Varla Ramaiah: ‘విజయకుమార్ ఎవరో ప్రజలకు జగన్ చెప్పాలి’
ABN, First Publish Date - 2023-04-17T15:13:17+05:30
ఓ పక్క రాష్ట్రంలో ఎండలవేడికి ప్రజలు ఠారెత్తిపోతుంటే... మరోవైపు కుటుంబసభ్యుల అరెస్ట్‌తో తాడేపల్లి రాజప్రాసాదం కంపించిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ఓ పక్క రాష్ట్రంలో ఎండలవేడికి ప్రజలు ఠారెత్తిపోతుంటే... మరోవైపు కుటుంబసభ్యుల అరెస్ట్‌తో తాడేపల్లి రాజప్రాసాదం కంపించిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... సీబీఐ నిన్న వై.ఎస్.భాస్కర్ రెడ్డి (YS bhaskar Reddy)ని అదుపులోకి తీసుకోవడంతో, వివేకా హత్య కేసులో తనవాళ్లను రక్షించాలనుకున్న జగన్ (AP CM Jagan) అధికారం, అహం, బింకాలు, భగీరథప్రయత్నం అన్నీ పటాపంచలు అయ్యాయన్నారు. వివేకా హత్య కేసు ఉచ్చు నుంచి తన వాళ్లను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి, తిమ్మిని బమ్మిని... బమ్మినితిమ్మిని చేయగల, పెద్ద తలకాయలతో సంబంధాలున్న లాబీయిస్ట్ విజయ్ కుమార్‌ను రంగంలోకి దించారని తెలిపారు. నిన్న మైసూరు నుంచి ప్రత్యేకవిమానంలో గన్నవరం చేరుకున్న లాబీయిస్ట్ విజయ్ కుమార్ (Lobbyist Vijay Kumar).. అక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి, ఆయనతో సమావేశమయ్యారన్నారు. జగన్‌తో సమావేశానంతరం లాబీయిస్ట్ విజయ్ కుమార్ నేరుగా హైదరాబాద్‌కు వెళ్లిపోయారని.. భాస్కర్ రెడ్డిని బయటపడేయడానికి తన కార్యాచరణ మొదలెట్టారని ఆయన తెలిపారు.
వివేకా హత్యకేసు నుంచి తన బాబాయ్ భాస్కర్ రెడ్డి, తమ్ముడు అవినాష్ రెడ్డిలను కాపాడుకోవడానికే జగన్, లాబీయిస్ట్ విజయ్ కుమార్‌ను రంగంలోకి దించాడని ప్రజలకు అర్థమైందన్నారు. తాటిని తన్నేవాడు ఉంటే వాడి తలదన్నేవాడు ఉంటాడని ఇంకా జగన్‌కు బోధపడలేదా? అని ప్రశ్నించారు. అన్నీదారులు మూసుకుపోయాక లాబీయిస్ట్‌లను రంగంలోకి దించినా ఉపయోగం లేదని భారతదేశ న్యాయవ్యవస్థ, దర్యాప్తు సంస్థ సీబీఐ ఇంకా తాను అనుకునే స్థితికి దిగజారలేదని ముఖ్యమంత్రి గ్రహించాలని హితవుపలికారు. జగన్‌కు దేవుడిచ్చిన అన్నయ్య అయిన గాలిజనార్థన్ రెడ్డి గతంలో బెయిల్ పొందడానికి సీబీఐ జడ్జికి రూ.100కోట్ల లంచం ఇచ్చి పట్టుబడ్డారని.. ఆ వ్యవహారంలో సీబీఐ జడ్జి పట్టాభిరామారావు బలయ్యారని గుర్తుచేశారు. అదేకోవలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, లాబీయిస్ట్ విజయ్ కుమార్ ద్వారా ఎవరిని బలిచేయబోతున్నారని అన్నారు. లాబీయిస్ట్ విజయ్ కుమార్ ఉచ్చులో పడకుండా పోలీస్, సీబీఐ, ఇతర అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. విజయ్ కుమార్ ఎవరో, తన ఇంటికి వచ్చి ఏం మాట్లాడారో ముఖ్యమంత్రి తక్షణమే ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. హంతకుల్ని రక్షించడానికేనా జగన్‌కు, అతని పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తీరు, ఆలోచనా విధానం గురించి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని వర్ల రామయ్య పేర్కొన్నారు.
Updated Date - 2023-04-17T15:14:54+05:30 IST