‘‘జగనన్నకు చెబుదాం’’కు కాల్ చేసిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి
ABN, First Publish Date - 2023-05-11T19:31:19+05:30
‘మీకే కష్టం వచ్చినా నా దగ్గరకు రండి. నా ఆఫీసు తలుపులు తీసే ఉంటాయి. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాదే’’ అని ముఖ్యమంత్రి భరోసా ఇస్తారు. దాన్నినమ్మి జనం సీఎం ఆఫీసుకు వెళ్తారు. అక్కడికి ఓ వ్యక్తి వచ్చి నేను సీఎం ప్రతినిధిని నాకు చెబితే సీఎంకు చెప్పినట్లే..
నెల్లూరు: ‘మీకే కష్టం వచ్చినా నా దగ్గరకు రండి. నా ఆఫీసు తలుపులు తీసే ఉంటాయి. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాదే’’ అని ముఖ్యమంత్రి భరోసా ఇస్తారు. దాన్నినమ్మి జనం సీఎం ఆఫీసుకు వెళ్తారు. అక్కడికి ఓ వ్యక్తి వచ్చి నేను సీఎం ప్రతినిధిని నాకు చెబితే సీఎంకు చెప్పినట్లే, నేను వింటే సీఎం విన్నట్లే అని భరోసా ఇస్తారు. అయితే, ప్రజలు ఈ భరోసాను విశ్వసిస్తారా? విశ్వసించడం పక్కనపెడితే ప్రజలు అవాక్కవుతారు. సమస్యలు పరిష్కరిస్తానని వందముచ్చట్లు చెప్పిన పెద్ద మనిషి తీరా ఆయన్ను కలిసేందుకు వచ్చాక ముఖం చాటేశాడని తిట్టుకుంటారు....ఇలాంటి సీన్లు ఎన్నో సినిమాల్లో చూసి ఉంటాం. సేమ్ టూ సేవ్ ఇలాంటి సినిమాటిక్ స్కీమ్‌నే ముఖ్యమంత్రి జగన్ తెరమీదకు తీసుకురాబోతున్నారు. దానిపేరే ‘‘జగనన్నకు చెబుదాం.’’ మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమల్లోకి తెచ్చారు. ప్రజల సమస్యలపై టోల్ ఫ్రీ నెంబరు 1902ను ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. సంతృప్త స్ధాయిలో ప్రజా వినతుల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. అనేక సమస్యలకు అత్యున్నత స్ధాయిలో పరిష్కారం, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్‌లతో పాటు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తోంది.
ప్రజల గోడు చెబుతున్నాం వినండి
‘‘జగనన్నకు చెబుదాం’’ అంటూ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. అయితే టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి (Kotamreddy Giridhar Reddy) వినూత్నంగా రూరల్ నియోజకవర్గ సమస్యలపై ‘‘ప్రజల గోడు చెబుతున్నాం వినండి’’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదే వేదిక నుంచి గిరిధర్‌రెడ్డి ‘‘జగనన్నకు చెబుదాం’’ అని నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యలపై టోల్ ప్రీ నెంబర్ 1902కు ఫోన్ చేశారు. అక్కడి నుంచి ఆయనకు ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. అనంతరం గిరిధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్లుగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అధికార పార్టీపై తిరుబాటు ఎగరవేస్తూ.. నియోజకవర్గ సమస్యలపై పోరాడుతున్నారని తెలిపారు.
వర్ల రామయ్యకు చేదు అనుభవం
జగనన్నకు చెబుదామని తనతో పాటు 20మంది 1902 నంబరుకు ట్రైచేసినా.. ఒక్క నంబర్‌కు మాత్రమే కలిసిందని, అందులో మాట్లాడిన మహిళ లైన్లో వేచి ఉండమని, మా ప్రతినిధులు వస్తారని పదేపదే చెప్పారని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (Varla Ramaiah) చెప్పారు. చాలా సేపు జగనన్నకు సమస్యలు చెబుతామని, సీఎం ఫటాఫట్ సమస్యలు పరిష్కరిస్తారని ఎదురుచూశానని, కానీ ప్రయోజనం లేదని చెప్పారు. మంగళవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం అంతా షో అని, ఉత్తుత్తి ప్రోగ్రామని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఉపయోగపడేది కాదని, ఏ సమస్య చెప్పినా పరిష్కరించే స్థితిలో ప్రభుత్వం లేదని విమర్శించారు.
Updated Date - 2023-05-11T19:41:17+05:30 IST