YuvaGalam: మరోసారి లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్.. కారణమిదే
ABN, First Publish Date - 2023-12-04T10:28:10+05:30
YuvaGalam: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మరోసారి బ్రేక్ పడింది. ఈ సారి వర్షాల కారణంగా యువగళం పాదయాత్ర నిలిచిపోయింది. ‘‘మిచాంగ్’’ తుఫాన్ రేపు(మంగళవారం) మధ్యాహ్నం నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది.
కాకినాడ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు (TDP Leader Nara lokesh YuvaGalam) మరోసారి బ్రేక్ పడింది. ఈ సారి వర్షాల కారణంగా యువగళం పాదయాత్ర నిలిచిపోయింది. ‘‘మిచాంగ్’’ తుఫాన్ రేపు(మంగళవారం) మధ్యాహ్నం నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు యువగగళం పాదయాత్రకు లోకేష్ విరామం ఇచ్చారు. రోడ్డు మార్గాన యువనేత అమరావతికి బయలుదేరారు. తిరిగి 6వ తేదీ రాత్రికి పిఠాపురం నియోజకవర్గానికి లోకేష్ రానున్నారు.
ప్రజలారా జాగ్రత్త...
ఈ సందర్భంగా యువగళం పాదయాత్ర క్యాంప్ సైట్ నుంచి లోకేష్ మాట్లాడుతూ.. ముంచుకొస్తోన్న తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమ త్తంగా ఉండాలన్నారు. తుఫాన్ బాధితులకు పార్టీ క్యాడర్.. నేతలకు ఆసరాగా నిలవాలని ఆదేశించారు. మిచాంగ్ తుఫాన్ తీవ్రత దృష్ట్యా యువగళం పాదయాత్రకి విరామం ప్రకటించినట్లు తెలిపారు. విపత్తుల సంస్థ జారీ చేసే హెచ్చరికలు ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు సురక్షిత ప్రదేశాలలో ఉండాలని... ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దన్నారు. అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడేలా మొబైల్ ఫోన్లు చార్జింగ్ ఉంచుకోవాలని చెప్పారు. శిథిల భవనాలలో అస్సలు ఉండొద్దని లోకేష్ పేర్కొన్నారు.
Updated Date - 2023-12-04T10:32:09+05:30 IST