ఏపీ ప్రభుత్వానికి ఎట్టకేలకు అప్పు.. అయినా ఉద్యోగులకు ఎదురుచూపులే..!
ABN, First Publish Date - 2023-01-06T21:12:51+05:30
ఏపీ ప్రభుత్వానికి ఎట్టకేలకు అప్పు పుట్టింది. వచ్చే మంగళవారం (Tuesday) సెక్యూరిటీ బాండ్ల వేలానికి కేంద్రం అనుమతిచ్చింది.
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి ఎట్టకేలకు అప్పు పుట్టింది. వచ్చే మంగళవారం (Tuesday) సెక్యూరిటీ బాండ్ల వేలానికి కేంద్రం అనుమతిచ్చింది. రూ.2 వేల కోట్ల మేర బాండ్ల వేలానికి కేంద్రఆర్ధికశాఖ గ్రీన్ సిగ్నలిచ్చింది. ఆర్‌బీఐ (RBI)కి ఇవాళ శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. రూ.వెయ్యి కోట్లు 6 సంవత్సరాలకు. మరో రూ.వెయ్యి కోట్లు పదేళ్లకు వేలం పెట్టనున్నారు. వచ్చే మంగళవారమే ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనాలు, పెన్షన్లు (Pensions) అందుతాయి. అప్పటివరకూ ఉద్యోగులకు ఎదురుచూపులే మిగిలాయి. ప్రతినెల 1వతేదీనే జీతాలు, పెన్షన్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆ విషయాన్ని మర్చిపోయింది. గత ఆరేడు నెలల నుంచి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శాఖల వారీగా ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లను ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు (Government employees) రోజుల తరబడి జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో 31వ తేదీ అర్ధరాత్రే ప్రభుత్వ ఉద్యోగులకు వారి వారి బ్యాంకు అకౌంట్లలో జీతాలు పడేవి.
అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం (YCP Government) అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఉద్యోగుల్లో ఎక్కువమంది అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. 1వతేదీ వచ్చిదంటే ఇంటి అద్దెతోపాటు ఈఎంఐలు, పిల్లల చదువుల ఫీజులు కట్టాల్సి ఉండగా.. రిటైర్డ్ ఉద్యోగులు వారికి అవసరమైన మందులను కొనుగోలు చేసుకోవాల్సి ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ నెలా వేతనాలు సకాలంలో పడిన పరిస్థితి లేకపోవడంతో ఉద్యోగులు ఈఎంఐలు కూడా పెనాల్టీలతో చెల్లించాల్సిన దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత నెలలో 18వతేదీ కూడా కొంతమంది ఉద్యోగుల జీతాలు పడ్డాయి. కొందరికైతే నెలఖారు వరకు పడుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఉపాధ్యాయులకు జీతాలు అందరికన్నా చివర ఇచ్చిన పరిస్థితి. అయితే నూతన సంవత్సరంలోనైనా 1వతేదీనే వేతనాలు, పెన్షన్ డబ్బులు పడతాయని ఆశించిన ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ఎదురుచూపులే మిగిలాయి.
Updated Date - 2023-01-06T21:12:53+05:30 IST