AP News: అంగన్వాడీల అరెస్టులను ఖండించిన రామకృష్ణ
ABN, First Publish Date - 2023-09-25T10:01:28+05:30
విజయవాడ: అంగన్వాడీల అరెస్టులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్‌టియుల అనుబంధ సంఘాల అంగన్వాడీలు శాంతియుత ఆందోళనకు సిద్ధమయ్యారు.
విజయవాడ: అంగన్వాడీల అరెస్టు (Anganwadis Arrest)లను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (Ramakrishna) ఖండించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఏఐటియుసి (AITUC), సిఐటియు (CITU), ఐఎఫ్‌టియు (IFTU)ల అనుబంధ సంఘాల అంగన్వాడీలు శాంతియుత ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ పోలీసులు (Police) ముందస్తుగా అరెస్టులు చేయడంపై రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. అంగన్‌వాడీలను అరెస్టులు చేయడం దుర్మార్గమని, ఏపీలో ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులకు పాతరేస్తోందని, రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) ప్రజా ఉద్యమాలను అణచివేసే కుట్రతో పాలన సాగిస్తున్నారని, ప్రజాతంత్ర వాదులంతా ఈ దుష్ట విధానాలను ఖండించాలని కోరుతున్నామని రామకృష్ణ అన్నారు.
తమ సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం ఛలో విజయవాడకు అంగన్‌వాడీ మహిళలు పిలుపునిచ్చారు. ఇందుకు అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ అంగన్‌వాడీలు అరెస్టులు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి అంగన్‌వాడీలు రైళ్ల ద్వారా విజయవాడ చేరుకున్నారు. బయటకు రాగానే అడ్డుకుని అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న వారందరినీ ఒక కళ్యాణ మండపంలో ఉంచారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని అంగన్‌వాడీలు డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు పెంచుతామని, రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, నాలుగేళ్లుగా హామీలు అమలు చేయకపోగా, బిల్లులు కూడా ఇవ్వడం లేదని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-09-25T10:01:28+05:30 IST