AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ABN, First Publish Date - 2023-03-18T10:17:34+05:30
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నిరసన నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాం వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ (AP Assembly Session)లో టీడీపీ సభ్యుల (TDP MLAs)నిరసన నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Sitharam) వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. మొత్తం 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో వరుసగా ఐదో రోజు టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి సస్పెండ్‌కు గురయ్యారు. శనివారం ఉదయం సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలని... దానిపై సభలో చర్చ జరగాలంటూ టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి అనేకమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పటికీ పర్యటన వివరాలు ప్రజలకు తెలియజేయడం లేదని టీడీపీ సభ్యులు తెలిపారు. అసలు సీఎం ఢిల్లీ పర్యటన ఉద్దేశం ఏంటంటూ టీడీపీ డిమాండ్ చేసింది. సీఎం జగన్ (AP CM) ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలంటూ స్పీకర్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. ఢిల్లీ వెళ్లి ఏం సాధించుకొచ్చారంటూ ఆందోళనకు దిగారు. పోలవరా(Polavaram)నికి ఎన్ని నిధులు తెచ్చారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా అంటూ నినాదాలు చేశారు. వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.
అయితే ఇలాంటి వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Legislative Affairs Minister Buggana Rajendranath Reddy) స్పష్టం చేశారు. ఇది కేవలం సభా సమయాన్ని వృధా చేయడం కోసమే అని అన్నారు. గతంలో చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) 35 సార్లు ఢిల్లీ వెళ్లారని.. ఆ 35 సార్లు చర్చించి.. తరువాత ప్రస్తుత సీఎం ఢిల్లీ పర్యటనపై చర్చిద్దామా అంటూ సవాల్ విసిరారు. దానికి తాము సిద్ధమే అంటూ టీడీపీ సభ్యులు ప్రతిసవాల్ చేశారు. ఈ నేపథ్యంలో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. సీఎం ఢిల్లీ పర్యటన వివరాలు తెలపాలంటూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అనంతరం నేరుగా స్పీకర్ చెయిర్ వద్దకే వెళ్లి నినాదాలు చేశారు. తమ వద్ద ఉన్న ఎజెండా కాపీలను చించి స్పీకర్‌పై విసిరారు. ఈ అంశానికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సభను స్పీకర్ కోరారు.
అక్కడైతే కెమెరాలో పడతారని....
దీంతో బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. సభా సమయాన్ని వృధా చేయడం మంచిది కాదన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనపై వాయిదా తీర్మానం ఇస్తారా.. అసలు వాయిదా తీర్మానం అర్ధం తెలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఓపికకు, సహనానికి ధన్యవాదాలు తెలిపారు. అక్కడ సీనియర్ సభ్యులు ఇలాంటి వాయిదా తీర్మానాన్ని ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వాయిదా తీర్మానాన్ని అడ్డం పెట్టుకొని కావాలని గొడవ చేస్తున్నారన్నారు. ‘‘మీ పక్కనే నిల్చుని ఆందోళన చేస్తారు. ఎందుకంటే అక్కడైతే కెమెరాలో పడతామని ఆందోళన చేస్తారు. వారికి చర్చ అవసరం లేదు. సభను ఆర్డర్‌లో అయినా పెట్టండి. వాయిదా వేయ్యండి లేదా సస్పెండ్ అయినా చెయ్యండి’’ అని స్పీకర్‌కు సూచించారు.
11 మందిపై సస్పెన్షన్ వేటు
టీడీపీ సభ్యుల ఆందోళనపై మంత్రి దాడిశెట్టి రాజా (Minister Dadisetti Raja) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులపై యాక్షన్ అయినా తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. అయినప్పటికీ సీఎం ఢిల్లీ పర్యటన స్వప్రయోజనాలా... రాష్ట్ర ప్రయోజనాలా చెప్పాలంటూ స్పీకర్ పోడియం వద్దే టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగించారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలంటూ మంత్రి బుగ్గన తీర్మానాన్ని ప్రతిపాదించగా... సభ ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం 11 మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. బెందాళం అశోక్ (Bendalam Ashok), అచ్చన్నాయుడు (Atchannaidu), ఆదిరెడ్డి భవానీ (Adireddy Bhavani), నిమ్మకాయల చినరాజప్ప (Nimmakayala Chinarajappa), గణబాబు (ganababu), వెలగపూడి రామక్రుష్ణబాబు (Velagapudi Ramakrishna babu), మంతెన రామరాజు (Mantena Ramaraju), గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar), ఏలూరి సాంబశివరావు (Eluru Sambashivarao), డోలా బాల వీరాంజనేయ స్వామి (Dola veeranjaneya Swamy), గద్దె రామ్మెహన్ (Gadde Rammohan)లను ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లకపోవడంతో మార్షల్స్ వచ్చి వారిని సభ నుంచి బయటకు తీసుకువచ్చారు.
Updated Date - 2023-03-18T10:26:09+05:30 IST