Congress leader Rahul Gandhi : మునుగోడును చేజార్చుకోవద్దు
ABN, First Publish Date - 2022-10-31T04:53:21+05:30
‘‘మునుగోడులో కాంగ్రెస్ గెలవడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోవద్దు’’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు సూచించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆదివారం షాద్‌నగర్ చేరుకున్న రాహుల్..
అక్కడ కాంగ్రె్‌సకు అనుకూల పరిస్థితులు
మునుగోడు ఎన్నికపై సమీక్షలో రాహుల్
ఎన్నికలప్పుడే బీజేపీ, టీఆర్‌ఎస్ డ్రామాలు
ఇతర సమయాల్లో రెండూ కలిసే ఉంటాయి
కేంద్రం బిల్లులకు టీఆర్‌ఎస్ మద్దతు
తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమే
లాక్కున్న పేదల భూములు తిరిగి ఇప్పిస్తాం
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)
‘‘మునుగోడులో కాంగ్రెస్ గెలవడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోవద్దు’’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు సూచించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆదివారం షాద్‌నగర్ చేరుకున్న రాహుల్.. మునుగోడులో పార్టీ అభ్యర్థి స్రవంతితోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్ నాయకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నేతలు దామోదరెడ్డి, చల్లమల్ల కృష్ణారెడ్డి తదితరులతో రెండు విడతలుగా మునుగోడు ఎన్నికపై సమీక్ష నిర్వహించారు. సాయంత్రం టీ విరామానికి ముందు ఒకసారి.. షాద్‌నగర్ బహిరంగ సభ ముగిశాక మరోసారి సుదీర్ఘంగా సమీక్షను కొనసాగించారు. ‘‘పార్టీ అంతర్గత సర్వే.. ఇతర సర్వేల ఫలితాలు మునుగోడులో కాంగ్రె్‌సకు అనుకూల పరిస్థితులున్నాయని స్పష్టం చేస్తున్నాయి. మరింత కష్టపడి పనిచేయాలి. వారం రోజులుగా బీజేపీ, టీఆర్‌ఎస్ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. మునుగోడులో రోజురోజుకూ పరిస్థితులు మారుతున్నాయి. ప్రజలు మనవైపే చూస్తున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
బీజేపీ, ఆరెస్సెస్, టీఆర్‌ఎస్‌పై ఫైర్
భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌గాంధీ ఆదివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ వై జంక్షన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. బీజేపీ, టీఆర్‌ఎ్‌సపై నిప్పులు చెరిగారు. ‘‘బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు ఎన్నికల సమయంలోనే డ్రామాలు ఆడతాయి. ఇతర సమయాల్లో కలిసే ఉంటాయి. పార్లమెంట్‌లో బీజేపీ ప్రవేశపెట్టే బిల్లులన్నింటికీ టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుంది. ఎన్నికలప్పుడు ఈ రెండు పార్టీలు రూ. వందల కోట్లు పంచిపెడతాయి. వీరికి ఆ డబ్బు ఎక్కడిది? ఈ అక్రమ సొమ్మంతా దేశ ప్రజల జేబుల్లోంచి దొంగిలించిందే. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ తమ వ్యాపార మిత్రులకు ప్రజాధనాన్ని దోచిపెడున్నారు. ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రోడ్లు, వ్యవసాయం.. ఎరువులు.. ఇలా అన్ని వ్యాపారాలను ఈ ఇద్దరూ తమ మిత్రులకు దోచిపెడుతున్నారు’’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్, టీఆర్‌ఎస్ వాళ్లు ప్రజల గొంతు నొక్కుతున్నారని.. వారి మధ్య చిచ్చుపెట్టి, లాభపడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసిన సర్కారు.. విద్య, వైద్యం కోసం ఖర్చుచేయాల్సిన నిధులను దారి మళ్లిస్తోందన్నారు. ‘‘ఇరిగేషన్, ధరణి ద్వారా కమిషన్లు దండుకునే యత్నం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పగలు ఇరిగేషన్, రాత్రి ధరణి కమీషన్లను దండుకునే పనిలో ఉన్నారు’’ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఆ వెంటనే ధరణిని మెరుగుపరుస్తామని, పేదల నుంచి లాక్కొన్న భూములను వారికి తిరిగి ఇస్తామని చెప్పారు.
రంగారెడ్డి జిల్లాలో ‘జోడో’జోష్
రంగారెడ్డి అర్బన్: రంగారెడ్డి జిల్లాలో రాహుల్‌గాంధీ భారత్ జోడో పాదయాత్ర మొదటి రోజు ఆదివారం ఉత్సాహంగా సాగింది. సాయంత్రం 5 గంటలకు రాహుల్ రంగారెడ్డి జిల్లాలోకి అడుగుపెట్టారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. రాయికల్ సమీపంలోని సుస్వాగత్ హోటల్ వద్ద ఆగిన రాహుల్.. అక్కడ టీ తాగుతూ మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతితో ముచ్చటించారు. తొలి రోజు రంగారెడ్డి జిల్లాలో రాహుల్ పాదయాత్ర 8 కిలోమీటర్లు జరిగింది. రాత్రి 6.45 గంటలకు షాద్‌నగర్ జాతీయ రహదారి బైపాస్ వై జంక్షన్‌వద్ద కార్నర్ మీటింగ్ జరిగింది. అనంతరం షాద్‌నగర్ సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాహుల్ చేరుకున్నారు. కాగా, రంగారెడ్డి జిల్లా కొత్తూరులో సోమవారం జరగనున్న రాహుల్‌సభ ఏర్పాట్లలో అపశ్రుతి చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్‌తో రెండు జనరేటర్ల వాహనాలు దగ్ధమయ్యాయి.
Updated Date - 2022-10-31T04:53:25+05:30 IST