NCBN Arrest : ములాఖత్‌లో చంద్రబాబు ఏం చెప్పారో యనమల మాటల్లో..
ABN, First Publish Date - 2023-09-18T14:45:16+05:30
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు...
తూర్పుగోదావరి/రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుతో.. ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చాయని భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ యనమల వివరించారు. దీంతో పాటు జనసేనతో పొత్తు అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ తరపున సమన్వయ కమిటీ సభ్యుల నియామకం అంశం చంద్రబాబు దృష్టికి యనమల తీసుకెళ్లారు. ‘టీడీపీ యువనేత లోకేశ్ ఢిల్లీ నుంచి రాగానే చర్చించి త్వరగానే సభ్యులను నియమిద్దామని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే తెలుగుదేశం - జనసేన శ్రేణులు దేశవిదేశాల్లో కలిసి కార్యక్రమాలు చేస్తున్న తీరును బాబుకు వివరించాం. తనను జైల్లో పెట్టి జగన్ పొందుతోంది తాత్కాలిక ఆనందమేనని ఇక వైసీపీ పనైపోయిందని చంద్రబాబు అన్నారు’ అని మీడియాకు రామకృష్ణుడు తెలిపారు.
ఇంకా ఏమేం మాట్లాడారు..?
ఎలా ఉన్నారు అంటూ చంద్రబాబుని యనమల అడుగగా...తాను బానే ఉన్నానని, క్యాడర్‌ను, నేతలను ప్రభుత్వం కక్షతో వేధించటమే బాధగా ఉందని బాబు ఆవేదన చెందారన్నారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న తెలుగుదేశం శ్రేణులకు పార్టీ అండగా నిలవాలి. రాష్ట్ర కోసం, ప్రజల కోసం నేను ఎన్ని ఇబ్బందులైనా తట్టుకోగలను. ప్రభుత్వ అరాచకాలపై పోరాటం ఆపొద్దు’ అని యనమలకు టీడీపీ అధినేత సూచించారు. జైల్లో సదుపాయాలు ఎలా ఉన్నాయని చంద్రబాబును యనమల అడుగగా.. ఏసీ లేకపోవడం, విపరీతమైన దోమలు.. ఇలా ఇబ్బందులు ఎన్నున్నా తాను తట్టుకోగలనని చెప్పారన్నారు. పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా సీనియర్లు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు సూచించారని యనమల చెప్పారు. తన అరెస్ట్‌ను ఖండిస్తూ సంఘీభావం తెలిపిన జాతీయ నాయకులందరికీ పేరు పేరునా తాను కృతజ్ఞతలు చెప్పిన సందేశం పంపాలని యనమలకు చంద్రబాబు సూచించారు. ములాఖత్‌తో భువనేశ్వరి, బ్రాహ్మణిలతో దాదాపు 20 నిమిషాలు విడిగా చంద్రబాబు సమావేశమయ్యారు. యనమలతో మాత్రం సుమారు 15 నిమిషాలు విడిగా టీడీపీ అధినేత సమావేశమయ్యారు. ములాఖత్ అనంతరం యనమల మీడియాతో మాట్లాడుతూ.. చర్చకొచ్చిన విషయాలను వివరించారు.
Updated Date - 2023-09-18T15:52:27+05:30 IST