AP Highcourt: కోడికత్తి కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే
ABN, First Publish Date - 2023-10-17T12:33:51+05:30
కోడికత్తి కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. విచారణను ఎనిమిది వారాల పాటు నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
అమరావతి: కోడికత్తి కేసు (Kodikathi Case) విచారణపై ఏపీ హైకోర్టు (AP HighCourt) స్టే విధించింది. విచారణను ఎనిమిది వారాల పాటు నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కోడికత్తి కేసులో లోతైన విచారణ జరపాలి అన్న పిటిషన్‌ను ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చడంతో ఎన్‌ఐఏ కోర్టు (NIA Court) ఉత్తర్వులను హైకోర్టులో జగన్ (CM Jagan) సవాల్ చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్‌ఐఏకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఆరు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
కాగా.. కోడికత్తి కేసులో ఇంకా లోతైన దర్యాప్తు చేసేలా ఎన్ఐఏను ఆదేశించాలని ఐదు సంవత్సరాల తరువాత కోర్టును సీఎం జగన్ అభ్యర్ధించారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో తనపై కోడికత్తి దాడి ఘటనపై లోతైన విచారణ జరిపేలా ఎన్ఐఏను ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 2019 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై కోడి కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. దాడి చేశారని పేర్కొంటూ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దాడి ఘటనకు సంబంధించి జె.శ్రీనివాసరావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తదనంతరం కేసుపై ఎన్ఐఏ దర్యాప్తును ప్రారంభించింది. ఇటీవల సంబంధిత కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. కోడికత్తి దాడి ఘటనలో ఎలాంటి కుట్రకోణం లేదని ఎన్‌ఐఏ కోర్టు తేల్చింది. జగన్ పిటిషన్‌ను ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చడంతో.. ఎన్‌ఐఏ కోర్టు ఉత్తర్వులను జగన్ హైకోర్టులో సవాల్ చేశారు.
Updated Date - 2023-10-17T12:33:51+05:30 IST