Nara Lokesh: విజయవాడ ఏసీబీ కోర్టులో లోకేశ్‌పై సీఐడీ మరో పిటిషన్
ABN, Publish Date - Dec 22 , 2023 | 03:17 PM
టీడీపీ జాతీయ ప్రధాన నారా లోకేశ్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్‌కు ఎన్‌బీడబ్ల్యూ (NBW) జారీచేయాలని పిటిషన్‌లో కోరింది. ఈ కేసులో లోకేశ్‌పై చర్యలు తీసుకోవాలని సీఐడీ కోరింది.
విజయవాడ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్‌కు ఎన్‌బీడబ్ల్యూ (NBW) జారీచేయాలని, ఈ కేసులో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఐఆర్ఆర్ కేసులో 41ఏ నోటీస్ నిబంధనలను లోకేశ్ ఉల్లంఘించారని ఆరోపించింది. సాక్ష్యాలు ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించగా .. పత్రికల క్లిప్పింగ్‌లను సీబీఐ తరపు న్యాయవాది చూపించారు. లోకేశ్‌ను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని, రెడ్ బుక్ పేరుతో అధికారులను లోకేశ్ బెదిరిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొంది. 41ఏ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం కోర్టుకు ఉండదని పిటిషన్‌లో సీఐడీ పేర్కొంది. కాగా ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు జడ్జి శుక్రవారం సాయంత్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్‌పై సీఐడీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో లోకేశ్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా 41ఏ నోటీసు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో లోకేశ్‌కు ఇప్పటికే 41ఏ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే.
Updated Date - Dec 22 , 2023 | 03:20 PM