TDP: అవసరం లేకున్నా ఎందుకు అప్పులు చేస్తున్నారో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి
ABN, First Publish Date - 2023-06-20T15:43:22+05:30
జగన్ సర్కార్ చేస్తున్న అప్పులపై టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తెచ్చిన డబ్బంతా ఏం చేస్తున్నారని
అమరావతి: జగన్ సర్కార్ (JAGAN Government) చేస్తున్న అప్పులపై టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తెచ్చిన డబ్బంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఏప్రిల్‌లో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన రూ.23,548 కోట్ల అప్పులో ఆర్బీఐ (RBI) ద్వారా తెచ్చింది కేవలం రూ.6 వేల కోట్లు మాత్రమే. మిగిలిన రూ.17వేల కోట్లు ఏమయ్యాయో? ఎటుపోయాయో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాగ్ బయట పెట్టే వరకు రూ.23,548 కోట్ల అప్పు వివరాలు రహస్యంగా ఉంచడంలోని ఆంతర్యం ఏమిటో జగన్ ప్రభుత్వం చెప్పాలి. ప్రజలకు, కాగ్ వంటి సంస్థలకు తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా అప్పులు చేస్తూ ఆ సొమ్ముని ఎటు మళ్లిస్తున్నారు? 9 నెలల కాలానికి ఏపీ ప్రభుత్వానికి కేంద్రం కేవలం రూ.30, 271 కోట్ల అప్పుకి మాత్రమే అనుమతిస్తే.. జగన్ ప్రభుత్వం ఒక్కనెలలోనే (ఏప్రిల్) రూ.23,548 కోట్ల అప్పు చేయాల్సిన అత్యవసరం ఏమిటి? 2023-24లో రూ.54వేల కోట్ల అప్పులు తెచ్చిన జగన్ సర్కారుకి ఇప్పుడు ఉన్నపళంగా ఒక్కనెలలోనే రూ.23,548 కోట్ల అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసెంబ్లీకి చెప్పకుండా, ప్రజలకు తెలియకుండా, దొడ్డిదారిన తెస్తున్న అప్పుల్ని ప్రభుత్వం దేనికి ఖర్చుపెడుతోందో ఆర్థికమంత్రి బుగ్గన సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాజెక్ట్‌లు కట్టారో.. ఎలాంటి మౌలిక వసతులు కల్పించారో చెప్పకుండా రూ.5,800 కోట్లను కేపిటల్ ఎక్స్ పెండేచర్‌లో ఎలా చూపుతారు? రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తున్న అప్పులపై కేంద్ర ఆర్థికమంత్రి తక్షణమే దృష్టిపెట్టాలి. అప్పులకుప్పగా మారిన రాష్ట్రాన్ని, ఆదాయం లేక ప్రభుత్వ దోపిడీతో సర్వం కోల్పోతున్న రాష్ట్ర ప్రజల్ని నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman) ఆదుకోవాలి.’’ అని ఆయన డిమాండ్ చేశారు.
Updated Date - 2023-06-20T15:43:22+05:30 IST