Avinash Reddy: అవినాశ్ తల్లి ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్‌లో ఏముందంటే..
ABN, First Publish Date - 2023-05-25T15:11:18+05:30
వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు. శ్రీలక్ష్మిని త్వరలో సాధారణ వార్డుకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
కర్నూలు: వివేకా హత్య కేసులో (Viveka Murder Case) నిందితుడిగా ఉన్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (YCP MP Avinash Reddy) తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో (MP Avinash Mother Health Bulletin) వెల్లడించారు. శ్రీలక్ష్మిని త్వరలో సాధారణ వార్డుకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో అవినాశ్ తల్లి చికిత్స పొందుతున్నారు.
ఇదిలా ఉండగా.. అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. నేడు విచారణ అనంతరం హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేయకుండా చూడాలన్న అవినాశ్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్‌పై అవినాశ్‌రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. అవినాశ్ రెడ్డి పిటిషన్‌లో సునీతారెడ్డి ఇంప్లీడ్ కానుండటం గమనార్హం. అవినాశ్‌కు ముందస్తు బెయిల్ ఇస్తే కేసులో జరిగే పరిణామాలను కోర్టు దృష్టికి తీసుకెళ్తామని సీబీఐ, సునీతారెడ్డి ఇప్పటికే పేర్కొన్న విషయం విదితమే.
అవినాశ్ రెడ్డి చుట్టూ నడుస్తున్న హైడ్రామా సామాన్యుల్లో కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. సీబీఐ అధికారులు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియాను అలవోకగా అరెస్టు చేశారు. అంతెందుకు.. జగన్మోహన్ రెడ్డిని దిల్‌కుశ గెస్ట్‌హౌ్‌స్‌కు పిలిపించి.. ‘యు ఆర్ అండర్ అరెస్ట్’ అన్నారు. వివేకానంద హత్య కేసులోనే అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఆయన ఇంట్లోనే తెల్లవారుజామున సునాయాసంగా అరెస్టు చేశారు. మరి.. అదే కేసులో, అదే రకమైన అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాశ్ అరెస్టుకు ఇన్ని ఆపసోపాలు ఎందుకు? ఇది సామాన్యుల ప్రశ్న!
అవినాశ్ ‘అరెస్టు’పై హైడ్రామాతో పోలీసుల పరువు కొండారెడ్డి బురుజు సాక్షిగా తుంగభద్రలో కొట్టుకుపోగా.. సీబీఐ ‘పవరు’ ప్రతిష్ఠ ఆ పక్కనే ఉన్న పోలీసు రెస్ట్‌హౌ్‌సలో తలుపులు మూసుకు కూర్చుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘చట్టం తనపని తాను చేయడంలేదు. ఇంకెవరో చెప్పినట్లుగా ఆడుతోంది’ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 16వ తేదీ సీబీఐ విచారణకు గైర్హాజరైన అవినాశ్ రెడ్డి.. 19వ తేదీన తన తల్లికి అనారోగ్యమంటూ మరోసారి విచారణకు రాలేదు. పులివెందులలో సొమ్మసిల్లి పడిపోయిన తల్లి లక్ష్మమ్మను అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తారని అంతా భావించినా.. కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్చారు. దీంతో సీబీఐ అధికారులు షాక్‌కు గురయ్యారు. కొద్దిసేపు ఆయన వాహనాన్ని వెంబడించి.. ‘ఎందుకనో’ వెనుదిరిగారు. 22వ తేదీన సోమవారం మళ్లీ విచారణకు రావాలన్నారు. కానీ.. ఆయన మళ్లీ రాలేదు. దీంతో సోమవారం తెల్లవారుజాము నుంచి మళ్లీ హల్‌చల్ మొదలుపెట్టారు. అవినాశ్ రెడ్డిని అరెస్టు చేస్తాం సహకరించండి అని ఎస్పీని కోరగా.. ‘అరెస్టు చేస్తే తలెత్తే పరిణామాలను మేం అదుపు చేయలేం’ అంటూ ఆయన చేతులెత్తేసినట్లు వార్తలు వచ్చాయి. అటు ఆస్పత్రి ఎదుట.. ‘ఎలా అరెస్టు చేస్తారో చూస్తాం’ అని అవినాశ్ అనుచరులు రంకెలు వేస్తూనే ఉన్నారు.
సీబీఐ అధికారులు బిక్కుబిక్కుమంటూ పోలీసు రెస్ట్‌హౌ్‌సలో గడిపారే తప్ప.. కనీసం ఆస్పత్రికి వెళ్లి ఎంపీ తల్లి ఆరోగ్య పరిస్థితి ఏమిటి? ఆమెను దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం నిజంగానే ఉందా? అనే ఆరా కూడా తీయలేదు. చివరికి.. అవినాశ్ అరెస్టును అడ్డుకోబోమని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ, కనీసం ఆస్పత్రి ఛాయలకు కూడా వెళ్లలేకపోయారు. ఉప ముఖ్యమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను, బడాబడా నేతలను అరెస్టు చేసిన చరిత్ర ఉన్న సీబీఐ అధికారులు అవినాశ్ విషయంలో ఇంత మౌన రుషులుగా మారడమే చిత్రమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి.. ఈ ఎపిసోడ్‌లో అటు పోలీసు, ఇటు సీబీఐ అధికారుల నిస్సహాయత బయటపడిందని.. తెరవెనుక ఉన్న శక్తులేవో అవినాశ్ అరెస్టును అడ్డుకుంటున్నాయని సామాన్యులకు సైతం అర్థమైపోయింది.
Updated Date - 2023-05-25T15:13:15+05:30 IST