యువగళం వెంట పల్లెలు కదిలాయి..

ABN , First Publish Date - 2023-07-12T00:08:49+05:30 IST

జిల్లా అంతటా అల్లుకుపోయిన భూ కుంభకోణాలు, అవినీతి, అక్రమాలు.. ప్రజల కష్టాలు కల్లోలాలను తలపించాయి.

యువగళం వెంట పల్లెలు కదిలాయి..
బుడిదపాడు నుంచి పాదయాత్రగా వస్తున్న టీడీపీ శ్రేణులు

- 25 రోజులు 300 కిలోమీటర్లు

- కర్నూలు జిల్లాలో సాగిన లోకేశ పాదయాత్ర

- యువనేతను చూసేందుకు ఎగబడ్డ జనం

- ప్రజల కష్టాలు చూసి చలించిన నారా లోకేశ

- ప్రతి అడుగులో భరోసానిస్తూ సాగిన ‘యువగళం’

- పాదయాత్ర సంగతులు మరోసారి..

జిల్లా అంతటా అల్లుకుపోయిన భూ కుంభకోణాలు, అవినీతి, అక్రమాలు.. ప్రజల కష్టాలు కల్లోలాలను తలపించాయి. ప్రజల ఇబ్బందుల కలచివేశాయి.. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప... ఈ నాలుగేళ్లలో ఇసుమంతైనా లేకపోవడం స్పష్టంగా కనిపించింది. పత్తికొండ, ఎమ్మిగూరు, ఆలూరు, మంత్రాలయం, కర్నూలు, కోడుమూరు నియోజకవర్గాల్లో దోపిడీ దారుల నుంచి రైతులను కాపాడాల్సిన అవసరం అనివార్యమైంది. భూ రాబంధుల ఆగడాలకు అడ్డుకట్ట వేయకుంటే పేదలకు సెంటు భూమి కూడా దక్కదు. ఈ తరుణంలో ఆరడుగుల యువకుడు నేనున్నానంటూ కందనవోలు గడ్డపై అడుగు పెట్టాడు. పాదయాత్ర పేరిట మారుమూల పల్లెల్లోని ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. ఆయనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ. ‘యువగళం’ పేరిట చేపట్టిన పాదయాత్ర నెల్లూరు జిల్లాలో రెండువేల కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో నారా లోకేశ సాగించిన పాదయాత్ర స్మృతులు అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కర్నూలు, జూలై 11 (ఆంధ్రజ్యోతి):

కందెనవోలు గడ్డపై యువనేత లోకేష్‌ అడుగుల సవ్వడులు.. యువగళం పాదయాత్ర పేరిట యువనేత నారా లోకేశ సాగించిన పాదయాత్ర విజయవంతమైంది. జన చైతన్యం.. పాలక పక్షం అవినీతి అక్రమాలపై సమర శంఖం పూరిస్తూ యువనేత పాదయాత్ర సాగించాడు. భగభగ మండుతన్న సూర్యుడి నిప్పులు వర్షం కురిపించినా.. జోరువానలు కురిసినా ఆయన యాత్ర మాత్రం ఆగలేదు. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించేలా యువగళం.. జనబలమై.. అభిమాన నాయకుడిపై పుష్పవర్షం కురిపిస్తూ నారా లోకేశ పాదయాత్ర ముందుకు సాగింది. నారా లోకేశ పాదయాత్ర ఏప్రిల్‌ 13న అనంతపురం జిల్లా నుంచి కర్నూలు జిల్లాలో అడుగుపెట్టారు. మే 9వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో 25 రోజులు.. 300 కిలోమీటర్ల మేర లోకేశ నడక సాగించారు. కీలకమైన వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని ఆదోని పట్టణ శివారులో ఇస్వీ దగ్గర పూర్తి చేసి ఫైలాన ఆవిష్కరించారు. మండుటెండలు, జోరువానలు లెక్కచేయక యువనేత లోకేశ పాదయాత్ర సాగించారు.

ప్రతి అడుగులోనూ భరోసా..

మండుటెండలు.. ఈదురు గాలులు.. జోరుగా వర్షం పడుతున్నా యువగళం లక్ష్యం వైపు అడుగులు వేశారు. పాదయాత్ర సాగిస్తూనే రోడ్డు పొడవున రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతరం సమస్యలు వింటూ నేనున్నానే భరోసా కల్పిస్తూ యాత్ర సాగించారు. ఆదోని మండలం పెద్దతుంబళం దగ్గర జరిగిన సర్పంచుల సదస్సులో ప్రభుత్వం తీరుపై గళమెత్తారు. టీడీపీ అధికారంలోకి రాగానే నేరుగా నిధులు పంచాయతీ ఖాతాలోకే జమ చేస్తామంటూ భరోసా కల్పించారు.

ముస్లింలకు చేరువైన యువనేత

మే 8వ తేదీన కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ముస్లింలతో నారా లోకేశ ముఖాముఖి నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడిన ప్రతీ అంశం ఆలోచింపజేసింది. ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటామని, టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు.. మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇస్తామంటూ మైనార్టీ వర్గాలను ఆకట్టుకున్నారు. ఇదే క్రమంలో ముస్లింలపై వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న దాడులను ఎండగట్టారు. అదేవిధంగా మహిళా సదస్సులోనూ నారా లోకేశ మాట్లాడారు. చేనేతలకు అండగా ఉంటారని ధైర్యం కల్పించారు. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని బడుగు బలహీన వర్గాల్లో భరోసానిచ్చారు. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక అజెండాతో ముందుకు వెళ్తామని వివరిస్తూ యువనేత తన పాదయాత్రను సాగించారు.

యువనేత వెంట ‘తెలుగు’శ్రేణి

జిల్లాలో యువనేత లోకేశ 25 రోజులు సాగించిన యువగళం పాదయాత్రలో జిల్లా నేతలు అడుగులు వేస్తూ ఉత్సాహంగా.. ఉత్తేజంగా నడక సాగించారు. జిల్లాకు చెందిన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశరెడ్డి, నాటి టీడీపీ జిల్లా అఽధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తాజా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌, ఆనాటి నంద్యాల జిల్లా అఽధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, టీడీపీ పత్తికొండ ఇనచార్జి కేఈ శ్యాంబాబు, ఆలూరు ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, ఆదోని ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు, మంత్రాలయం ఇనచార్జి పి.తిక్కారెడ్డి, ఎమ్మిగనూరు ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, కోడుమూరు ఇనచార్జి ఆకేపోగు ప్రభాకర్‌, పాణ్యం ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితమ్మ, కర్నూలు ఇనచార్జి టీజీ భరత సహా మాజీ మంత్రులు అమర్నాథ్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, బనగానపల్లె ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి, జిల్లాలో పలువురు ముఖ్య నేతలు లోకేశ వెంట నడిచారు. ఏ నియోజకవర్గంలో అడుగు పెట్టినా.., ఏ పల్లెకు వెళ్లినా జనం నీరాజనం పలికారు. పసుపు సైన్యం ఉత్తేజభరితంగా ముందుకు సాగింది. తెలుగు తమ్ముళ్లల్లో నూతన ఉత్తేజం నింపింది. అదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు సాగించే భూదందా, ఇసుక మాఫియా, ఎర్రమట్టి, బియ్యం, మద్యం మాఫియాపై ఆధారాలతో సహా బయట పెట్టారు.

పాదయాత్రలో ‘కుటుంబం’

జిల్లాలో లోకేశ పాదయాత్ర సందర్భంగా కుటుంబ సభ్యులు యువనేతను కలసి సంఘీభావం తెలిపారు. ఆదోని మండలం కడితోట దగ్గర విడిది కేంద్రంలో తల్లి నారా భువనేశ్వరి లోకేశను కలసి అమ్మ ప్రేమను చాటుకుంది. మండల కేంద్రం నందవరంలో సతీమణి నారా బ్రాహ్మిణి, కుమారుడు నారా దేవాన్షతో లోకేశ గడిపారు. ఒకరోజంతా వారితో ఆనందం, సంతోషాలు పంచుకున్నారు. కందనవోలు దాటి నవ నందుల కోట నంద్యాల జిల్లాలో అడుగు పెట్టే రోజు మరదలు, తోడల్లుడు లోకేశతో కలసి పాదయాత్ర సాగించారు. రాష్ట్ర నాయకులు జిల్లాలో లోకేశ పాదయాత్రలో పాలుపంచుకున్నారు.

ఏపీ అప్పుల కుప్ప

- రాయలసీమ ద్రోహి సీఎం జగన : బీటీ నాయుడు

- చంద్రబాబుతోనే ప్రాజెక్టుల పూర్తి : సోమిశెట్టి

- గూడూరులో టీడీపీ సంఘీభావ పాదయాత్ర

గూడూరు, జూలై 11: రాయలసీమ నుంచి సీఎంగా కొనసాగుతున్న జగన మోహన రెడ్డి రాషా్ట్రన్ని అప్పుల కుప్పగా మార్చేశాడని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులను ప్రక్కన పెట్టిన సీఎం జగనమోహన రెడ్డి రాయలసీమ ద్రోహిగా నిలిచాడన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ చేపట్టిన యువగళం పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం టీడీపీ నాయకులు కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలంలోని బుడిదపాడు నుంచి కె.నాగలాపురం వరకు సంఘీభావ పాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు భవిష్యతకు గ్యారెంటీ ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలను విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ హయాంలో ఏ ఒక్కరికి మంచి జరగలేదని రాషా్ట్రన్ని దోచిందంతా తాడేపల్లె ప్యాలెస్‌కు తరలించారన్నారు.

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీఎం జగనమోహన రెడ్డి సంక్షేమం పేరుతో రాషా్ట్రన్ని అప్పుల ఆంధ్రప్రదేశ మార్చారన్నారు. టీడీపీ హయాంలో ఈ ప్రాంత రైతుల కోసం చంద్రబాబు నాయుడు గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టుకు నిధులు ఇస్తే వైసీపీ గద్దె నెక్కిన తర్వాత సీఎం జగనమోహన రెడ్డి ఒక్క ప్రాజెక్టును కూడా కట్టలేదని రాయలసీమ ద్రోహిగా నిలిరన్నారు. ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మళ్ళి చంద్రబాబే సీఎం కావాలన్నారు. పార్టీలో ఎవరూ గ్రూపులు కట్టకూడదని, ఎవరైనా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు ఇనచార్జ్‌ ఆకెపోగు ప్రభాకర్‌, గూడూరు మండల, అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి, నాయకులు గజేంద్ర గోపాల్‌ నాయుడు, కోట్ల కవితమ్మ, సీబీ లత, గోవింద్‌ గౌడ్‌, శివశంకర్‌ నాయుడు, దండు సుందరరాజు, నాగప్పయాదవ్‌, సుమనబాబు, కురువ వెంకట్రాముడు, కె నాగలాపురం శ్రీను, ఎంపీటీసీ మద్దిలేటి, చిన్న గిడ్డయ్య, మునగాల గోపాల్‌, బంగారు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-07-12T00:08:49+05:30 IST