FOREIGN EDUCATION : విదేశీ ‘మిథ్య’
ABN , First Publish Date - 2023-02-04T03:32:55+05:30 IST
జగన్ సర్కారు వచ్చాక గతంలో ఉన్న ఎన్నో పథకాలను నిలిపివేసింది.
గొప్పలు కొండంత.. సాయం గోరంత
విదేశీ విద్యపై జగన్ సర్కారు ఉత్తుత్తి ఆర్భాటం
బాబు హయాంలో 4,923 మందికి సాయం
వైసీపీ ప్రభుత్వం వచ్చాక పథకం నిలిపివేత
తీరిగ్గా మూడున్నరేళ్ల తర్వాత సాయం
అది కూడా 213 మంది విద్యార్థులకే
కఠిన నిబంధనలతో ఎడాపెడా కోతలు
దగా పడ్డ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు
ఒక్క ఎస్టీ విద్యార్థికీ దక్కని విదేశీ విద్య
‘వైసీపీ సర్కారు అంటేనే సంక్షేమం’ అనేలా ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకోవడమే కానీ.. ఆచరణలో మాత్రం అంతంతే. తాజాగా విదేశీ విద్య పథకం అమలు తీరే ఉదాహరణ. చంద్రబాబు హయాంలో మొత్తం 4,923 మంది విద్యార్థులకు సాయం చేశారు. జగన్ సర్కారు వచ్చి మూడున్నరేళ్లు అవుతోంది. ఇప్పటి వరకూ ఎంతమందికి సాయం చేశారంటే... కేవలం 213 మందికే! ఈ మాత్రం దానికి కోట్లు కుమ్మరించి ప్రకటనలు గుప్పించడం.. లేనిపోని గొప్పలు చెప్పుకోవడం.. ‘బటన్’ నొక్కుడు హడావుడి ఎందుకో..?
చంద్రబాబు హయాంలో 1926 మంది బీసీ విద్యార్థులు, 783 మంది ఈబీసీలు, 1196 మంది కాపులు, 491 మంది ఎస్సీ, ఎస్టీలు, 527 మంది మైనారిటీ విద్యార్థులు లబ్ధి పొందారు. జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 35 మంది బీసీలు, 67 మంది ఈబీసీలు, 46 మంది కాపులు, 30 మంది ఎస్సీలు, 35 మంది మైనారిటీ విద్యార్థులకు తాజాగా సాయం చేశారు. ఒక్క ఎస్టీ విద్యార్థికి కూడా సాయం అందకపోవడం గమనార్హం.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జగన్ సర్కారు వచ్చాక గతంలో ఉన్న ఎన్నో పథకాలను నిలిపివేసింది. కొన్నింటిని పూర్తిగా అటకెక్కించింది. మరికొన్నింటిని పేర్లు మార్చి మళ్లీ ప్రారంభించింది. సాధారణంగా ఒక పథకం స్థానంలో కొత్త పథకం తీసుకువచ్చినప్పుడు మరింత ప్రయోజనం కలిగేలా ఉండాలి. కానీ విదేశీ విద్య పథకం విషయంలో వైసీపీ సర్కారు రివర్స్ బాటలో వెళ్లింది. చంద్రబాబు హయాంలో 4923 మంది విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు సాయం చేశారు. 2016 నుంచి రూ.364 కోట్లు ఖర్చు చేశారు. విదేశాల్లో ఏ యూనివర్సిటీలో సీట్లు తెచ్చుకున్నా విదేశీ విద్య అమలు చేశారు. దీనివల్ల బడుగు, బలహీన వర్గాల వారు లబ్ధిపొందారు. జగన్ సర్కారు వచ్చాక ఈ పథకాన్ని మూడేళ్ల పాటు గాలికొదిలేసింది. దీంతో ఎంతోమంది పేద విద్యార్థులు విదేశీ విద్యకు నోచుకోలేకపోయారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుతో పథకం అమలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఈ పథకం విద్యార్థులకు ఉపయోగపడలేదని, అందుకే తాము కొత్త మార్గదర్శకాలు తెచ్చామని సీఎస్ ఇచ్చిన ఉత్తర్వుల్లోనే పేర్కొన్నారు. అయితే తాపీగా 213 మంది విద్యార్థులకు మాత్రమే ఈ పథకం మంజూరు చేశారు. కఠిన నిబంధనలు పెట్టడంతో చాలా మంది విద్యార్థులు విదేశీ విద్యకు దూరమయ్యారు. 200 క్యూఎస్ ర్యాంకింగ్స్ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని మార్గదర్శకాలు రూపొందించడమే దీనికి కారణం. చంద్రబాబు అమలు చేసిన విదేశీ విద్య బాగా లేదని చెప్పిన జగన్.. ఇప్పుడు అతి కొద్దిమందికి సాయం చేసి చేతులు దులుపుకొన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు దగా
జగన్ తెచ్చిన క్యూఎస్ ర్యాంకింగ్ నిబంధనతో ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులకు మొండిచేయి చూపారు. ఎస్సీ విద్యార్థులకు 17 మందికి ఇచ్చి, మరో 13 మందికి ఇస్తామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఆఖరి సంవత్సరంలోనే 300 మంది ఎస్సీ విద్యార్థులకు విదేశీ విద్య కోసం సాయం చేసింది. ఈ ప్రభుత్వం ఇప్పుడు కేవలం 30 మందికి ఇస్తున్నట్లు చెప్తోంది. అంటే అప్పట్లో లబ్ధిపొందిన విద్యార్థులతో పోలిస్తే 10 శాతం మాత్రమే. ఇక ఎస్టీ విద్యార్థుల విషయానికొస్తే ఒక్కరు కూడా అర్హత సాధించలేదు. అంటే ఒక్క ఎస్టీ విద్యార్థికి కూడా జగన్ ప్రభుత్వం విదేశీ విద్య ప్రయోజనం కల్పించడం లేదు. గత జూలైలో జగన్ సర్కార్ ఈ పథకం ప్రారంభించినపుడే ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించింది. జగన్ ప్రభుత్వం ఇచ్చిన విదేశీ విద్య నూతన మార్గదర్శకాలతో ఎస్సీ, ఎస్టీలు నష్టపోతారని అప్పట్లోనే హెచ్చరించింది. ఇప్పుడు అదే నిజమైంది. శుక్రవారం జగన్ ‘బటన్’ నొక్కారు. ఈ జాబితాలో ఒక్కరు కూడా ఎస్టీ విద్యార్థి లేకపోగా, 30 మంది ఎస్సీ విద్యార్థులు మాత్రమే లబ్ధి పొందారు. విద్యార్థులకు మొత్తం 19 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించగా, ఒక్కరికీ మెసేజ్ రాలేదు. అయితే ముఖ్యమంత్రి సొంత పత్రికతో పాటు మీడియా ప్రకటనల కోసం 2 కోట్లు ఖర్చు పెట్టారు.
బకాయిల ఊసేదీ?
గత ప్రభుత్వంలో విదేశీ విద్య పథకాన్ని సరిగా అమలు చేయలేదంటూ 2016-17 సంవత్సరానికి సంబంధించి రూ.318 కోట్లు చెల్లించలేదని వైసీపీ సర్కారు పేర్కొంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపైనే ఉంది. ఆ విషయాన్ని విస్మరించి స్వయానా సీఎస్ ఇచ్చిన ఉత్తర్వుల్లోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పలు విమర్శలకు తావిచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం పరిమితిని గత ప్రభుత్వంలో పాటించలేదని సీఎస్ పేర్కొన్నారు. నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే పట్టించుకోకుండా మూడేళ్ల పాటు కాలం గడిపారు. తమ నిస్సహాయతను తాపీగా ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.
కఠిన నిబంధనలతో కత్తెర
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ సైతం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్య కోసం ఇచ్చే స్కాలర్‌షిప్పుల కోసం 500 క్యూసీ ర్యాంకింగ్స్ వర్సిటీలను అర్హతగా నిర్ణయించింది. జగన్ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వుల్లో మాత్రం 200 క్యూసీ ర్యాంకింగ్స్ వర్సిటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పింది. ఆ స్థాయి ర్యాంకింగ్ యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించుకునే విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్‌షిప్పులు అందించాల్సిన అవసరమే ఉండదు. పలు కార్పొరేట్ సంస్థలు, యూనివర్సిటీలే స్కాలర్‌షిప్పును అందిస్తాయి. గ్రామీణ విద్యార్థులు సీట్లు సంపాదించే విదేశీ యూనివర్సిటీలేవీ జగనన్న విద్యాదీవెన పథకం కిందకు వచ్చే పరిస్థితి లేదని పలువురు విమర్శిస్తున్నారు.
ఫీజు కూడా సగమే
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి చాలా తక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించగా... వారికి కూడా పూరి ్తగా ఫీజు చెల్లించడం లేదు. 100 లోపు క్యూఎస్ ర్యాంకింగ్స్ వర్సిటీల్లో సాధించిన విద్యార్థుల సంఖ్య వేళ్ల మీదనే లెక్కపెట్టవచ్చు. వారికి ఎంత ఫీజు ఉన్నా రూ.50 లక్షలకు మించి ప్రభుత్వం చెల్లించదు. మిగతా 100-200 ర్యాంకింగ్స్ యూ నివర్సిటీల్లో ఫీజులు తక్కువగానే ఉన్నాయి. అందులోనూ 50 శాతం ఫీజు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. అమెరికా మి నహాయిస్తే యూరప్ దేశాల్లో ఫీజులు తక్కువగా ఉన్నాయి. జగన్ ప్రభుత్వం ఎంపిక చేసిన 213 మంది విద్యార్థుల్లో సుమారు 200 మంది 100 ర్యాంక్ పైన వర్సిటీల్లో సీట్లు పొందినవారే. ఆయా యూనివర్సిటీల్లో ఫీజు రూ.10 లక్షలు ఉంటే ప్రభుత్వం రూ.5 లక్షలు మాత్రమే అందిస్తోంది. అదే చంద్రబాబు ప్రభుత్వంలో విద్యార్థులకు ఫీజు మొత్తం లేదా రూ.10 లక్షలు అందేవి. జగన్ తెచ్చిన తాజా మార్గదర్శకాల్లో ఎంత ఫీజు ఉన్నా 50 శాతం మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. ఫీజుల విషయంలో కూడా పేద విద్యార్థులకు అరకొర సాయం చేస్తోంది.
గత ప్రభుత్వంలో అందరికీ లబ్ధి
సాధారణంగా మన విద్యార్థులు విదేశీ చదువుల కోసం వెళ్లే కొన్ని దేశాలను గత ప్రభుత్వం గుర్తించి ఆయా యూనివర్సిటీల్లో సీట్లు పొందిన విద్యార్థులందరికీ ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కింద ప్రయోజనం కల్పించింది. ప్రతి విద్యార్థికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా స్కాలర్‌షిప్పు అందింది. విదేశాల్లో సీట్లు పొందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరూ విదేశీ విద్య ప్రయోజనం పొందారు.