‘షో’ చేస్తున్నారు..!

ABN , First Publish Date - 2023-03-16T00:23:58+05:30 IST

దీపం ఉండగానే చక్కబెట్టుకోవడమేమో గానీ, వీరు మాత్రం ద్వీపంలోనే చక్కబెట్టేసుకుంటున్నారు. పండుగ ఈవెంట్ల పేరు చెప్పి భవానీ ద్వీపంలో భారీగా టికెట్‌ ధరలు పెంచేస్తూ, ఆదరణ లేని ఈవెంట్లు నిర్వహిస్తూ విమర్శల పాలవుతున్నారు. ఇప్పటికే సంక్రాంతి ఈవెంట్‌లో భారీగా దెబ్బతిన్నా, తాజాగా ఉగాది ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమైపోతున్నారు.

‘షో’ చేస్తున్నారు..!

టికెట్‌ రేట్లు పెంచి పర్యాటకులపై భారం

ఇప్పటికే సంక్రాంతి, ఇతర ఈవెంట్లకు ఆదరణ కరువు

తాజాగా ఉగాది ఉత్సవాల పేరిట ‘షో’కు

భారీ ఖర్చులకు లెక్కాపత్రం శూన్యం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉగాది ఉత్సవాల పేరుతో భవానీ ద్వీపంలో మరో దుబారాకు శ్రీకారం చుట్టారు. సాధారణ పర్యాటకులకు భారంగా పెద్దలకు టికెట్‌ ధర రూ.500, పిల్లలకు రూ.300గా నిర్ణయించారు. సాధారణ టికెట్‌ కంటే నాలుగు రెట్ల మేర పెంచారు. బెర్మ్‌పార్క్‌ ఎంట్రీ, ఐల్యాండ్‌ వెళ్లడానికి బోటింగ్‌, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించటానికి, అవుట్‌డోర్‌ మ్యూజికల్‌ ఎక్విప్‌మెంట్‌ చూడటానికి, చిల్డ్రన్‌ ప్లే ఎక్విప్‌మెంట్‌ ఏరియా, రోబోటిక్‌ పార్క్‌, మిర్రర్‌ మేజ్‌, మేజ్‌ గార్డెన్‌, ఓపెన్‌ జిమ్‌ సదుపాయాలు కల్పించారు. రూ.100 టికెట్‌తో లోపలికి వెళ్లినా ఇవన్నీ ఉచితంగా చూసేవే. అయితే, దీనివెనుక పెద్ద కథే నడుస్తోందని తెలుస్తోంది. గతంలో నిర్వహించిన ఈవెంట్ల మాదిరిగానే టికెట్‌ ధరలను నిర్ణయించడం వల్ల పర్యాటకుల నుంచి ఆదరణ ఉండదు. ఎంపిక చేసిన వారిని పిలిపించి, వారి సమక్షంలో ఉత్సవాలు నిర్వహించి, దుబారా చేసి మిగుల్చుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.

న్యూ ఇయర్‌ నుంచే అవినీతి మేత

నూతన సంవత్సర ప్రారంభం నుంచి భవానీ ఐల్యాండ్‌లో ఈవెంట్ల పేరుతో ఫ్లాప్‌ షోలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సంబరాలను నిర్వహించటానికి లక్షలాది రూపాయలను బీఐటీసీ అధికారులు ఖర్చు చేశారు. స్పాన్సర్ల నుంచి కూడా లక్షలాది రూపాయలు వసూలు చేశారు. సంక్రాంతి సంబరాల్లో పర్యాటకులకు ప్రచారం కల్పించేలా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. భారీగా సెట్టింగ్‌లు, రెస్టారెంట్‌, సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక గేమ్‌ షోలు నిర్వహించారు. సాధారణంగా బోటింగ్‌ చార్జీ రూ.120 ఉంటుంది. ఫెస్టివల్‌ ఈవెంట్‌ పేరుతో పెద్దలకు రూ.300, పిల్లలకు రూ.150 వసూలు చేశారు. దీంతో సాధారణ పర్యాటకులు ముందుకు రాలేదు. బీఐటీసీ తీరుపై భవానీపురం పోలీసుల వద్ద పంచాయితీ పెట్టారు. ఇది బోటింగ్‌ చార్జీ మాత్రమే కాదని, అనేక కాంబో ఆఫర్లు ఉన్నాయని బీఐటీసీ ప్రకటించినా ఆదరణ లభించలేదు.

వృథా ఖర్చు.. కమీషన్ల కోసమే..

సంక్రాంతి సంబరాల కోసం భారీగా ఖర్చు చేశారు. భవానీ ఐల్యాండ్‌లో ఏపీటీడీసీ రెస్టారెంట్‌ ఉండగా, బయటి నుంచి ప్రైవేట్‌ హోటల్‌ నిర్వాహకుడిని పిలిచి రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు భారీగా అంటే రూ.15 లక్షల పైబడి ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. దీని ఖర్చు, ఇతర వివరాలను రహస్యంగా ఉంచారు. వివిధ వాణిజ్య సంస్థల నుంచి భారీగా స్పాన్సర్‌షిప్‌ లభించిందని తెలుస్తోంది. ఒక కార్పొరేట్‌ షాపింగ్‌మాల్‌ నుంచి రూ.3 లక్షల పైన స్పాన్సర్‌షిప్‌ వచ్చినట్టు సమాచారం. ఇలాంటివి మరెన్నో సంస్థలు ఉన్నాయి. వీటి నుంచి ఎంతెంత స్పాన్సర్‌షిప్‌ వచ్చిందో ఎవరికీ తెలియదు. ఇలాంటి రోజుల్లో ఏపీటీడీసీకి సాధారణంగానే రూ.4 లక్షల ఆదాయం వస్తుంది. మూడు రోజుల సంక్రాంతి సంబరాలకు ఇంతకు మించి ఆదాయం రాలేదని తెలుస్తోంది.

ఫ్లాప్‌ అయినా..

సంక్రాంతి తర్వాత తెలుగు భాషా దినోత్సవం అంటూ నందమూరి లక్ష్మీపార్వతిని తీసుకొచ్చి ఓ ఈవెంట్‌ చేశారు. అది కూడా ఆదరణ లేక చప్పగా సాగింది. ఆ తర్వాత బాలల దినోత్సవం రోజున కూడా ఈవెంట్‌ నిర్వహించారు. దీనికి కూడా లాభాపేక్ష లేకున్నా కనీసం బాలల నుంచి కూడా సరైన ఆదరణ లభించలేదు తాజాగా ఉగాది ఉత్సవాలకు శ్రీకారం చుడుతున్నారు.

Updated Date - 2023-03-16T00:23:58+05:30 IST