Chandrababu: కాన్వాయ్ దిగి కాలినడకన అనపర్తికి చంద్రబాబు
ABN, First Publish Date - 2023-02-17T18:43:23+05:30
బలభద్రపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కాన్వాయ్‌ని పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు.
రాజమండ్రి: బలభద్రపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కాన్వాయ్‌ని పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు పోలీసులు, పారా మిలిటరీ బలగాలను ప్రభుత్వం మోహరించింది. రోడ్డుకు అడ్డంగా పోలీసులు (police) కూర్చున్నారు. అయితే చంద్రబాబు కారు దిగి కాలినడకన అనపర్తి బయలుదేరారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు రోడ్డుపై లారీలు, బస్సులు, వ్యాన్లను రోడ్డుపై నిలిపివేశారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై ఉన్న వాహనాలు తీస్తారా లేదా అని చంద్రబాబు పోలీసులకు అల్టిమేటం (Ultimatum) జారీ చేశారు. అయినా పోలీసులు ఏమాత్రం స్పందించలేదు. ఈ పరిణామాలను చూసిన ఆయన ఎన్నడూ లేనంతగా తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యారు.
ఇది పోలీసుల రాజ్యం కూడా కాదు రౌడీరాజ్యమన్నారు. సహాయ నిరాకరణ చేస్తోన్న ప్రతి పోలీసునూ గుర్తుపెట్టుకుంటామని హెచ్చరించారు. జగన్‌రెడ్డి (Jagan Reddy) ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందన్నారు. జగన్‌రెడ్డి ప్రభుత్వ అంతానికి ఇది ప్రజాతిరుగుబాటని హెచ్చరించారు. ఈ సైకో జగన్‌రెడ్డిని ఎవరూ కాపాడలేరన్నారు. పోలీసులు దారి ఇవ్వకపోతే ముందుకే దూసుకెళ్తామని ప్రకటించారు. ఎంతమందిపై కేసులు పెడతారో చూస్తామని, తమ కార్యకర్తలు ముందుకొస్తే పోలీస్ స్టేషన్లే పట్టవని చెప్పారు. రౌడీరాజ్యం అంతం చేసేందుకు ఇదే కౌంట్‌డౌన్ అని చంద్రబాబు అల్టిమేటం జారీ చేశారు.
అనపర్తిలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’
‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని అనపర్తిలో నిర్వహించాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఈ కార్యక్రమం సజావుగా సాగుతుందని టీడీపీ (TDP) కార్యకర్తలు అనుకున్నారు. కానీ ఒక్కసారిగా అనపర్తి (Anaparthi)లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చంద్రబాబు సభపై పోలీసుల ఆంక్షలు విధించారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. రోడ్డుపై సభకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అనపర్తిలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వేరే ప్రాంతంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించుకోవాలని డీఎస్పీ భక్తవత్సల సూచించారు. రోడ్డుపై సభకు అనుమతి లేదని, టీడీపీ నేతలు సహకరించాలని కోరారు డీఎస్పీ. పోలీసుల ఆంక్షలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
Updated Date - 2023-02-17T18:56:41+05:30 IST