Jagan London Tour: జగన్ లండన్ పర్యటన రద్దు ? 21న వెళ్లాల్సి ఉంది.. కానీ..
ABN, First Publish Date - 2023-04-17T16:35:27+05:30
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) లండన్ పర్యటన (London Tour) రద్దు అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 21 న కుటుంబ సభ్యులతో లండన్ వెళ్లేందుకు జగన్ (AP CM) ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే జగన్ సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి అరెస్ట్ నేపథ్యంలో జగన్ లండన్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విజయవాడ నుంచి ముంబైకి ప్రత్యేక విమానంలో వెళ్లి అక్కడ నుంచి షెడ్యూల్డ్ విమానంలో లండన్ వెళ్లేందుకు జగన్ ఏర్పాట్లు చేసుకున్నారు. లండన్‌లో ఉన్న తన కుమార్తెల వద్దకు వెళ్లాలని జగన్ దంపతులు నిర్ణయించుకున్నారు. అయితే వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు వేగవంతం కావడం, తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ లండన్ పర్యటన రద్దు అయినట్లు సమాచారం.
లండన్‌లో చదువుతున్న కుమార్తె వద్దకు జగన్ దంపతులు ప్రతీ సంవత్సరం వెళ్తుంటారు. గత ఏడాది ఆమె డిగ్రీ పట్టా పొందిన సందర్భంలో జగన్ దంపతులు ప్రత్యేకంగా హాజరయ్యారు. 2021లో కుమార్తెల సమక్షంలో జగన్ దంపతులు వివాహ వార్షికోత్సవం జరుపుకొన్నారు. అయితే 2022 మే20న వీరు లండన్ వెళ్లినప్పుడు వివాదం తలెత్తింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు జగన్ ప్రత్యేక విమానంలో దావోస్‌కు వెళ్లారు. అయితే జగన్ విమానంలో నేరుగా దావోస్ వెళ్లకుండా.. లండన్ మీదుగా వెళ్లడం అప్పట్లో పెను దుమారం రేపింది. ఈ విషయంపై రాజకీయ పక్షాలు ఆరోపణలు చేశాయి. 2019 నుంచి ఏప్రిల్, మే నెలల్లో జగన్ లండన్ వెళ్లిరావడం ఆనవాయితీగా మారిపోయిందని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా ప్రత్యేక విమానంలో వెళ్లడం వల్ల ఖజానాపై భారం పడుతోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.
Updated Date - 2023-04-17T16:50:14+05:30 IST