Avinash In Viveka Case: వైసీపీలో అవినాశ్‌రెడ్డి టెన్షన్
ABN, First Publish Date - 2023-04-28T19:22:51+05:30
అధికార పార్టీలో అవినాశ్ రెడ్డి (Avinash Reddy) టెన్షన్ మొదలైంది. ముందస్తు బెయిల్‌లో చుక్కెదురు కావడంతో ఏం జరుగుతుందోనని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
అమరావతి: అధికార పార్టీలో అవినాశ్ రెడ్డి (Avinash Reddy) టెన్షన్ మొదలైంది. ముందస్తు బెయిల్‌లో చుక్కెదురు కావడంతో ఏం జరుగుతుందోనని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు వెకేషన్ బెంచ్ లేకపోవడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. హౌస్‌మోషన్ (House motion) మూవ్ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై.. సీనియర్ న్యాయవాదులతో అవినాశ్‌రెడ్డి లాయర్ల చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే సుప్రీంకోర్టు (Supreme Court)కు వెళ్తే మళ్లీ ఇబ్బందులే సీనియర్ న్యాయవాదులు అంటున్నారు. ఈలోగా అవినాశ్‌రెడ్డిని అరెస్ట్ చేస్తే.. పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని వైసీపీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. సీబీఐని కట్టడి చేసేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ, హైదరాబాద్ సీనియర్ న్యాయవాదులతో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు సంప్రదింపుల్లో మునిగిపోయారు.
మాజీమంత్రి వివేకానందరెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వివేకా హత్య కేసులో సీబీఐ తన పని తాను చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. అవినాశ్ ముందస్తు బెయిల్ (Anticipatary Bail) పిటిషన్ విచారణను జూన్ 5కు కోర్టు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని, ఈ వ్యవహారంలో తాము కలగజేసుకోమని న్యాయస్థానం తేల్చిచెప్పింది. బెయిల్ పిటిషన్ తేలేవరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆపాలని పిటిషనర్ కోరారు. 2 వారాలైనా తదుపరి చర్యలు తీసుకోకుండా.. సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాశ్ న్యాయవాదులు కోరారు. సీబీఐ తదుపరి చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. ముందస్తు బెయిల్‌పై ఊరట లభించకపోవడంతో అవినాశ్ రెడ్డికి తిప్పలు తప్పేలా లేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. గతంలోనే అరెస్ట్ చేయాలని సీబీఐ భావించింది. ఇంతలోనే అవినాశ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురు కావడంతో సీబీఐ ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
Updated Date - 2023-04-28T19:22:51+05:30 IST