CM Jagan: ఇది మీ ప్రభుత్వం.. మీ బిడ్డ ప్రభుత్వం
ABN, First Publish Date - 2023-05-16T11:56:21+05:30
‘‘గత ప్రభుత్వ పాలనకు మనందరి ప్రభుత్వ పాలనకు తేడా గమనించాలి. ఇది మీ ప్రభుత్వం.. మీ బిడ్డ ప్రభుత్వం’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
బాపట్ల: ‘‘గత ప్రభుత్వ పాలనకు మనందరి ప్రభుత్వ పాలనకు తేడా గమనించాలి. ఇది మీ ప్రభుత్వం.. మీ బిడ్డ ప్రభుత్వం’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) అన్నారు. మంగళవారం నిజాంపట్నం మత్స్యకార భరోసా సభలో సీఎం మాట్లాడుతూ... ఐదేళ్లలో ప్రతీ మత్స్యకారునికి రూ.50 వేలు ఇచ్చామన్నారు. వేట నిషేధం వల్ల వారు నష్టపోకూడదని ఏటా పది వేలు ఇచ్చి ఆదుకుంటున్నామని తెలిపారు. రూ. 123 కోట్లు బటన్ నొక్కి విడుదల చేశామన్నారు. ఇప్పటి వరకూ రూ.523 కోట్లు మత్స్యకార భరోసా కింద ఇచ్చామని చెప్పారు. గతంలో చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు అరకొరగా సాయం అందేదని... అది కూడా ఆలస్యంగా ఇచ్చేవారన్నారు. కేవలం రూ.4 వేలు మాత్రమే ముష్టి వేసినట్లు ఇచ్చేవారని మండిపడ్డారు. చంద్రబాబు ఐదేళ్లలో మత్స్యకారులకు చేసిన సాయం రూ.104 కోట్లు మాత్రమే అని... వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏడాదిలోనే రూ.123 కోట్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. డీజిల్ మీద రాయితీ సరిగా అందేది కాదన్నారు. ఇప్పుడు రూ.20 వేల బోట్లకు రాయితీ డీజిల్ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.5 లక్షల పరిహారాన్ని మృతదేహం కనిపిస్తేనే ఇచ్చేవారని... ఇప్పుడు మాత్రం పరిహారం రూ.10 లక్షలు వెంటనే ఇస్తున్నామని తెలిపారు.
నాలుగు ప్రపంచ స్థాయి నౌకాశ్రయాలు నిర్మాణం..
ఓఎన్జీసీ డ్రిల్లింగ్ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.128 కోట్లు విడుదల చేశామన్నారు. ఒక్కో మత్య్యకార కుటుంబానికి రూ.46 వేలు మంజూరు చేశామన్నారు. రాష్ట్రానికి అత్యధిక తీర ప్రాంతం ఉన్నా మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని అన్నారు. నిజాం పట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వేగంగా జరుగుతోందని... ఇది చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగం అని వెల్లడించారు. రాష్ట్రంలో రూ.1600 కోట్లతో నాలుగు ప్రపంచ స్థాయి నౌకాశ్రయాలు నిర్మాణం జరుగుతోందన్నారు. పది ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ లాండింగ్ కేంద్రాల నిర్మాణం రూ. 3600 కోట్లతో వేగంగా జరుగుతోందని చెప్పారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేలా ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిజాంపట్నం మండలం దిండి గ్రామంలో 280 ఎకరాలలో రూ.185 కోట్లతో ఆక్వా పార్క్ ఏర్పాటు కానుందన్నారు. ఆక్వా పార్క్ ఏర్పాటు ద్వారా నాణ్యమైన ఆక్వా సీడ్ దొరుకుతుందని, 11 వేల మంది అక్వా రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. అలాగే 21 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుందన్నారు. రూ.417 కోట్ల రూపాయలతో వాడరేవు ఫిషింగ్ హార్బర్‌కు శంకుస్థాపన చేశామని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-05-16T11:56:21+05:30 IST