నేడు రామప్పకు రాష్ట్రపతి
ABN , First Publish Date - 2022-12-27T23:57:50+05:30 IST
ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని బుధవారం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సందర్శించనున్నారు. ఇందు కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండలం పాలంపేటలోని రామప్ప ఆలయం వద్ద ఏర్పాట్లు పూర్తికాగా, పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు.

45 నిమిషాల పాటు గడపనున్న ద్రౌపది ముర్ము
విస్తృత ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం
547 మంది పోలీసులతో భారీ బందోబస్తు
కాన్వాయ్ ట్రయల్‌రన్‌ను పర్యవేక్షించిన ఐజీ నాగిరెడ్డి
ఏర్పాట్లను పరిశీలించిన ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీ
రూ.62 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పాల్గొననున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు
వెంకటాపూర్ (రామప్ప), డిసెంబరు 27 : ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని బుధవారం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సందర్శించనున్నారు. ఇందు కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండలం పాలంపేటలోని రామప్ప ఆలయం వద్ద ఏర్పాట్లు పూర్తికాగా, పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గొంటుండగా ఐజీ నాగిరెడ్డి పర్యవేక్షించారు. ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి.పాటిల్‌లు అధికారులతో కలిసి ఏర్పాట్లలో తలమునకలయ్యారు.
పర్యటన వివరాలు ఇలా..
రాష్ట్రపతి ద్రౌపదిముర్ము మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు రామప్ప చేరుకుంటారు. పర్యటన 45 నిమిషాల పాటు సాగనుంది. ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా రామప్పకు చేరుకుంటారు. ప్రత్యేక కాన్వాయ్‌లో ఆలయం పడమర ముఖద్వారం వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి బ్యాటరీ కారులో ఆలయ సమీపానికి వస్తారు. స న్నాయి వాయిద్యాలు, పూర్ణకుంభంతో దేవాదాయ శాఖ అధికారులు స్వాగతం పలుకుతారు. రుద్రేశ్వరస్వామికి (రామలింగేశ్వరుడు) ప్రత్యేక పూజలు చేస్తారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్టు కన్వీనర్ పాండురంగారావు ఆలయ విశిష్టత, నిర్మాణం, యునెస్కో గుర్తింపుకు కోసం తయారు చేసిన డోసియర్ వివరాలు, వరల్డ్ హెరిటేజ్ బాడి విధించిన నిబంధనలు, తదితర అంశాలను రాష్ట్రపతికి వివరిస్తారు. అనంతరం రామప్ప ఆలయ చరిత్రను తెలిపే కాకతీయ డైనస్టీ, కాకతీయ హెరిటేజ్, నృత్యరత్నావలి పుస్తకాలను అందించనున్నారు. ‘ప్రసాద్’ పథకంలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రామప్ప చుట్టుపక్కల కల్పించునున్న మౌలిక సదుపాయాల శిలాఫలకం, కామేశ్వరాలయ పునర్‌నిర్మాణ శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. సాంస్కృతిక ప్రదర్శనను తిలకించిన తర్వాత ప్రసాద్ పథకానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. కార్యక్రమ ముగింపు అనంతరం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు వెళ్తారు. రాష్ట్రపతి కాన్వాయ్‌లో 29 వాహనాలుండనున్నాయి. అంబులెన్స్, ఫైర్‌సేఫ్టీ వెహికిల్‌తో పాటు రాష్ట్రపతి కోసం ప్రత్యేక కారు, ప్రముఖులు, అధికారులు, భద్రతా సిబ్బందికి సంబంధించిన వాహనాలుంటాయి.
జర్మన్ టెంటు, సభావేదిక
రామప్ప గార్డెన్‌లో జర్మన్ టెంటును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. విశాలమైన స్టేజీని నిర్మించారు. ఇక్కడ సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రసాద్ పథకంలో భాగంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖల ఆధ్వర్యంలో రామప్ప ఆలయ అభివృద్ధికి రూ.62 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చే స్తారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రెండు సేఫ్ హౌజ్‌లను ఏర్పాటు చేశా రు. ఒకదానిలో కార్డియాలజిస్టు, జనరల్ ఫిజీషియన్, అనస్తీషియా డాక్టర్, ఆక్సిజన్ సిలిండర్స్ అందుబాటులో ఉంటాయి. మరో సేఫ్‌హౌ్‌సలో కంటి వైద్యుడు, జనరల్ మెడిసిన్, అనస్తీషియా, పిల్లల వైద్యులతో పాటు ఒక అత్యవసర అంబులెన్స్, రక్త నిధి కేంద్రం, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, ఎంఎన్‌వో ఇలా మొత్తం 30 ఉంటారు. వారందరినీ జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య పర్యవేక్షిస్తారు.
విధులు, గుర్తింపు కార్డులు..
రాష్ట్రపతి పర్యటన విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి.పాటిల్ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. మంగళవారం అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, దిశా నిర్దేశం చేసి ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి పర్యటనకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని, రాష్ట్రపతి వివిధ రకాల పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అందుకు కావాల్సిన శిలఫలకాలు తదితర పనులను పూర్తి చేశామని తెలిపారు.
కట్టుదిట్టమైన భద్రత
జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ఆధ్వర్యంలో రాష్ట్రపతి పర్యటనకు 547 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేంద్ర భద్రతా సిబ్బంది, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి తప్పిదాలు జరుగకుండా మంగళవారం ఉదయం, సాయంత్రం హెలిప్యాడ్ స్థలం నుంచి ఆలయం వరకు వాహన శ్రేణితో రిహార్సల్ చేశారు. ఐజి నాగిరెడ్డి, ఇంటలీజెన్స్ ఎస్పీ నారాయణనాయక్, 5వ బెటాలియన్ అధికారులు సాయంత్రం రామప్పకు చేరుకుని మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎయిర్ ఫోర్స్ అదికారులు రామప్పలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలంలో ల్యాండింగ్ రిహార్సల్ చేశారు. చుట్ట ప్రక్కల ప్రదేశంలో ఏరియల్ సర్వే నిర్వహించారు.
చింతలపల్లి కళాకారులతో కొమ్ము నృత్యం
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెంది న ఆదివాసీ కొమ్మునృత్య కళాకారులకు అరుదైన అవకాశం లభించింది. రాష్ట్రపతి సమక్షంలో వారు ప్రదర్శన ఇవ్వనున్నారు. చిన్నబోయినపల్లికి సమీపంలో ఉన్న గూ డానికి చెందిన కళాకారులను ఐటీడీఏ పీవో అంకిత్ పర్యవేక్షణలో మంగళవారం సాయంత్రం రామప్పకు తీసుకువచ్చి రిహార్సల్స్ చేశారు. రాత్రికి ఇక్కడే బసచేశారు.
హాజరుకానున్న ప్రముఖులు
రాష్ట్రపతి పర్యటనలో పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు పాల్గొననున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ పోచంపెల్లి శ్రీనివాస్ రెడ్డిలు హాజరుకానున్నారు. హెలిప్యాడ్ వద్ద రాష్ట్రపతికి ఆహ్వానం పలికే బృందంలో పాలంపేట సర్పంచ్ డోలి రజిత, జడ్పీటీసీ గై రుద్రమదేవి, ఎంపీపీ బుర్ర రజిత, వైస్ ఎంపీపీ మునిగంటి తిరుపతి రెడ్డిలకు అవకాశం కల్పించగా వారందరికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. కాగా, మంగళవారం సాయంత్రం ములుగు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోతోపాటు పలువురు అధికారులకు కొవిడ్ పరీక్షలు జరిపారు. కాన్వాయ్‌లో విధులు నిర్వర్తించే డ్రైవర్‌లకు సోమవారమే పరీక్షలు చేశారు.
రూ.61.99 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ములుగు: రామప్ప ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ‘ప్రసాద్’ (పిలిగ్రిమేజ్ రీజువినేషన్ స్పిరిచువల్ ఆగ్‌మెంటేషన్ డ్రైవ్) పథకంలో భాగం గా రూ.61.99 కోట్లను మంజూరు చేసింది. బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామప్ప పర్యటనలో అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ పథకంలో భాగంగా రామప్పలో పలు అభివృద్ధి పనులు చేయనున్నారు. 4డీ మూవీ హాల్, కాకతీయ తోరణం ఆర్చీ, గార్డెన్, ప్లేగ్రౌండ్, వాహనాల పార్కింగ్, హోటళ్లు, షాపింగ్ మాల్స్, మరుగుదొడ్లు నిర్మాణం, బయోటాయిలెట్స్, రహదారుల విస్తరణ, లైటింగ్, సిట్టింగ్ బెంచీలు, సీసీ కెమెరాలు, సర్వేలైన్స్ సిస్టంలు ఏర్పాటు, బ్యాటరీ వాహనాల చార్జింగ్ పాయింట్, సోలార్ విద్యుత్ పవర్‌ప్లాంట్, సరస్సులో జెట్టి బోట్స్ తదితర పనులు చేయనున్నారు.
2.20 నిమిషాలకు రాష్ట్రపతి రాక
ములుగు: షెడ్యూల్ ప్రకారం భద్రాచలం పర్యటన ముగించుకున్న తర్వాత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము బుధవారం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు రామప్పలోని హెలీప్యాడ్ వద్ద ల్యాండ్ అవుతారు. 2.30 గంటలకు ప్రత్యేక కాన్వాయ్‌లో బయలుదేరి 2.40 గంటలకు ఆలయం వద్దకు వస్తారు. రుద్రేశ్వరుడి దర్శనం, ఆశీర్వచనం, ఆలయ విశిష్టతను తెలుసుకున్న అనంతరం 20 నిమిషాల తర్వాత సరిగా 3 గంటలకు అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు.
అపూర్వ ఘట్టం..
ఉమ్మడి వరంగల్ జిల్లా చరిత్రలో రాష్ట్రపతి రాక ఇదే ప్రథమం
1982లో ఉపరాష్ట్రపతి హిదాయతుల్ల రాక
హనుమకొండ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తి ఉమ్మడి వరంగల్ జిల్లాకు రావడం చరిత్రలో ఇదే ప్రథమం. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము బుధవారం రామప్పకు రానున్న విషయం విదితమే. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని సందర్శించడమే కాకుండా ఇక్కడ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను సైతం ఆమె వీక్షించనున్నడడంతో యావద్దేశ ప్రజల దృష్టి ఉమ్మడి వరంగల్ జిల్లా వైపు మళ్ళింది. 1982లో జరిగిన పోతన పంచశతి ఉత్సవాలకు అప్పటి ఉపరాష్ట్రపతి హిదాయతుల్ల ముఖ్యఅతిఽధిగా హాజరయ్యారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అంతకన్న మించిన హోదాలో ఒక రాజ్యాధిపతి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాలిడడం ఇదే మొదటి సారి. మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న హయాంలో ఆయన చొరవతో వరంగల్‌లో పోతన పంచశతి ఉత్సవాలు అయిదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ఉపరాష్ట్రపతిని ఆహ్వానించడం అప్పట్లో అదో సంచలనం.