Operation Cheetah: తిరుమలలో మరికొద్ది రోజుల పాటు ఆపరేషన్ చిరుత
ABN, First Publish Date - 2023-08-17T10:26:15+05:30
తిరుమలలో మరికొద్దిరోజుల పాటు ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని సీసీఎఫ్ నాగేశ్వరరావు తెలిపారు.
తిరుమల: తిరుమలలో మరికొద్ది రోజుల పాటు ఆపరేషన్ చిరుత (Operation Cheetah) కొనసాగుతుందని సీసీఎఫ్ నాగేశ్వరరావు (CCF Nageshwar rao) తెలిపారు. గతంలో బాలికపై దాడి చేసిన ప్రాంతానికి సమీపంలో మరో చిరుత బోనులో చిక్కింది. ఈ సందర్బంగా నాగేశ్వరరావు ఏబీఎన్‌తో (ABN - Andhrajyothy) మాట్లాడుతూ.. అలిపిరి కాలిబాట మార్గోంలోని అటవీ ప్రాంతంలో పలు జంతువులు సంచరిస్తున్నాయని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా వీటి కదలికలను గుర్తించామన్నారు. ప్రస్తుతానికి మూడు రోజుల వ్యవధిలో రెండు చిరుతల్ని బంధించామని చెప్పారు. ఇప్పటికే ఉన్న మూడు బోన్లకు అదనంగా మరో ఆరు బోన్లను అలిపిరి కాలిబాట మార్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిన్న (బుధవారం) రాత్రి అలిపిరి కాలిబాట మార్గం వద్ద ఎలుగుబంటి సంచరించిందన్నారు. శ్రీశైలం అటవీ అధికారులను కూడా తిరుమలకి రప్పించి.. కాలిబాట మార్గంలో జంతు సంచారంపై నిఘా ఉంచామన్నారు. చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుతో ఏదో గుర్తించడానికి మరీ కొంత సమయం పడుతుందని తెలిపారు. చిరుత నమూనాలను ముంబాయిలోని ల్యాబ్‌కు పంపామని.. రిపోర్ట్ వచ్చిన తరువాత ఏ చిరుత దాడి చేసిందో గుర్తిస్తామని అన్నారు. రెండు చిరుతలను జూ లోని క్వారంటైన్‌లో ఉంచామని సీసీఎఫ్ నాగేశ్వరరావు వెల్లడించారు.
Updated Date - 2023-08-17T10:26:15+05:30 IST