ఉల్లాసంగా..అహింసా రన్
ABN , First Publish Date - 2023-04-03T01:04:45+05:30 IST
యుద్ధాలు, అహింస నిర్మూలన, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ జీతో (జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన అహింసా రన్ ఉల్లాసపూరిత వాతావరణంలో సాగింది.
ప్రత్యేక ఆకర్షణగా పీటీ ఉష.. అలరించిన జుంబా డ్యాన్స్
విజయవాడ స్పోర్ట్సు: యుద్ధాలు, అహింస నిర్మూలన, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ జీతో (జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన అహింసా రన్ ఉల్లాసపూరిత వాతావరణంలో సాగింది. చిన్నారుల నుంచి వయస్సు పైబడిన వారి వరకు పరుగులో పాల్గొన్నారు. ఆది వారం ఉదయం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్డేడియం వేదికగా 1,900 మందికి పైగా అథ్లెట్లు 3, 5, 10కే రన్‌లో పరుగు తీశారు. రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, సీపీ కాంతారాణా టాటా, జీతో ఇండియా విజయవాడ ఫౌండర్ చైర్మన్ రమేష్ జైన్, డాక్టర్ జి.సమరం జెండా ఊపి పరుగును ప్రారంభించారు. క్రీడాకారులతో మమైకమైన పీటీ ఉష రన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యాంకర్లు సుమంత్, ప్రియాంకల ఆధ్వర్యంలో జుంబా నృత్యాలు, క్రీడాకారుల వార్మప్ ఎక్సర్‌సైజ్‌లతో ఉత్సాహంగా రన్ సాగింది. జీతో సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అహింసను నివారించేందుకు ముందుకు రావడం అభినందనీయ మని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. క్రీడలపై ఆసక్తిని రేకెత్తించేలే సామాజిక కార్యక్రమా లను జీతో నిర్వహించడం మంచి పరిణామమని సీపీ కాంతారాణా పేర్కొన్నారు. జీతో విజయవాడ చాప్టర్ చైర్మన్ అశోక్ గోలెచ, చీఫ్ సెక్రటరీ మనీష్ దోషి, లేడీస్‌వింగ్ చైర్‌పర్సన్ త్రపాటి జైన్, చీఫ్ సెక్రటరీ సంగీత నైనవాట్, డీసీపీలు విశాల్ గున్నీ, మేరీ ప్రశాంతి, విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్య క్షుడు కొనకళ్ల విద్యాధరరావు పాల్గొన్నారు. విజేతల బహుమతుల ప్రదానోత్సవంలో పీటీ ఉష, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు పాల్గొన్నారు.