Twitter War : మొన్నటి దాకా పులివెందుల..ఇప్పుడు తెలంగాణ
ABN, First Publish Date - 2022-12-01T02:13:57+05:30
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలపై మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సహా టీఆర్‌ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె కమలం కోవర్టు అని, ఆ పార్టీ మాటలను పలికే చిలకమ్మ అని.. మొన్నటి దాకా పులివెందులలో ఓటున్న ఆమె, ఇప్పుడు తెలంగాణ
అందుకే షర్మిల అరెస్టును ఆ పార్టీ నేతలు ఖండించారు: కవిత
అల్లకల్లోలం సృష్టించడమే షర్మిల లక్ష్యం: శ్రీనివాస్‌గౌడ్
ఇకపై ఊరుకోబోం.. నోరు అదుపులో పెట్టుకోవాలి: గొంగిడి సునీత
రాష్ట్రం అఫ్ఘానిస్థాన్ అయితే ఇక్కడ ఎందుకుంటున్నారు: మాలోతు కవిత
విధ్వంసాలు సృష్టించేందుకే ఆమె పాదయాత్ర: పెద్ది సుదర్శన్ రెడ్డి
పద్ధతి మార్చుకో: రేఖానాయక్
ఆమె భాష ఆడబిడ్డలు మాట్లాడే విధంగా ఉందా?: బాల్క సుమన్
హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఉట్నూర్, నర్సంపేట, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలపై మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సహా టీఆర్‌ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె కమలం కోవర్టు అని, ఆ పార్టీ మాటలను పలికే చిలకమ్మ అని.. మొన్నటి దాకా పులివెందులలో ఓటున్న ఆమె, ఇప్పుడు తెలంగాణ రూటు పట్టారని ఒకరు.. తెలంగాణతో ఏం సంబంధం లేకున్నా ఆమె పాదయాత్ర చేస్తున్నారని, మహిళ అయినంత మాత్రాన ఇష్టానుసారంగా మాట్లాడితే సహిస్తారా? అని మరొకరు.. మంత్రులను పట్టుకొని వాడూ, వీడూ అని సంబోధిస్తావా? అని ఇంకొకరు.. తెలంగాణలో పోటీ చేస్తే ఆమెకు కేఏ పాల్ కన్నా తక్కువ ఓట్లు వస్తాయని ఎద్దేవా చేస్తూ నోరు అదుపులో పెట్టుకోవాలి.. లేదంటే ఊరుకోం అని మరొకరు షర్మిలను ఘాటుగా హెచ్చరించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విటర్ వేదికగా షర్మిలపై విమర్శలు చేయగా ఇతర నేతలు మీడియా ముఖంగా ఆమెను హెచ్చరించారు. ఈ క్రమంలో కల్వకుంట్ల కవితకు, షర్మిలకు మధ్య బుధవారం ట్విటర్ వార్ నడిచింది!! కమలం పార్టీ వదిలిన బాణం షర్మిల అని, ఆమె అరెస్టుపై ఆ పార్టీ నేతల ప్రతిస్పందనలే ఇందుకు నిదర్శనం అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విటర్ వేదికగా షర్మిలకు మద్దతు పలకడాన్ని పేర్కొంటూ బుధవారం ఆమె ట్విట్ చేశారు. ‘‘తాము వదిలిన బాణం తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు’’ అనే శీర్షికను జోడిస్తూ ఆమె వ్యంగ్యంగా స్పందించారు. దీనికి షర్మిల తన ట్విటర్ ఖాతాలో కవితపై విమర్శలు చేశారు. దానిపైనా కవిత ఘాటుగా స్పందించి మరో ట్వీట్ చేశారు. ‘‘అమ్మా.. కమల బాణం.. ఇది మా తెలంగాణ.
పాలు ఏవో నీళ్లేవో తెలిసిన చైతన్య ప్రజాగణం! మీకు నిన్నటి దాకా పులివెందులలో ఓటు.. నేడు తెలంగాణ రూటు. మీరు కమలం కోవర్టు ఆరెంజ్ ప్యారెట్టు. మీలాగా పొలిటికల్ టూరిస్టును కాను. రాజ్యం వచ్చాక నేను రాలేదు. ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి కవితను’’ను అని వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణలో ఏదో ఒక అలజడి సృష్టించాలని, ఇక్కడివారితో దాడి చేయించుకొని తద్వారా అల్లకల్లోలం సృష్టించడమే షర్మిల లక్ష్యం తప్ప ఆమెకి వేరే ఆలోచనే లేదని మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్ విమర్శించారు. తెలంగాణతో ఏమాత్రం సంబంధం లేకున్నా పాదయాత్రలు చేస్తూ ప్రజలను ఆమె అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. మహిళ అయినంత మాత్రాన ఇష్టానుసారంగా మాట్లాడితే సహిస్తారా? ప్రధాని మోదీపై కూడా ఇలాగే మాట్లాడితే బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఊరుకుంటారా? అని నిలదీశారు. షర్మిలకు బీజేపీ అంతర్గతంగా మద్దతిస్తోందని, ఇటీవల ఆమె ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీ అయ్యారని జనం అనుకుంటున్నారని ఆరోపించారు. ఆమె సీఎం కేసీఆర్ అంతటి వ్యక్తిపైనే తీవ్ర పదజాలం ఉపయోగించారని.. కేసీఆర్‌ను ఉద్దేశించి షర్మిల మాట్లాడే విధానం పద్ధతేనా? అని ప్రశ్నించారు. సీఎంను పట్టుకొని షర్మిల ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మొగోడివా? మొగతనముందా? అని ఆమె మాట్లాడటం ఏ పద్ధతి? అని ప్రశ్నించారు. ఆమె మంత్రులను పట్టుకొని.. వాడు, వీడు అని సంబోధిస్తున్నారని, మంత్రి నిరంజన్‌రెడ్డిని చెప్పుతో కొడతానన్నారని గుర్తు చేశారు. షర్మిలపై మంత్రి.. తెలంగాణ సంప్రదాయంలో ఉపయోగించే పదాలే ఉపయోగించినా, ఆమె అభ్యంతరపెడితే ఉపసంహరించుకోవడంతో పాటు, క్షమాపణ కూడా చెప్పారని తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని పట్టుకొని మగాడివేనా ఆని కామెంట్ చేయడం ఏం పద్ధతి అని,, ఆయన నియోజకవర్గంలోకి వెళ్లి, వాళ్ల ఎమ్మెల్యేను మగాడివేనా అంటే అక్కడి ప్రజలకు కోపం రాదా? అని ప్రశ్నించారు. ఆంధ్రలోకి వెళ్లి జగన్‌మోహన్‌రెడ్డిని ఇలాగే అంటే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.
షర్మిల మాటలు విని మహిళలంతా సిగ్గుపడుతున్నారని ఎంపీ మాలోతు కవిత, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సహా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలపై నోటికొచ్చినట్లు ఆమె మాట్లాడుతున్నా సాటి మహిళే కదా అని ఇంతకాలం ఆగాం అని, ఇకపై ఊరుకోబోం అని వారు హెచ్చరించారు. బుధవారం టీఆర్‌ఎ్‌సఎల్పీలో మాలోతు కవిత, సునీత మీడియాతో మాట్లాడారు. తెలంగాణను అఫ్ఘానిస్థాన్ అని అంటున్న షర్మిల ఇక్కడెందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. తండ్రి మాదిరిగా గౌరవించాల్సిన కేసీఆర్‌ను తాలిబాన్ అంటూ షర్మిల వ్యాఖ్యానించడం ఏమాత్రం సరికాదన్నారు. ఇకపై ఆమె చేపట్టే యాత్రలు, సభల్లో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. లేదంటే ఆమెపై జనం చేసే దాడులకు తాము ఎంతమాత్రం బాధ్యులం కాదని హెచ్చరించారు. తెలంగాణలో పోటీ చేస్తే ఆమెకు కేఏ పాల్ కన్నా తక్కువ ఓట్లు వస్తాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ సమాజాన్ని కించపరుస్తూ విఽధ్వంసాలు సృష్టించేందుకే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం, ఎమ్మెల్యేలపై షర్మిల నోరుపారేసుకుంటున్న షర్మిల పద్ధతి మార్చుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ హితవు పలికారు తెలంగాణ ఏర్పాటును వైఎస్‌ఆర్ సహా ఆయన కుటుంబం అంతా వ్యతిరేకించిందని ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యే నోముల భగత్ బుధవారం ఆరోపించారు. షర్మిల మాట్లాడుతున్న భాష, ఆడబిడ్డలు మాట్లాడుతున్నట్లు ఉందా? అని ప్రశ్నించారు.
Updated Date - 2022-12-01T08:13:16+05:30 IST