AP News: మంత్రి పెద్దిరెడ్డి అక్రమాలు, అవినీతిపై కేంద్రమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు
ABN, First Publish Date - 2023-08-01T15:47:14+05:30
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అవినీతి, అక్రమాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేశారు.
న్యూఢిల్లీ: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి (Minister Peddireddy Ramachandra Reddy) అవినీతి, అక్రమాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు (Union Minister Amit Shah) భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేశారు. మంగళవారం కేంద్రమంత్రిని రామచంద్రయాదవ్ కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు, సుమారు రూ.35 వేల కోట్ల అవినీతిపై ఆధారాలతో అమిత్ షాకి ఫిర్యాదు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగేళ్లలో రూ.35 వేల కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ కంపెనీపై 160 క్రిమినల్ కేసులున్నాయన్నారు. 17 మంది డైరెక్టర్ల ద్వారా సూట్కేసు కంపెనీలు సృష్టించి అవినీతిని దాచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 2019 ముందు ఉన్న ఆస్తుల వివరాలు పెద్దిరెడ్డి దాచిపెట్టారని తెలిపారు. పెద్దిరెడ్డిపై అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈడీ ద్వారా దర్యాప్తు జరిపి పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశానన్నారు. ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ ఇచ్చి మోసం చేశారని.. భవిష్యత్‌లో న్యాయపోరాటం చేస్తానని ఆయన అన్నారు.
పెద్దిరెడ్డి తప్పుడు అఫిడవిట్ల పై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఏపీలో ఇప్పుడున్న పార్టీల వల్ల ఉపయోగం లేదన్నారు. తమ పార్టీ వెనుక బీజేపీ లేదని.. బీజేపీ కోసం పనిచేసే వాడినైతే ఆ పార్టీలో చేరేవాడినని తెలిపారు. సుమారు 20 నిముషాలు అమిత్ షా తో భేటీ అయ్యానని.. అన్ని విషయాలు హోమ్ మంత్రికి వివరించినట్లు చెప్పారు. పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ఉన్న అన్ని ఆధారాలు హోమంత్రికి అందజేసినట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దోపిడీకి ఏదీ అతీతం కాదన్నారు. 2019 నుంచి ఈరోజు వరకు కేవలం రెండు కార్యక్రమలు చేస్తున్నారని.. ఒకటి రాష్ట్ర సంపదని దోపిడీ చేయటం, లూటీ చేయటం.. రెండు ప్రజలు కోసం పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలను వేధించటం అని విమర్శించారు. వేల లక్షల కోట్ల కుంభకోణాలు, అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అతని కుటుంబ సభ్యులు ఇసుక సహా అన్ని రంగాల్లో దోపిడీ చేస్తున్నారన్నారు. అవినీతితో సంపాదించిన డబ్బుతో వేల ఎకరాల భూములు కొన్నారన్నారు. పీఎల్‌ఆర్ కంపెనీకి ప్రభుత్వం నుంచి అక్రమంగా వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు తీసుకుంటున్నారని మండిపడ్డారు.
అవినీతి అక్రమాలతో వేల కోట్ల రూపాయలు దోచుకోవడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చరిత్ర అంటూ వ్యాఖ్యలు చేశారు. ఒక్క మంత్రి రూ.35 వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారు అంటే.. మిగిలిన మంత్రుల పరిస్థితి ఏమిటి.. ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. సీఎం నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్ని రకాలుగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర సంపదని లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అన్ని రకాలుగా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజల ముందు పెట్టి అందుకు సంబంధించిన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఎన్నికల్లో పోటీకి పెద్దిరెడ్డి అనర్హుడన్నారు. పెద్దిరెడ్డిని వెంటనే జగన్మోహన్ రెడ్డి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అవినీతిపరుడైన మంత్రి పెద్దిరెడ్డికి చిత్తూరు జిల్లా ఎస్పీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని రామచంద్రయాదవ్ వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-08-01T15:47:14+05:30 IST