.
పంత్ రోడ్డు ప్రమాదానికి గల కారణాన్ని హరిద్వార్ (రూరల్) ఎస్పీ ఎస్‌కే సింగ్ వెల్లడించారు. డ్రైవ్ చేస్తున్న పంత్‌కు నిద్ర ముంచుకు రావడంతో కళ్లు మూతలు పడ్డాయని, ప్రమాదానికి అదే కారణమని పేర్కొన్నారు. రూర్కీ వెళ్తుండగా నర్సాన్‌కు కిలోమీటరు దూరంలో ఈ ఘటన జరిగినట్టు వివరించారు. ప్రమాదం జరిగినప్పుడు పంత్ ఒక్కడే ఉన్నట్టు చెప్పారు. ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పటికీ అతడి బెంజ్‌కారు పూర్తిగా దగ్ధమైంది.
Updated Date - 2022-12-31T17:52:05+05:30 IST