Chandrababu Tour: పదే పదే చంద్రబాబు పర్యటనకు అడ్డంకులు.. ఇప్పుడు తాజాగా
ABN, First Publish Date - 2023-04-26T10:14:37+05:30
రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడ పర్యటిస్తున్నా వైసీపీ సర్కార్ అనేక అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది.
పల్నాడు: రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Leader Chandrababu Naidu) ఎక్కడ పర్యటిస్తున్నా వైసీపీ సర్కార్ (YCP Government) అనేక అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. ఇటీవల ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఎంతటి విధ్వంసానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా పల్నాడులోనూ చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లాలో చంద్రబాబు పర్యటనలో భాగంగా సత్తెనపల్లిలోని శరభయ హైస్కూల్ గ్రాండ్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకు టీడీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బహిరంగ సభ ప్రాంగణంలో విద్యుత్ ప్రభ ఏర్పాటుకు టీడీపీ సన్నాహాలు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. సభకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో ప్రభ ఏర్పాట్లను నిలిపివేసి కార్మికులు వెనక్కి వెలుతున్నారు. బాబు పర్యటన నేపథ్యంలో సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ముందు అనుమతి ఇచ్చి ఆ తర్వాత పోలీసులు ఆంక్షలు పెట్టారు. పోలీసుల అనుమతితో ఇప్పటికే రోడ్డుకు ఇరువైపులా ఫ్లేక్సీలు ఏర్పాటుకు టీడీపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అనుమతి లేదంటూ పోలీసులు ఏర్పాట్లను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం రెండో రోజు పర్యటన వివరాలు...
మరోవైపు పల్నాడు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు ధరణికోటలో ముస్లిం సోదరులతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం ధరణికోట నుంచి సత్తెనపల్లి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం సత్తెనపల్లిలో చంద్రబాబు రోడ్ షో జరుగనుంది. ఇదేం కర్మ మన రాష్ట్రానికి పేరుతో సత్తెనపల్లిలో భారీ బహిరంగ సభలో పాల్గంటారు. ఈరోజు సత్తనపల్లిలోనే చంద్రబాబు బస చేయనున్నారు. అయితే సత్తెనపల్లిలో బహిరంగ సభకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్న తరుణంలో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.
Updated Date - 2023-04-26T10:14:54+05:30 IST