Bonda Uma: తిరుమలలో చిరుతల సంచారంపై బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-08-16T11:03:26+05:30
తిరుమలలో చిరుతల సంచారంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: తిరుమలలో చిరుతల సంచారంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా (TDP Leader Bonda Uma) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల ఎర్రచందనం స్మగ్లింగ్ వల్లే చిరుతలు నడక మార్గంలోకి వచ్చేస్తున్నాయని ఆయన ఆరోపణలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలో (YCP) పుష్పాలు ఎక్కువయ్యారని ఎద్దేవా చేశారు. వైసీపీ పుష్పాలు ఎర్రచందనం స్మగ్లింగ్ యధేచ్ఛగా చేస్తున్నారని... ఎర్ర చందనం కోసం భారీగా అడవులు నరికేయడం వల్లే చిరుతలు తిరుమల మెట్ల మార్గంలోకి వచ్చేస్తున్నాయని తెలిపారు. చిరుతపులిని తరమడానికి బ్రహ్మాండమైన రూళ్ల కర్ర ఇస్తారట.. ఆ రూళ్ల కర్రతో భక్తులు ప్రభుత్వానికి బడితే పూజ చేయాలంటూ వ్యాఖ్యలు చేశారు. భక్తులకు సరైన సమాధానం చెప్పుకోలేక రూళ్ల కర్ర ఇస్తామంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్ధతను కప్పి పుచ్చుకోవడానికి పిచ్చి మాటలు.. తుగ్లక్ చేష్టలు చేస్తున్నారంటూ బోండా ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ నాలుగున్నరేళ్లు ఏం పీకారు?..
బోండా ఉమా ఇంకా మాట్లాడుతూ... ‘‘మేం విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం.. వైసీపీ ప్రిజన్ డాక్యుమెంట్ ఇస్తుంది. అభివృద్ధి ఎలా చేయాలో అనేది మా విజన్ డాక్యుమెంట్.. ఎంత మంది జైళ్లకి పంపాలోననేది వైసీపీ ప్రిజన్ డాక్యుమెంట్. వైసీపీకి విజన్ అంటే అర్థమే తెలియదు. అబద్దాలు చెప్పే వైసీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు అవినీతి చేశాడంటున్న వైసీపీ.. ఈ నాలుగున్నరేళ్లు ఏం పీకారు..?. ఒక్క రూపాయైనా చంద్రబాబు అక్రమంగా దోచుకున్నారని వైసీపీ ఎందుకు నిరూపించ లేకపోయింది. అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారనే సొల్లు పురాణం ఎన్నాళ్లు చెబుతారు..?. ఎన్ని ఎంక్వైరీలు వేసుకున్నా చంద్రబాబు కాలి గోటిని కూడా టచ్ చేయలేకపోయారు. చంద్రబాబు ఏదైనా తప్పు చేస్తే.. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో జగన్ ఊరుకునేవాడా..?. చంద్రబాబు 420నా.. వైసీపీ వాళ్లంతా 840గాళ్లు. ఏపీలో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో రూ.10 లక్షల కోట్ల మేర దోచుకున్నారు. తాగుబోతుల జేబులను కొట్టేసే వైసీపీ.. చంద్రబాబుని విమర్శిస్తారా..?. జగన్ పని అయిపోయింది.. అందుకే అబద్దాలు చెప్పి మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ చెప్పే ప్రతిమాట అబద్దమే. నవరత్నాలు అంటూ నవ మోసాలు చేశారు. పది మందికిచ్చి.. 90 మందికి పథకాలు ఎగ్గొట్టారు. ఒంటి మీద మంచి బట్టలున్నా.. పథకాల్లో కోత వేశారు’’ అంటూ బోండా ఉమా దుయ్యబట్టారు.
Updated Date - 2023-08-16T11:03:26+05:30 IST