Nara Lokesh: సంబంధం లేనివి 49.. అసలైనది ఒకటే!
ABN, First Publish Date - 2023-10-11T03:22:13+05:30
రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) కేసులో విచారణకు పిలిచిన సీఐడీ అధికారులు దానికి సంబంధించిన ప్రశ్న ఒకటి మాత్రమే అడిగారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తెలిపారు.
సంబంధం లేనివి 49
సీఐడీ విచారణ తీరుపై లోకేశ్ వ్యాఖ్య
ఎలైన్‌మెంట్‌పై ఒక్క ఆధారమూ చూపలేదు
టీడీపీ, ప్రభుత్వం, హెరిటేజ్‌లో
ఏయే పదవుల్లో పనిచేశానో అడిగారు
ఇవి గూగుల్‌లో కూడా తెలుసుకోవచ్చు
తప్పు చేయనప్పుడు భయపడను
దేనికైనా జవాబివ్వడానికి రెడీ
మళ్లీ నేడు రమ్మన్నారు.. 2 గంటలైనా ఉంటా
ఇప్పుడే అడగాలన్నా.. కానీ మళ్లీ నోటీసిచ్చారు
నేడు మళ్లీ సీఐడీ ముందు హాజరవుతా: లోకేశ్
అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) కేసులో విచారణకు పిలిచిన సీఐడీ అధికారులు దానికి సంబంధించిన ప్రశ్న ఒకటి మాత్రమే అడిగారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తెలిపారు. మంగళవారం తాడేపల్లి సమీపాన కుంచనపల్లిలోని సిట్ కార్యాలయంలో సీఐడీ అధికారుల ఎదుట విచారణకు ఆయన హాజరయ్యారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకూ సుమారు ఆరున్నర గంటలపాటు ఆయన్ను ప్రశ్నించారు. ఈ కేసులో ఆయన్ను 14వ నిందితుడిగా చేర్చిన సీఐడీ అధికారులు.. సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇచ్చి విచారణకు హాజరు కావాలని కొన్నిరోజుల క్రితం లోకేశ్‌ను కోరారు. తన న్యాయవాది గింజుపల్లి సుబ్బారావుతో కలిసి మంగళవారం సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. విచారణ తర్వాత సిట్ కార్యాలయం వద్ద లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ‘నన్ను 50 ప్రశ్నలు అడిగారు. ఇందులో ఒకటి మాత్రమే ఇన్నర్ రింగ్‌రోడ్డుకు సంబంధించింది. మిగిలిన 49 సంబంధం లేనివి. నేను టీడీపీలో, హెరిటేజ్ కంపెనీలో, ప్రభుత్వంలో నిర్వహించిన పదవుల గురించి అడిగారు. ఈ వివరాలన్నీ గూగుల్‌లో కనిపించేవే. మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో ఐఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్ గురించి వచ్చిందా అని అడిగారు. రాలేదని చెప్పాను. ఇంకా అడగాల్సినవి ఉన్నాయన్నారు. ఈ రోజు గంటైనా.. రెండు గంటలైనా ఉండి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానన్నాను. కానీ రేపు రావాలని కోరారు. వేరే పని ఉందని చెప్పినా రేపే రావాలంటూ మళ్లీ 41ఏనోటీసు ఇచ్చారు. రేపు మళ్లీ ఉదయం 10గంటలకు సీఐడీ అధికారుల ముందు హాజరవుతున్నాను’ అని తెలిపారు. తమకు సహకరించినందుకు విచారణాధికారి ధన్యవాదాలు తెలిపారని వ్యాఖ్యానించారు. సీఐడీ వద్ద ఏ స్టేట్‌మెంట్ మీదా సంతకాలు చేయలేదన్నారు.
ఏ ఆధారాలూ చూపించలేదు..
ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ ఉద్దేశపూర్వకంగా మార్చారని కేసు పెట్టిన సీఐడీ అధికారులు.. అందులో తన పాత్రకు సంబంధించిన ఏ ఆధారాన్నీ చూపించలేదని లోకేశ్ చెప్పారు. ‘పోలవరం ప్రాజెక్టు నాశనం, అమరావతి విధ్వంసం, నిరుద్యోగులకు ఉద్యోగావకాశా లు లేకుండా చేయడం, ప్రశ్నించిన ప్రజలపై దొంగ కేసులు పెట్టడంపై నిలదీసినందుకు చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారు. ఈ కేసులు లేకపోతే పాదయాత్రలో ఉండేవాడిని. కేసులతో తాత్కాలికంగా ఆపగలిగారు. మాజీ సీఎం అయిన చంద్రబాబుపై కేసు పెట్టే ముందు గవర్నర్ నుంచి అనుమతి తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేదు? దొంగ కేసులు కాబట్టే తీసుకోలేదు. అక్రమ అరెస్టును నిరసిస్తూ చిన్న కొవ్వొత్తుల ప్రదర్శన చేసినా.. చివరకు సెల్ ఫోన్లో లైటు వెలిగించినా కేసులు పెట్టే దుస్థితికి ప్రభుత్వం దిగజారింది. నా మీద ఇప్పటికి 23 కేసులు పెట్టారు. 2019కు ముందు నాపై ఒక్కటీ లేదు. ఇప్పుడు ఇన్ని కేసులు పెట్టారంటే దీనర్థం ఏమిటి? భయం కాదా? నన్ను అరెస్టు చేస్తారని... బ్రాహ్మణిని, భువనేశ్వరిని కూడా అరెస్టు చేస్తామని కొందరు మంత్రులు ప్రకటనలు ఇచ్చారు. ఈ నెల రోజులూ ఎన్నో తమాషాలు చేశారు. అన్నిటికీ బదులు చెప్పే సమయం వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టుతో తనకు సంబంధం లేదని, ఆ సమయంలో తాను లండన్‌లో ఉన్నానని సీఎం జగన్ చేసి న వ్యాఖ్యను ప్రస్తావించినప్పుడు లోకేశ్ తీవ్రంగా స్పం దించారు. ‘సీఐడీ, ఏసీబీ ఎవరి కింద పనిచేస్తాయి? అవి రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు కావా? ముఖ్యమంత్రికి తెలియకుండానే అవి చంద్రబాబు మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తాయా? ముఖ్యమంత్రికి ఏ వ్యవస్థ ఏ పని చేస్తుందో తెలియకపోతే డీజీపీ దగ్గర పాఠాలు నేర్చుకుంటే మంచిది’ అని వ్యాఖ్యానించారు. ‘ఒక డాక్టర్ మాస్క్ అడిగాడని వేధించి సర్వీసు నుంచి బర్తరఫ్ చేశారు. సీఎం ఇంటికి 2కిమీ దూరంలో గ్యాంగ్ రేప్ జరిగింది. బంగారు పాలన గురించి మాట్లాడేముందు వీటికి సమాధానం చెప్పమనండి. అరగంట.. గంట మంత్రులు అడిగేవాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’ అని దుయ్యబట్టారు.
ఆ మూడు చానళ్లలో లీకులు ఎలా వచ్చాయి?
తాను ఢిల్లీలో సీఐడీ అధికారులకు దొరకడం లేదని, పరారీలో ఉన్నానని జగన్ టీవీ, టీవీ9, ఎన్‌టీవీలో లీకులు ఎలా వచ్చాయని సీఐడీ అధికారులను ప్రశ్నించానని లోకేశ్ చెప్పారు. తాను ఢిల్లీలో అశోకా రోడ్‌లో పార్టీ సమావేశాలు నిర్వహించుకుంటూ అక్కడే ఉంటే ఇటువంటి లీకులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అడిగానని.. ఎలా వచ్చాయో తమకు తెలియదని, తమకు సంబంధం లేదని వాళ్లు చెప్పారని వెల్లడించారు. ‘ఈ లీకులు ఆ టీవీలు సొంతంగా ఇచ్చా యో, సీఐడీ అధికారులు ఇచ్చారో భవిష్యత్‌లో అన్నీ తెలుస్తాయి. మేం తేలుస్తాం’ అని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఈ మూడు టీవీల లోగోలను తీసి పక్కన పెట్టిన లోకేశ్.. ఆ చానళ్ల ప్రతినిధులు తప్ప మరెవరైనా ప్రశ్నలు అడగవచ్చని తొలుత చెప్పా రు. చివర్లో ఈ మూడు చానళ్ల వాళ్లు ఏమైనా అడగాలా అని ప్రత్యేకంగా అడిగినా వారు స్పందించలేదు.
కక్ష సాధింపుతో మాపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. మేం జనంలోకి వెళ్లకుండా నిరోధించడానికి వీటిని వాడుకుంటున్నారు.
ఈ సీఎంకు టీడీపీని చూసినా.. పసుపు రంగును చూసినా ఎక్కడా లేని భయం! చంద్రబాబు జైల్లో ఉన్నా పార్టీ కార్యకలాపా లేవీ ఆగలేదు. సమష్టిగా నిర్ణయాలు తీసుకుని పనిచేస్తున్నాం.
- లోకేశ్
Updated Date - 2023-10-11T11:09:09+05:30 IST