Chiranjeevi Fans: కొడాలి నాని పెద్ద చెకోడీ గాడు... గుడివాడలో చిరంజీవి ఫ్యాన్స్ ఆందోళన
ABN, First Publish Date - 2023-08-09T11:15:32+05:30
మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై చిరు ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గుడివాడలో చిరంజీవి అభిమానుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.
కృష్ణా జిల్లా: మెగాస్టార్ చిరంజీవిపై (Megastar Chiranjeevi) మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (YCP Leader Kodalinani) చేసిన వ్యాఖ్యలపై చిరు ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గుడివాడలో చిరంజీవి అభిమానుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ‘‘డౌన్ డౌన్ కొడాలి నాని... జై చిరంజీవ’’ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పురవీధుల్లో అభిమానులు నిరసన ర్యాలీ చేపట్టారు. చిరుకు కొడాలి నాని క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అయితే చిరంజీవి అభిమానుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, చిరంజీవి అభిమానులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, పలువురు అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చిరంజీవి అభిమానులు.. పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి అభిమానులను పోలీసులు నియంత్రించలేకపోయిన పరిస్థితి నెలకొంది.
గుడివాడ ఏజీకే స్కూల్ సెంటర్లో విజయవాడ ప్రధాన రహదారిపై అభిమానులు బైఠాయించి నిరసన చేపట్టారు. అలాగే దివంగత నేత వంగవీటి మోహనరంగా విగ్రహానికి క్షీరాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా చిరు అభిమానులు మాట్లాడుతూ.. కొడాలి నాని పెద్ద చెకోడీ గాడు అంటూ విరుచుకుపడ్డారు. చిరంజీవికి కొడాలి నాని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చిరంజీవి, రంగా అభిమానుల ఓటుతో గెలిచిన కొడాలి నానికి 2024 ఎన్నికల్లో బుద్ధి చెబుతామని చిరంజీవి ఫ్యాన్స్ హెచ్చరించారు.
అసలేం జరిగిందంటే..
‘‘వాల్తేరు వీరయ్య’’ సినిమా 200 రోజుల వేడుకలో ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. చిరంజీవి మాట్లాడుతూ... ‘‘యాక్టర్ల రెమ్యూనరేషన్‌పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంగా ఫీల్మ్ ఇండస్ట్రీపై పడతారెందుకు?. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి, పేదవారి కడుపు నింపే ఆలోచనలు చేయాలి’’ అంటూ మెగాస్టార్ హితవుపలికారు.
దీనిపై కొడాలి నాని కౌంటర్ ఎటాక్ చేశారు. తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు సినీ పరిశ్రమలో ఉన్న పకోడిగాళ్లకు కూడా చెబితే బాగుంటుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. సినీ ఇండస్ట్రీలో చాలా మంది పకోడిగాళ్లు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఎలా ఉండాలో పకోడిగాళ్ల సలహాలు తన వాళ్లకు ఇచ్చుకుంటే మంచిది అని హితవు పలికారు. రాజకీయాలు మనకెందుకు.. డ్యాన్స్‌లు, ఫైట్స్, యాక్షన్ గురించి ఆలోచించండని తన పకోడిగాళ్లకు సలహాలు ఇస్తే బాగుంటుందని కొడాలి నాని సూచించారు.
Updated Date - 2023-08-09T11:51:57+05:30 IST