మావోయిస్టు అగ్రనేతలు కిషన్‌జీ, వేణుగోపాల్‌రావు తల్లి మల్లోజుల మధురమ్మ ఇక లేరు
ABN , First Publish Date - 2022-11-02T05:50:47+05:30 IST
తాడిత, పీడిత ప్రజల బాగు కోసం యాభై ఏళ్ల క్రితమే అడవి బాట పట్టిన మల్లోజుల కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్‌జీ...

నూరేళ్ల వయసులో గుండెపోటుతో మృతి
పెద్దపల్లి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): తాడిత, పీడిత ప్రజల బాగు కోసం యాభై ఏళ్ల క్రితమే అడవి బాట పట్టిన మల్లోజుల కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్‌జీ, మల్లోజుల వేణుగోపాల్ రావు తల్లి మల్లోజుల మధురమ్మ (100) ఇకలేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రభుత్వానికి లొంగిపోవాలంటూ కుమారులకు విజ్ఞప్తి చేయాలని పోలీసులు సూచించినా ఆమె అలా చేయలేదు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలోనే ఉన్న వేణుగోపాల్ రావును కూడా లొంగిపోవాలని కోరని ధీరత్వం ఆమెది. మధురమ్మ స్వస్థలం పెద్దపల్లి. ఆమె భర్త మల్లోజుల వెంకటయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. 1997లో ఆయన మృతి చెందారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు అంజన్న పౌరోహిత్యం చేసుకుంటున్నారు. ఆయన వద్దనే మధురమ్మ జీవిస్తున్నారు. 1973లో రెండో కుమారుడు కిషన్‌జీ, 1977లో చిన్న కుమారుడు వేణుగోపాల్‌రావు అడవి బాట పట్టారు. 2011 నవంబరు 24న బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ మృతిచెందారు. కాగా రెండు మాసాల క్రితం మధురమ్మకు కాలి తొంటి విరగ్గా, శస్త్ర చికిత్స చేశారు. ఆ తర్వాత ఆమె మంచానికే పరిమితమయ్యారు. ఆమెకు మూడు రోజుల క్రితం గుండెనొప్పి రావడంతో హైదరాబాద్ జీడిమెట్లలోని నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం పరిస్థితి విషమించడంతో అంబులెన్స్‌లో వెంటిలెటర్‌పై సాయంత్రం పెద్దపల్లికి తీసుకువచ్చారు. వెంటిలెటర్ తీసిన పదిహేను నిమిషాల తర్వాత ఆమె తుది శ్వాస విడిచారు. బుధవారం పెద్దపల్లి తెనుగువాడలోని హిందూ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పెద్ద కుమారుడు అంజన్న తెలిపారు.