TTD: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
ABN, First Publish Date - 2023-04-22T21:21:30+05:30
తిరుమల (Tirumala)లో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు మొదలుకావడం, పైగా శని, ఆదివారాలు కావడంతో భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు.
తిరుమల: తిరుమల (Tirumala)లో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు మొదలుకావడం, పైగా శని, ఆదివారాలు కావడంతో భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. స్లాటెడ్ దర్శన టికెట్లు (Slotted Darshan tickets), టోకెన్లు ఉన్న భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం దర్శనానికి పడుతుంటే టోకెన్లు, టికెట్లు రహిత సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. గదిని పొందేందుకు దాదాపు 3 గంటల సమయం పడుతోంది. తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు భక్తులతో (Devotees) కిక్కిరిసిపోయాయి. కాలినడక మార్గాల్లోనూ యాత్రికుల సందడి నెలకొంది. అలిపిరి కాలినడక మార్గంలో వచ్చే భక్తులు దివ్యదర్శన టోకెన్ల కోసం అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద భారీగా క్యూలైన్‌లో బారులుతీరారు. వేకువజాము నుంచి మధ్యాహ్నం వరకు భూదేవికాంప్లెక్స్ వద్ద క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శనివారానికి 6 వేలు, ఆదివారం ఉదయం స్లాట్లకు సంబంధించి 4 వేల చొప్పున మొత్తం 10 వేల దివ్యదర్శన టోకెన్లు జారీ చేసిన అనంతరం టీటీడీ (TTD) కౌంటర్లను మూసివేసింది. టోకెన్లు లభించని భక్తులు టైంస్లాట్ సర్వదర్శన టోకెన్ల కోసం వెళితే, మరికొంతమంది ఎలాంటి టోకెన్లు లేకుండానే తిరుమలకు చేరుకున్నారు. మరోవైపు శ్రీవారిమెట్టుమార్గంలో 4 వేల దివ్యదర్శన టోకెన్లు జారీ చేశారు.
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రబాబు శనివారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు.జస్టిస్ రవీంద్రబాబుకు రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. అలాగే మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వైద్యనాథన్ కూడా శనివారం వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
Updated Date - 2023-04-22T21:21:44+05:30 IST