AP News: గర్భిణి ఆవేదన.. ప్రసవం కోసం 70 కి.మీ.. డబ్బు తెస్తానంటూ వెళ్లిన భర్త చివరకు..
ABN, First Publish Date - 2023-10-21T11:37:09+05:30
ఓ గర్భిణి ప్రసవం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ప్రసవం కోసం దాదాపు 70 కిలోమీటర్ల వరకు వెళ్లడమే కాకుండా మూడు ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. చివరకు ప్రసవం జరిగిన సమయానికి భర్తకు సంబంధించిన వార్త తెలిసి మహిళ ఆవేదన వర్ణణాతీతం.
పల్నాడు: ఓ గర్భిణి ప్రసవం కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ప్రసవం కోసం దాదాపు 70 కిలోమీటర్ల వరకు వెళ్లడమే కాకుండా మూడు ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. చివరకు ప్రసవం జరిగిన సమయానికి భర్తకు సంబంధించిన వార్త తెలిసిన మహిళ ఆవేదన వర్ణణాతీతం.
పల్నాడు జిల్లా కారంపూడిలో విషాదం చోటు చేసుకుంది. రామాంజిని అనే మహిళకు పురిటినొప్పులు రావడంతో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కుటుంబసభ్యులు కారంపూడి ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గురజాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా కాన్పు చేయకపోవడంతో చివరకు 70 కిలోమీటర్లు దాడి నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రసవానికి వైద్యులు ఏర్పాటు చేస్తుండగా.. భర్త ఆనంద్ ఇంటికి వెళ్లి డబ్బులు తెస్తానంటూ కారంపూడికి బయలుదేరారు. ఇంతలోనే కారంపూడి నుంచి డబ్బులు తీసుకుని వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గుంతల రోడ్డులో బైక్‌పై నుంచి పడి భర్త ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. రామాంజిని పాపను ప్రసవించే సమయానికి నరసరావుపేట ఆసుపత్రికి భర్త మృతదేహం వచ్చి చేరింది. దీంతో ఆ మహిళకు పాప పుట్టిందన్న సంతోషం ఎక్కవ సేపు నిలవలేదు. భర్త మరణవార్త తెలిసి రామాంజిని కన్నీరుమున్నీరుగా విలపించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవం కూడా చేయలేని పరిస్థితిపై మహిళ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రసవం కోసం 70 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితిపై ఆవేదన చెందారు. ఈ ఘటన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సొంత జిల్లాలో జరగడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Updated Date - 2023-10-21T11:40:52+05:30 IST