AP News: సత్తెనపల్లిలో కండెక్టర్ నిర్వాకం.. తొందరగా బస్సు దిగలేదని వృద్ధురాలిని...
ABN, First Publish Date - 2023-03-04T12:52:40+05:30
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అంటూ ఆర్టీసీ అధికారులు ప్రచారం చేస్తుంటారు.
పల్నాడు: ఆర్టీసీ బస్సు (RTC Bus)లో ప్రయాణం సురక్షితం అంటూ ఆర్టీసీ అధికారులు ప్రచారం చేస్తుంటారు. ప్రయాణికులే మాకు దేవుళ్లు అని అంటూ ఉంటారు. అయితే కొందరు డ్రైవర్లు, కండక్టర్లు మాత్రం ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తొందర చేస్తుంటారు. ఈ క్రమంలో పలువురు గాయాలపాలైన సంఘటనలు ఉన్నాయి. అందులోనూ వృద్ధుల పట్ల మరీ విపరీత ధోరణిలో ప్రవర్తిస్తుంటారు. వృద్ధుల విషయంలో నిదానంగా ప్రవర్తించాల్సింది పోయి అమానుషంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే పల్నాడు జిల్లా (Palnadu District) లో చోటు చేసుకుంది. సత్తెనపల్లిలో ఓ వృద్ధురాలి పట్ల ఆర్టీసీ బస్సు కండక్టర్ అమానుషంగా ప్రవర్తించాడు. వృద్ధురాలు బస్సు దిగే సమయంలో ఆమె పట్ల కండెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. త్వరగా బస్సు దిగాలంటూ వృద్ధురాలిని ఇబ్బంది పెట్టాడు. చివరకు తొందరగా దిగాలంటూ వృద్ధురాలిని బస్సు నుంచి తోసేశాడు. దీంతో సదరు వృద్ధురాలు హఠాత్తుగా కిందపడిపోయింది. ఆమెను కనీసం పట్టించుకోకుండా బస్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది. కిందపడిన వృద్ధురాలికి గాయాలవడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కండెక్టర్ తీరు పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-03-04T12:53:33+05:30 IST