ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jagan Govt: నిరుద్యోగికి దగా

ABN, First Publish Date - 2023-08-16T02:34:11+05:30

జగన్‌ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఒక్కఏడాది కూడా జనవరి 1న ఒక్క జాబ్‌ క్యాలెండర్‌(Job Calendar) కూడా విడుదల చేయలేదు.

మెగా కాదు.. సాధారణ డీఎస్సీ కూడా లేదు!

నాలుగేళ్లలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ఒక్కటీ లేదు

అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ అని హామీ

జగన్‌ను నమ్మి నిండా మునిగిన నిరుద్యోగులు

వెయ్యి పోస్టుల భర్తీ అంటూ ఉత్తుత్తి ప్రకటనలు

నాలుగేళ్లుగా అవకాశాలెన్నో కోల్పోయిన వైనం

ఎప్పటికైనా ఇస్తారన్న ఆశతో కోచింగ్‌లకు వేల ఖర్చు

వలంటీర్లే ఉద్యోగులన్నట్లు సర్కారు డబ్బా ప్రచారం

డీఎస్సీపై మాటలకే పరిమితమైన విద్యా మంత్రి

‘‘మీ అందరి చల్లని దీవెనలు, ఆ దేవుడి దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొట్టమొదటగా నేను చేయబోయేది ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాను. అంతేకాదు ప్రతి ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం’’ ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ ఇచ్చిన హామీ ఇది. అయితే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్నట్లు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా జగన్‌కు ఇచ్చిన హామీలు గుర్తుకురావడంలేదు!. ముఖ్యంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్‌-2, డీఎస్సీ ఉద్యోగాల ఊసే లేదు!

(అమరావతి-ఆంధ్రజ్యోతి): జగన్‌ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఒక్కఏడాది కూడా జనవరి 1న ఒక్క జాబ్‌ క్యాలెండర్‌(Job Calendar) కూడా విడుదల చేయలేదు. నోటిఫికేషన్లు ఇవ్వకపోగా అదిగో గ్రూప్‌-2, ఇదిగో డీఎస్సీ అంటూ నమ్మబలుకుతూ నిరుద్యోగులను మరో ఉద్యోగం కూడా చూసుకోనివ్వడం లేదు. దీంతో జగన్‌ హామీలను నమ్మి ఇంతకాలం కోచింగ్‌లు తీసుకున్న నిరుద్యోగులు ఎటూ కాకుండా నిండా మునిగామని ఇప్పుడు బాధపడుతున్నారు. అనవసరంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం నాలుగేళ్లు వృథా చేసుకున్నామని, ఇప్పుడు మళ్లీ ప్రైవేటు ఉద్యోగానికి వెళ్లే పరిస్థితి లేదని, తమ గతేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం(Jagan Govt) అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలు భర్తీ చేశారు. కానీ ఇప్పటికీ ఆ ఉద్యోగాలు ఏ గ్రూపులో ఉంటాయి? పదోన్నతి చానల్‌ ఏంటి? అనేదానిపై స్పష్టత లేదు. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం అనుకుని నిరుద్యోగులు వాటిలో చేరారు. అనంతరం వీటిలో ఎదుగుదల లేదని తెలిసి చాలామంది వాటిని వదిలేసి ప్రైవేటు ఉద్యోగాలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత రెండున్నర లక్షల వలంటీర్లను ప్రభుత్వం నియమించింది. వారికి రూ.5వేల గౌరవ వేతనం ఇస్తోంది. అవి ఉద్యోగాలు కాకపోయినా, కనీసం దినసరి కూలీ స్థాయిలో వేతనం లేకపోయినా వాటిని కూడా ఉద్యోగాలే అన్నట్టుగా ప్రభుత్వం ప్రచారం చేసింది. అసలు ఉద్యోగాలను పక్కనపెట్టి సచివాలయాలు, వలంటీర్లు అంటూ మభ్యపెడుతూ వచ్చింది. కనీసం నాలుగో సంవత్సరంలో అయినా గ్రూప్‌-2, డీఎస్సీ నోటిఫికేషన్లు (Group-II, DSC Notifications)ఇస్తారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన కేబినెట్‌ సమావేశంలో వెయ్యి గ్రూప్‌-2 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఆమోదం లభించింది.


ఆ వెంటనే నోటిఫికేషన్‌ అంటూ హడావుడి చేసిన ప్రభుత్వం ఆ తర్వాత దానిని పక్కన పడేసింది. చివరిసారిగా గత టీడీపీ ప్రభుత్వంలో 2018లో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదలైంది. అప్పట్లోఇచ్చిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను ఈ ప్రభుత్వం గతేడాది పూర్తిచేసింది. ఆ తర్వాత ఇటీవల గ్రూప్‌-1లో మరో 111 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఎందుకోగానీ అసలు గ్రూప్‌-2 అనేది ఒకటుందా? అన్నట్టుగా పెద్దసంఖ్యలో ఇవ్వాల్సిన పోస్టులను పూర్తిగా గాలికొదిలేసింది. దేవదాయశాఖలో ఈవో పోస్టులు, రెవెన్యూలో కింది స్థాయి ఉద్యోగాలు, వైద్య ఆరోగ్యశాఖలో నాలుగోతరగతి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి కాలం వెళ్లదీస్తోంది. కాగా గ్రూప్‌-1లో 140 పోస్టులు, గ్రూప్‌-2లో 1082 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో గుర్తించింది. ఇందులో ఎక్సైజ్‌ ఎస్‌ఐ పోస్టులు 150, డిప్యూటీ తహసీల్దాదారు పోస్టులు 42, గ్రామీణాభివృద్ధిలో విస్తరణాధికారి పోస్టులు 135, సీనియర్‌ ఆడిటర్‌ పోస్టులు 56, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు 161 పోస్టులున్నాయి.

10 లక్షల మంది నిరుద్యోగులు

రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 10లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు అంచనా. ఒకప్పుడు సాధారణ డిగ్రీ చదివినవారు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్‌ చదివినవారే ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నారు. బీటెక్‌లోనూ కంప్యూటర్‌ సైన్స్‌ లాంటి కోర్సులు చేసినా ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంతో కోచింగ్‌లు తీసుకుని పడిగాపులు కాస్తున్నారు. ఐదేళ్లుగా నోటిఫికేషన్లు లేకపోవడంతో మధ్యలో వేరే ఉద్యోగాలకు వెళ్లిపోవాలని భావించినా ప్రభుత్వ ప్రకటనలు ఆశలు రేపాయి. పైగా గ్రూప్‌-2కు సిలబస్‌ మార్చడంతో మళ్లీ కోచింగ్‌ సెంటర్లకు వెళ్తున్నారు. నెలకు కనీసం రూ.8వేలకు పైగా ఆర్థిక భారం పడుతోందని, ఏదొక రోజు నోటిఫికేషన్లు వస్తాయన్న ఆశతో ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డీఎస్సీపై మారిన మాట

డీఎస్సీ విషయంలో ప్రభుత్వం నిరుద్యోగులను మరీ దారుణంగా మోసం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 23వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేసి వాటిని భర్తీ చేస్తామని ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ కాకపోయినా సాధారణ డీఎస్సీ కూడా వేయలేదు. 1998, 2008 నోటిఫికేషన్లలో ఎంపికైన వారిని మినిమం టైమ్‌ స్కేలు ప్రాతిపదికన ఉద్యోగాల్లోకి తీసుకున్నారే తప్ప ఈ ప్రభుత్వం ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదు. పైగా అప్పట్లో 23వేల ఖాళీలు అని ప్రకటించి, పోస్టులు భర్తీ చేయకుండానే లెక్కల్లో మాయచేసి చివరికి 1100 పోస్టులే ఖాళీగా మిగిలాయని తేల్చారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తరచూ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. మాటలు తప్ప నోటిఫికేషన్‌ మాత్రం బయటకు రావట్లేదు.

Updated Date - 2023-08-16T04:36:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising