అదనపు అంతస్తుకో లక్ష..!

ABN , First Publish Date - 2022-12-26T00:28:06+05:30 IST

అనుమతి లేని ప్రతీ అదనపు అంతస్తుకు రూ. లక్ష, సిబ్బంది, అధికారులతో కలిసి ప్రతీ నెలా ఓ యాత్ర. ఇదీ జీహెచ్‌ఎంసీ అధికారుల తీరు. అక్రమ నిర్మాణాలు జీహెచ్‌ఎంసీలోని కొందరు అధికారులు, సిబ్బందికి ఆదాయ వనరుగా మారాయి.

అదనపు అంతస్తుకో లక్ష..!

అక్రమ నిర్మాణాలకు అధికారుల అండ

బేరం కుదుర్చుకుని సలహాలు

పట్టించుకునే తీరిక ఉండదు..

టూర్లకు మాత్రం తయార్‌..

మంగళ్‌హాట్‌, డిసెంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): అనుమతి లేని ప్రతీ అదనపు అంతస్తుకు రూ. లక్ష, సిబ్బంది, అధికారులతో కలిసి ప్రతీ నెలా ఓ యాత్ర. ఇదీ జీహెచ్‌ఎంసీ అధికారుల తీరు. అక్రమ నిర్మాణాలు జీహెచ్‌ఎంసీలోని కొందరు అధికారులు, సిబ్బందికి ఆదాయ వనరుగా మారాయి.

జీహెచ్‌ఎంసీ మెహిదీపట్నం సర్కిల్‌ - 12 పరిధి మల్లేపల్లి, ఆసి్‌ఫనగర్‌ డివిజన్లను వేరు చేసే ప్రధాన రహదారిపై దాదాపు 350 గజాల స్థలంలో రెండంతస్తులకు అనుమతులు తీసుకున్నారు. కానీ, సెల్లార్‌తో పాటు ఆరంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు ఎనిమిది నెలలుగా పనులు జరుగుతున్నాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు మొదట నోటీసు జారీ చేసినట్లు తెలిసింది. అనంతరం సదరు యజమాని, బిల్డర్‌తో ఓ సెక్షన్‌ అధికారి అదనపు అంతస్తుకో రూ. లక్ష చొప్పున బేరం కుదుర్చుకుని న్యాయస్థానం నుంచి స్టే తెస్తే సరిపోతుందని సలహా ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ భవనం నుంచి మరో 50 అడుగుల దూరం వెళ్తే మల్లేపల్లి వెళ్లే మార్గంలో దాదాపు 400 గజాల స్థలంలో సెల్లార్‌తో పాటు ఏడంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. ఇక్కడా స్టిల్ట్‌ ప్లస్‌ టూ అనుమతితో నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. ఇక్కడి నుంచి మరో వంద అడుగుల దూరంలో మరో ఏడంతస్తుల భవన నిర్మాణం జరుగుతోంది. దీనికి నాలుగంతస్తుల అనుమతి ఉండగా ఏడంతస్తులు నిర్మిస్తున్నట్లు తెలిసింది. బజార్‌ఘాట్‌లోనూ రెండంతస్తుల అనుమతితో ఏడంతస్తుల భవన నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి.

అంతా ఆయనే..

దీర్ఘకాలికంగా ఇక్కడే సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. మల్లేపల్లి, రెడ్‌హిల్స్‌ డివిజన్ల పరిధిలో అనుమతి లేని ప్రతి అదనపు అంతస్తుకు రూ. లక్ష చొప్పున సదరు అధికారికి సమర్పించుకుంటే అంతా ఆయనే చూసుకుంటారని స్థానిక కాంట్రాక్టర్లు భవన నిర్మాణదారుడికి సలహాలు ఇస్తుండడం గమనార్హం. బిల్డర్లు, కాంట్రాక్టర్లతో మాట్లాడేందుకు ఒక ఫోన్‌ను, అధికారులు, సిబ్బందితో మాట్లాడేందుకు మరో ఫోన్‌ను ఆయన వినియోగిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే సదరు ఉద్యోగి కోట్ల రూపాయలకు పడగలెత్తారని, స్థానికంగా భారీగా ఆస్తులు కూడబెట్టారని ప్రచారం జరుగుతోంది.

నెలకో యాత్ర..

సర్కిల్‌ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు సాగుతున్నప్పటికీ వాటిని పట్టించుకునే సమయం లేని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఇటీవల జవాన్లు, చైన్‌మన్లు,సెక్షన్‌ అధికారులతో కలిసి యాత్రకు వెళ్లినట్లు సమాచారం. భారీగా ముడుపులు అందాక అందరూ కలిసి ప్రతి నెలా ఓ యాత్రకు వెళ్తున్నట్లు కార్యాలయంలో చర్చ జరుగుతోంది.

సార్‌కు తెలియదు.. నాతో మాట్లాడండి..

సర్కిల్‌ - 12 పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న కట్టడాలపై టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ కృష్ణమూర్తిని వివరణ కోరేందుకు పలు మార్లు ఫోన్‌ చేయగా, ఏదైనా ఉంటే సెక్షన్‌ ఆఫీసర్‌తో మాట్లాడాలని ఫోన్‌ ఆయనకు ఇవ్వడం కొసమెరుపు. సెక్షన్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ ‘మా సార్‌కు ఏదీ తెలియదు. ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి’ అంటూ పొంతన లేని సమాధానాలతో దాటవేసే ప్రయత్నం చేయడం గమనార్హం.

అక్రమ వసూళ్లపై నజర్‌

డయల్‌ - 100కు ఫోన్‌ చేస్తే చర్యలు : సీపీలు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 25(ఆంధ్రజ్యోతి): ‘‘ఎంతో కొంత డబ్బులు ఇస్తేనే నిర్మాణం చేయనిస్తాం.. లేదంటే జీహెచ్‌ఎంసీ అధికారులతో మాట్లాడి నీ కన్‌స్ట్రక్షన్‌ జరగకుండా అడ్డుకుంటాం’’ అంటూ కొందరు లోకల్‌ లీడర్లు, చోటామోటా నాయకులు, సోషల్‌ మీడియా రిపోర్టర్‌లు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. అలాగే, గృహ ప్రవేశం చేసే సమయానికి ట్రాన్స్‌జెండర్స్‌ ముఠా రంగంలోకి దిగుతుంది. అడినంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. కాదు కూడదు అంటే నానా యాగీ చేసి, ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో నగరంలో నిర్మాణం అంటేనే కొందరు భయపడాల్సిన పరిస్థితి. ఇలాంటి ఘటనలపై తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు ప్రజలకు అభయమిస్తున్నారు.

వేధిస్తే సహించేది లేదు..

నిర్మాణాల వద్దకు వెళ్లి డబ్బుల కోసం వేధించినా.. భవన నిర్మాణాలు అడ్డుకుంటామని హెచ్చరించినా, అధికారులు, నాయకుల పేర్లు చెప్పి లోకల్‌ లీడర్లు భయపెట్టినా సహించం. కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులు సైబరాబాద్‌ వాట్సాప్‌ నంబర్‌ 94906 17444కు సమాచారం ఇవ్వాలి.

స్టీఫెన్‌ రవీంద్ర, సైబరాబాద్‌ సీపీ

బెదిరిస్తే కఠిన చర్యలు..

భవన నిర్మాణాల వద్దకు వెళ్లి వారిని బెదిరించి, బ్లాక్‌ మెయిల్‌ చేసి అక్రమ వసూళ్లకు పాల్పడే ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులు డయల్‌-100, కమిషనరేట్‌ వాట్సాప్‌ నంబర్‌ 94906 16555కు సమాచారం ఇస్తే మా పెట్రోలింగ్‌ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుంటారు. అవసరమైతే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. ట్రాన్స్‌జెండర్స్‌ వేధించినా సహించం.

సీవీ ఆనంద్‌, హైదరాబాద్‌ సీపీ

క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం..

నిబంధనలకు లోబడి, భవన నిర్మాణాలు చేస్తున్న పేద, మధ్యతగతి ప్రజలను ఎవరైనా వేధిస్తే క్షమించేది లేదు. దందాలు చేసేవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. బాధితులు డయల్‌-100తో పాటు.. రాచకొండ కమిషనరేట్‌ వాట్సాప్‌ నంబర్‌ 94906 17111కు సమాచారం ఇవ్వండి.

- మహేష్‌ ఎం భగవత్‌, రాచకొండ సీపీ

Updated Date - 2022-12-26T00:29:06+05:30 IST