తలుపులమ్మ లోవ కిటకిట
ABN , First Publish Date - 2023-05-15T00:24:10+05:30 IST
తూర్పు కనుమల్లో కొలువుదీరిన తలుపులమ్మ తల్లికి మొక్కుబడులు చెల్లించేందుకు లోవ క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
తుని రూరల్, మే 14: తూర్పు కనుమల్లో కొలువుదీరిన తలుపులమ్మ తల్లికి మొక్కుబడులు చెల్లించేందుకు లోవ క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వేసవి సెలవులు, దీనికి తోడు టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల అవ్వడంతో తల్లికి మొక్కుబడులు చెల్లించేందుకు కుటుంబ సమేతంగా వందలాది కుటుంబాలు వేకువ జామునే లోవకు చేరుకున్నాయి. కిలోమీటర్ల మేర భక్తజన సందోహంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ప్రత్యేక క్యూలైన్‌లలో భక్తులు బారులు తీరారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల అవసరాలకు అనుగుణంగా వసతి గదులు అందుబాటులో లేకపోవడంతో దేవస్థానం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులు, ఆరుబయట మామిడి తోటలు భక్తులకు వసతి కల్పించాయి. తోటల్లో వంటవార్పు చేసుకున్న భక్తులు సహపంక్తి భోజనాలు చేశారు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చలువ పందిళ్ళు, చలివేంద్రాలు ఏర్పాటుతో పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఆలయానికి భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.3,95,822 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో విశ్వనాథరాజు తెలిపారు.