AP News: హోంమంత్రికి ఝలక్ ఇచ్చిన టీడీపీ కార్యకర్త!
ABN, First Publish Date - 2023-10-16T04:02:55+05:30
గడపగడపకు కార్యక్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామానికి చెందిన..
‘గడపగడపకూ’లో మంత్రి వనితకు చేదు అనుభవం
తాళ్ళపూడి, అక్టోబరు 15: గడపగడపకు కార్యక్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామానికి చెందిన.. 80 ఏళ్ల వృద్ధుడు వల్లభని సోమరాజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ సభ్యుడిగా ఉన్నారు. గడపగడపకూ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ఆ గ్రామంలో హోంమంత్రి తానేటి వనిత పర్యటించారు. అందరినీ పలకరించుకుంటూ వస్తూ సోమరాజు ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో వలంటీర్లు, అధికారులు సోమరాజు మెడలో ఉన్న తెలుగుదేశం పార్టీ కండువాను తీసేయమని కోరారు. అయితే దానికి ఆయన నిరాకరించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి సభ్యుడిని... కండువా తీయనని ఖరాకండీగా చెప్పారు. దీంతో మంత్రి సహా అందరూ కంగుతిన్నారు. అనంతరం మంత్రి వనిత.. ఎలా ఉన్నారని సోమరాజును పలకరించగా.. ‘బాగానే ఉన్నా’నన్నారు. పెన్షన్, రైతు భరోసా వస్తుందా.. అని అడగ్గా వస్తోందని తెలిపారు. ఇదే సమయంలో.. ‘మీ నాన్న బాబాజీరావు తొలిసారిగా టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా నామినేషన్ వేసే సమయంలో నేనే సాక్షిగా సంతకం చేశా’నని తెలపడంతో హోంమంత్రి నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
Updated Date - 2023-10-16T12:09:42+05:30 IST