IAS: సీఎం ఓఎస్డీతో సీఎస్ ప్రయాణం అవాస్తవం.. ఆ మార్గంలో జైలు ఉంటే..
ABN, First Publish Date - 2023-02-09T19:53:06+05:30
సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డితో కలిసి సీఎస్ జవహర్రెడ్డి వెళ్లారన్న వార్తలను ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించింది.
సీఎం ఓఎస్డీతో సీఎస్ అదే కారులో ప్రయాణం అవాస్తవం
సీఎస్ ప్రయాణించిన మార్గంలో జైలు ఉంటే వచ్చే ఇబ్బంది ఏంటి?
రేణిగుంటకు వేగంగా వెళ్లేందుకు ఆ మార్గాన్ని సీఎస్ ఎంచుకున్నారు
సీఎస్తో పర్యటన మొత్తంలో కడప కలెక్టర్ కూడా ఉన్నారు
విజయవాడ: సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి (CM OSD Krishna Mohan Reddy)తో కలిసి సీఎస్ జవహర్రెడ్డి (CS Jawahar Reddy) వెళ్లారన్న వార్తలను ఐఏఎస్ అధికారుల సంఘం (IAS Officers Association) ఖండించింది. 2022 అక్టోబర్లోనే సీఎస్ కడప పర్యటన షెడ్యూల్ జరిగిందని ఐఏఎస్‌లు పేర్కొన్నారు. సీఎస్తో పర్యటన మొత్తంలో కడప కలెక్టర్ కూడా ఉన్నారని ఐఏఎస్‌ల సంఘం స్పష్టం చేసింది. ముద్దనూరులోని దేవాలయం సందర్శన, సింహాద్రిపురంలోని భాను కోట గుడికి వెళ్లారని, పర్యటన తర్వాత రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు వెళ్లారని చెప్పారు. అందుకనే సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డితో కలిసి అదే కారులో సీఎస్ ప్రయాణం చేశారనే వార్త అవాస్తవమని ఐఏఎస్‌ల సంఘం వెల్లడించింది. సీఎస్ ప్రయాణించిన మార్గంలో జైలు ఉంటే వచ్చే ఇబ్బంది ఏంటి? అని ఐఏఎస్‌లు ప్రశ్నించారు. రేణిగుంటకు వేగంగా వెళ్లేందుకు ఆ మార్గాన్ని సీఎస్ ఎంచుకున్నారని ఐఏఎస్‌లు తెలిపారు.
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. ఇటీవలే కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ అతడి నుంచి సమాచారం సేకరించింది. అవినాశ్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి పీఏ నవీన్ లకు నోటీసులు జారీ చేయడం తెలిసిందే.
ఈ క్రమంలో కృష్ణమోహన్ రెడ్డి కడప సెంట్రల్ జైలులో సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఆయనను సీబీఐ అధికారులు గత మూడు గంటలుగా ప్రశ్నించారు. సీబీఐ నోటీసుల నేపథ్యంలో నవీన్ కూడా కడప చేరుకున్నారు. వివేకా హత్య అనంతరం అవినాశ్ రెడ్డి ఫోన్ నుంచి నవీన్, కృష్ణమోహన్ రెడ్డిలకు కాల్స్ వెళ్లినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. కృష్ణమోహన్ రెడ్డికి వైఎస్ తో ఎంతో సాన్నిహిత్యం ఉంది. వైఎస్ హయాంలో ఆయన పులివెందుల ఓఎస్డీగా వ్యవహరించారు.
Updated Date - 2023-02-09T19:59:41+05:30 IST