Flexi Fight: మరో కొత్త ఫ్లెక్సీ... ఈసారీ టీడీపీ వంతు.. ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు
ABN, First Publish Date - 2023-05-31T09:56:53+05:30
మచిలీపట్నంలో రాజకీయ పార్టీలు మధ్య ఫెక్సీల యుద్ధం కొనసాగుతోంది.
కృష్ణా: మచిలీపట్నంలో రాజకీయ పార్టీలు మధ్య ఫ్లెక్సీల యుద్ధం కొనసాగుతోంది. నిన్న పోటాపోటీగా జనసేన (Janasena), వైసీపీ (YCP) ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా.. ఈరోజు టీడీపీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ఆసక్తిని రేపుతోంది. అయితే వైసీపీ, జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పటికీ కార్పొరేషన్ సిబ్బంది మాత్రం జనసైనికులు కట్టిన ఫ్లెక్సీలు మాత్రమే తొలగించారు. అదేమని ప్రశ్నించిన జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా ఈరోజు టీడీపీ ఆధ్వర్యంలో కొత్తగా ఫ్లెక్సీలు వెలిశాయి. జగనాసుర రక్త చరిత్ర.. బాబాయి గొడ్డలికి.. బంగారు భవిష్యత్తు కు యుద్దం అంటూ పది తలల రావణాసురుడిగా కత్తి పట్టిన జగన్ ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జగన్ కాళ్ల దగ్గర బాబాయి మృతదేహం, జగన్ వెనుక భయపడుతున్న పేద ప్రజలు.. మరోవైపు జగన్ అనే రాక్షసుడి నుంచి కాపాడేందుకు ప్రజలకు అడ్డుగా ఉన్న చంద్రబాబు చిత్రంతో ఫ్లెక్సీలు వెలిశాయి. మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ఫ్లెక్సీల తొలగింపు.. పైగా పోలీసుల హెచ్చరికలు
అయితే టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. వైసీపీ కట్టిన ఫ్లెక్సీలను కూడా తొలగించాలని టీడీపీ నాయకులు పట్టుబట్టారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. పైగా కేసులు పెడతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. బలవంతంగా ఫ్లెక్సీలను అక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల పేరుతో వైసీపీ కట్టిన ఫ్లెక్సీలను మాత్రం పోలీసులు తొలగించని పరిస్థితి. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అధికార పార్టీ నేతలకు ఒక రూలు.. ప్రతి పక్ష పార్టీలకు ఒక రూలా అంటూ టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-05-31T10:05:56+05:30 IST