పార్టీ కోసం పొలం అమ్మాను..

ABN , First Publish Date - 2023-01-25T00:27:50+05:30 IST

వైసీపీ కోసం రెండెకరాల పొలం అమ్ముకొని .... ఈ రోజు సర్పంచ్‌ జీతం కోసం మండల పరిషత్‌ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరిగే ఖర్మ పట్టిందని మండలంలోని దైద సర్పంచ్‌ లావూరి లక్ష్మమ్మబాయి ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ కోసం పొలం అమ్మాను..
సర్పంచ్‌ లక్ష్మమ్మబాయి

గురజాలటౌన్‌, జనవరి24: వైసీపీ కోసం రెండెకరాల పొలం అమ్ముకొని .... ఈ రోజు సర్పంచ్‌ జీతం కోసం మండల పరిషత్‌ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరిగే ఖర్మ పట్టిందని మండలంలోని దైద సర్పంచ్‌ లావూరి లక్ష్మమ్మబాయి ఆవేదన వ్యక్తం చేశారు. జీతం కోసం మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయానికి వచ్చిన ఆమె ఆంధ్రజ్యోతి వద్ద తన గోడును వెళ్లబోసుకున్నారు. తాను, తన భర్త చాప్లానాయక్‌ వైసీపీ కోసం ఎంతో శ్రమించామన్నారు.. తన భర్త కరోనాతో మృతి చెందారని తెలిపారు. తన భర్త మరణానంతరం స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి కనీసంగా పరామర్శించేందుకు కూడా రాలేదని కన్నీరు పెట్టుకుంది. తాము గిరిజనులు కావడం వలన చిన్నచూపు చూస్తున్నారని, మండలంలోని ఓ పెద్ద సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకుడు తనకు రావాల్సిన జీతం కూడా రానివ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఏడాది నుంచి జీతం అందించకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారన్నారు. పంచాయతీ కార్యదర్శిని అడిగితే గురజాల మండల పరిషత్‌ కార్యాలయానికి రమ్మంటున్నారు.. గురజాలకు వస్తే దైదలో చూస్తారంటూ చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భర్తను కోల్పోయి కుటుంబం జరగక తీవ్ర ఇబ్బందికి గురవుతున్నామని, జీతం ఇప్పించాలని సర్పంచ్‌ లక్ష్మమ్మబాయి వేడుకున్నారు.

Updated Date - 2023-01-25T00:27:52+05:30 IST