PawanKalyan: హరీష్‌రావుపై ఏపీ మంత్రుల వ్యాఖ్యలకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
ABN, First Publish Date - 2023-04-17T11:02:48+05:30
తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధిపై రెండు రాష్ట్రాల మంత్రులకు మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే.
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధిపై రెండు రాష్ట్రాల మంత్రులకు మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు (Telangana Minister Harish Rao) చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (AP Minister Karumuri Nageshwar Rao) సహా పలువురు తీవ్రస్థాయిలో విరుచుకుపడగా.. అందుకు హరీష్ కూడా వారికి సరైన రీతిలో ఘాటుగా సమాధానం చెప్పారు. అయితే తెలంగాణ మంత్రి హరీష్‌రావుతో పాటు తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా ఏపీ మంత్రుల వ్యాఖ్యలు ఉన్నాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) అభ్యంతరం తెలిపారు.
తెలంగాణకు చెందిన మంత్రి హరీష్ రావు ఏపీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారని... వారి మాటలకు వైసీపీ నాయకులు ప్రతిస్పందిస్తున్న తీరు ఇబ్బందిగా మారిందన్నారు. వైసీపీ నాయకులు తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పాలకులు వేరు, ప్రజలు వేరు అని జనసేన ముందు నుంచి చెప్తూనే ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడడం తనకు బాధ కలిగించిందన్నారు. వైసీపీ నాయకులు కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలని హితవుపలికారు. ఆంధ్ర పాలకులకు తెలంగాణలో వ్యాపారాలు, వాకిళ్ళు ఉన్నాయని గుర్తుచేశారు. మంత్రి బొత్స కూడా గతంలో తెలంగాణలో కేబుల్ వ్యాపారం చేశారన్నారు. ఒక వ్యక్తి విమర్శ చేస్తే ఆ వ్యక్తి పరంగానే ప్రతి విమర్శ ఉండాలని సూచించారు. నాయకులు మాట్లాడిన దానికి ప్రజలను భాగస్వాములు చేయకూడదని జనసేన కోరుతోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పవన్ పోస్ట్ చేశారు.
Updated Date - 2023-04-17T11:07:01+05:30 IST