AP News: బీజేపీకి వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎం ‘ప్రచార భేరి’
ABN, First Publish Date - 2023-04-13T10:50:04+05:30
బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ‘‘ప్రచార భేరి’’ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీపీఐ, సీపీఎం పార్టీలు నిర్ణయించాయి.
విజయవాడ: బీజేపీ (BJP) మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ‘‘ప్రచార భేరి’’ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీపీఐ, సీపీఎం పార్టీలు నిర్ణయించాయి. ఏప్రిల్ 14 నుండి 30 వరకు కార్యక్రమం జరుగనుంది. ‘‘ప్రధాని మోదీని గద్దె దింపండి... దేశాన్ని కాపాడండి‘‘ అనే నినాదంతో ‘‘ప్రచార భేరీ’’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం సీపీఐ, సీపీఎం పార్టీ నేతలు (CPM, CPI Leaders) సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి... కార్యక్రమానికి సంబంధించి పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు CPM State Secretary V Srinivasa Rao) మాట్లాడుతూ... శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి పేరుతో మతాల మధ్య వీహెచ్‌పీ (VHP), ఆర్‌ఎస్‌ఎస్ (RSS) ఆధ్వర్యంలో చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు నేటికీ రాజుకుంటున్నాయని తెలిపారు. మోదీ (PM Modi) వైఫల్యాలను పక్కన పెట్టి మతోన్మాదంతో పబ్బం గడపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ వాళ్ళు మనువాధం పేరుతో మహిళలను ఇంట్లోంచి బయటకు రాకుండా చేస్తున్నారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నేతలు పాఠశాలల్లో పిల్లలను కూడా కలుషితం చేస్తున్నారని.. ఇప్పుడు జగన్ (AP CM Jagan) కూడా దానికి తందానా అంటున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్రాలు కలిసి విశాఖ ఉక్కు (Visakha Steel Plant) పీక నొక్కాలని చూస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు విషయంలో సజ్జల, ఆ శాఖ మంత్రి అమర్నాథ్ (Minister Amarnath) అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. వాళ్ళు మాట్లాడుతూ కమ్యూనిస్ట్‌లపై నెపం వేస్తారా అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ను తాము కాపాడుతుంటే దాన్ని తప్పుపడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును కాపాడుతామని ఒక మాట కూడా సజ్జల తన ప్రెస్ మీట్‌లో చెప్పలేదన్నారు. బీజేపీ విశాఖ ఉక్కును ముందు నుంచి పొడుస్తుంటే.... తమరు వెనక నుండి పొడుస్తారా అని విరుచుకుపడ్డారు. విజయవాడలో ప్రకాష్ కారత్, వినయ్ విశ్వంలు రేపు ప్రచార భేరిలో పాల్గొంటారని శ్రీనివాసరావు వెల్లడించారు.
సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna) మాట్లాడుతూ.. బీజేపీ హటావో.. దేశ్‌కి బచావో అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 26 జిల్లాల్లో ఈనెల 30 వరకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 9 ఏళ్లుగా నరేంద్ర మోడీ (Narendra Modi) దేశానికి ఏమ్ చేశారో.. అన్నింటిపైన చర్చిస్తామని తెలిపారు. ఒక్క వాగ్దానం అయినా మోదీ ప్రభుత్వం (Modi Government) అమలు చేసిందా చెప్పాలని ఛాలెంజ్ విసిరారు. ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని ఎక్కడా తగ్గడం లేదన్నారు. సిలెండర్ ధర, పెట్రోల్ ధరలు పెరిగినప్పటికీ కేంద్రంలో మంత్రులు ఎందుకు సమాధానం చెప్పరని ప్రశ్నించారు. దేశం దాటి వెళుతున్న వారిలో అందరు గుజరాతీయులే అని.. ఒక్క విజయ మాల్యా తప్ప అని అన్నారు. ఏపీకి ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. విశాఖలోని స్టీల్ ప్లాంట్‌ను అదాని అప్పగించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తులు వేస్తున్నాయని ఆరోపించారు. నరేంద్ర మోదీని గద్దె దింపడానికి జరిగే పొరాటాల్లో ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రామకృష్ణ స్పష్టం చేశారు.
Updated Date - 2023-04-13T10:50:04+05:30 IST