AP News: సోషల్ మీడియాలో కాణిపాకం వినాయక స్వామి ఫోటోలపై చైర్మన్ స్పందన..
ABN, First Publish Date - 2023-04-12T12:04:05+05:30
ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక ఆలయంలో మూలవిరాట్ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన ఘటనపై చైర్మన్ మోహన్ రెడ్డి స్పందించారు.
చిత్తూరు: ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక ఆలయంలో మూలవిరాట్ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన ఘటనపై చైర్మన్ మోహన్ రెడ్డి స్పందించారు. కాణిపాక వినాయక స్వామి మూలవిరాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తిపై త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెల మూడో తేదీ నుంచి ఆలయంలోకి అధికారులు గానీ, అర్చకులు గానీ, హోంగార్డ్స్ ప్రతి ఒక్కరు సెల్ఫోన్లు తీసుకుని వెళ్లడం నిషేధమని జీవో విడుదల చేసినట్లు తెలిపారు. మూల విరాట్ ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ అయిన విషయం మీడియాలో ప్రసారం కావడంతో తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే సీసీ కెమెరాల నిఘాతో నిరంతరాయం పర్యవేక్షిస్తున్నమని తెలిపారు. మరల ఇలాంటి సంఘటన పురావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని... ఇలాంటి ఘటనల వల్ల ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని చైర్మన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
రెండు రోజుల క్రితం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి విగ్రహం ఫోటో నెట్టింట్లో హల్‌చల్ చేసింది. పలమనేరు కుప్పం మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి దంపతులు, వెంకటరెడ్డి అనుచరులు వినాయకస్వామి దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో వెంకటరెడ్డి అనుచరులు మొబైల్‌తో పాటు గర్భగుడిలోకి వెళ్లారు. స్వామి వారిని దర్శించుకునే సమయంలో తమ మొబైల్‌తో మూలవిరాట్‌ను వెంకటరెడ్డి అనుచరులు ఫోటో తీశారు. ఆపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు మండిపడ్డారు. ఆలయ అధికారులపై కామెంట్ల రూపంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Updated Date - 2023-04-12T12:04:05+05:30 IST