Dharmana: తుపాకీ మన దగ్గరే ఉందిగా.. చంద్రబాబు కంటే ముందే పేల్చేద్దాం.. మంత్రి ధర్మాన హాట్ కామెంట్స్.. అసలు కథేంటి..!?
ABN, First Publish Date - 2023-02-06T19:50:32+05:30
ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలో.. దేనికి వేయకూడదో.. వలంటీరు చెప్పకూడదని ఎవడు చెప్పాడు..?’ అంటూ ఏపీ రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) ప్రశ్నించారు.
శ్రీకాకుళం: ‘ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలో.. దేనికి వేయకూడదో.. వలంటీరు చెప్పకూడదని ఎవడు చెప్పాడు..?’ అంటూ ఏపీ రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) ప్రశ్నించారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) గార మండలం సతివాడలో ధర్మాన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ‘‘వలంటీర్లు (Volunteers) ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలో.. ఏ పార్టీ మంచిదని చెప్పకూడదో అని ఎవడు చెప్పాడు..? ప్రతి పౌరుడికి హక్కు ఉంది. వలంటీర్ కూడా పౌరుడే. మంచి ప్రభుత్వం గురించి ప్రచారం చేసే హక్కు వలంటీర్‌గా ఉంటుంది. మీరు ఉత్తినే భయపడొద్దు. వలంటీరు ఒక కుటుంబాన్ని అయినా మార్చాలి. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వస్తే మొదటి ఫైరింగ్ జరిపేది ఎవరిపైనో తెలుసా? వలంటీర్ పైనే. ఆయనే పేల్చడం ఎందుకు.? మనమే పేల్చేద్దాం. తుపాకీ మన వద్దనే ఉంది’’ అంటూ ధర్మాన పేర్కొన్నారు.
వార్డు వలంటీర్లకు చెక్
అయితే.. ఎన్నికల కోసం వలంటీర్లను విధులకు ఉపయోగించుకోకూడదని స్పష్టంగా ఎన్నికల కమిషనే ఆదేశాలు జారీచేసింది. అయినా వలంటీర్లు ఫలానా రాజకీయ పార్టీకి ఓటు వేసేలా ఇప్పటినుంచే సిద్ధం చేసేలా సాక్షాత్తు మంత్రే ఇలా మాట్లాడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో వార్డు వలంటీర్లను దూరంగా ఉంచాలని గతంలో హైకోర్టు (High Court) ఆదేశించిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం (YCP Govt) ఏర్పాటు చేసిన వలంటర్లీ వ్యవస్థకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కళ్లెం వేసింది. రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి కార్యకలాపాల్లోనూ వలంటీర్లు పాల్గొనకూడదని స్పష్టం చేసింది. వారికి ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తున్న దృష్ట్యా ఎన్నికల కార్యకలాపాల్లో వారికి ప్రమేయం ఉండరాదని, పోలింగ్ ఏజెంట్లుగానూ వారు కూర్చోరాదని ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. ఈ ఆదేశాలను పకడ్బందీగా అమలు చేయాలని రిటర్నింగ్ అధికారులకు, సహాయ రిటర్నింగ్ అధికారులకు జిల్లాల ఎన్నికల అధికారులకు ఉత్తర్వులివ్వాలని ఎన్నికల నిర్దేశించింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ సానుభూతిపరులను, పార్టీ కార్యకర్తలను గ్రామాల్లో, పట్టణాల్లో గ్రామ/వార్డు వలంటీర్లుగా నియమించుకుంది. గ్రామం, పట్టణంలోని ప్రతి 50 ఇళ్లకో వలంటీర్‌ను నియమించింది. వలంటీర్లు వైసీపీ కార్యకర్తలేనంటూ ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy), మంత్రి అంబటి రాంబాబు తదితరులు ఎన్నోసార్లు వ్యాఖ్యానించారు. దీనికితోడు సామాజిక పింఛన్ల పంపిణీ, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను జగన్ సర్కారు వారికే అప్పగించింది. ఒక్కొక్కరికీ ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తోంది. అదే సమయంలో ఏటా అవార్డుల పేరుతో కొంత నగదు కూడా ముట్టజెబుతోంది. వీరి నియామకంపై ప్రారంభం నుంచే ఆరోపణలున్నాయి.
Updated Date - 2023-02-06T19:50:33+05:30 IST